ఆధ్యాత్మికం.. ఆహ్లాదం

ABN , First Publish Date - 2022-10-02T05:42:44+05:30 IST

బనగానపల్లె ప్రాంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది.

ఆధ్యాత్మికం.. ఆహ్లాదం

ప్రసిద్ధి చెందిన ఆలయాలతో భక్తుల పరవశం
అందమైన ప్రదేశాలతో ఆహ్లాదకర వాతావరణం
పర్యాటకులను కట్టిపడేస్తున్న బనగానపల్లె ప్రాంతం


బనగానపల్లె ప్రాంతం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. ప్రసిద్ధి చెందిన ఆలయాలు.. అందమైన ప్రదేశాలు కనువిందు చేస్తున్నాయి. బనగానపల్లె అనగానే భక్తులకు ముందుగా గుర్తొచ్చేది వీరబ్రహ్మేంద్ర స్వాములవారు. ఆయన తిరిగింది.. కాలజ్ఞానం రాసింది ఇక్కడే కావడంతో ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధిగాంచింది. అలాగే బెలుంగుహలు, పాతపాడు బంగ్లాతోపాటు నందవరం చౌడేశ్వరీమాత ఆలయం కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దీంతో ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి నిత్యం భక్తులు తరలి వస్తున్నారు. ఆలయా లు, అందమైన ప్రదేశాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.

- బనగానపల్లె

యాగంటి విశిష్టత..

బనగానపల్లె నుంచి యాగంటి క్షేత్రం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్నూలు నుంచి 87 కిలోమీటర్ల దూరంలో ఉంది. యాగంటిలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో గదులు ఉన్నాయి. అలాగే బ్రాహ్మణి రెసిడెన్షిలో ఏసీ గదుల సౌకర్యం ఉంది. ప్రస్తుతం యాగంటి క్షేత్రానికి 24 గంటల విద్యుత్‌ సౌకర్యం, పచ్చని చెట్లు, మినరల్‌ వాటర్‌ సౌకర్యం కల్పించారు. వేలాది మంది యాత్రికులు వస్తుంటారు. భక్తులు కూర్చోవడానికి హాల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. అలాగే వృద్ధులు, పెద్దలు ఆలయంలోకి వెళ్లాలంటే మెట్లు ఎక్కాల్సి ఉంది. అందుకే వారు ఆలయానికి సులభంగా వెళ్లేందుకు లిఫ్ట్‌ సౌకర్యం కల్పించడానికి ప్రతిపాదనలు పంపారు.

ఎలా వెళ్లాలి:

 కర్నూలు నుంచి బనగానపల్లెకు 75 కిలోమీటర్ల దూరం. బనగానపల్లె నుంచి యాగంటికి 12 కిలోమీటర్లు. నిత్యం ఆటోలు తిరుగుతుంటాయి. ప్రతి రోజూ ఉదయం, మధాఽ్యహ్నం, సాయంత్రం ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. వాహనాల్లో భక్తులు అధికంగా వస్తుంటారు.

బెలుంగుహలు

 కొలిమిగుండ్ల మండలంలో ప్రఖ్యాతిగాంచిన బెలుం గుహలు ఉన్నాయి. వీటిని మరింత అభివృద్ధి చేయడానికి టూరిజం శాఖ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం గుహల్లో 27 బ్లోయర్లను ఏర్పాటు చేశారు. 2000లో బెలుం గుహలను అభివృద్ధి చేసి ప్రారంభించారు. రోజూ వివిధ రాష్ట్రాల నుంచి రెండు వేల మంది యాత్రికులు వీటిని సందర్శిస్తుంటారు. సెలవు రోజుల్లో అధికంగా వస్తుంటారు. గుహల్లో ప్రకృతి సిద్ధమైన శిలాజాలను చూడడానికి వస్తుంటారు. విదేశీయులు కూడా గుహలను సందర్శిస్తుంటారు. గుహల్లో ధ్యానమందిరం, ఊడలమర్రి, పాతాళగంగ, మాయమందిరం, కోటి లింగాలు, యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తుంటాయి. ఇక్కడ బుద్ధ విగ్రహం ఉంది.  బెలుం గుహల్లో నాలుగు డార్మెటరీ గదులు మాత్రమే ఉన్నాయి.

ఎలా వెళ్లాలి : బనగానపల్లె నుంచి బెలుంగుహలకు 35 కిలోమీటర్ల దూరం. జిల్లా కేంద్రమైన కర్నూలుకు 110 కిలోమీటర్ల దూరం. బనగానపల్లె నుంచి ప్రతి అరగంటకు ఒక బస్సు ఉంది.

అవుకు రిజర్వాయరులో బోట్‌ షికార్‌

అవుకు పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో అవుకు రిజర్వాయరు ఉంది. ఇక్కడ రూ.2కోట్లతో టూరిజం శాఖ బోటింగ్‌ ఏర్పాటు చేసింది. యాత్రికులు సేదతీరడానికి విడిది కూడా నిర్మించారు. పిల్లలు ఆడుకోవడానికి పార్కు ఏర్పాటు చేశారు. బోట్‌ సౌకర్యం అందుబాటులో ఉంది. రిజర్వాయరును చూసేందుకు అధిక సంఖ్యలో యాత్రికులు వస్తున్నారు. స్పీడ్‌ బోట్లు, మరబోట్ల సౌకర్యం ఏర్పాటు చేశారు.

నవాబు బంగ్లా

 బనగానపల్లె పట్టణానికి 10 కిలోమీటర్ల దూరంలో పాతపాడు గ్రామం వద్ద ఉంది. వంద సంవత్సరాల క్రితం బనగానపల్లె నవాబుల కాలంలో నిర్మించారు. ఇప్పటికీ ఈ కట్టడం చెక్కుచెదరలేదు. ఈ బంగ్లా వద్దనే అరుంధతి సినిమాను తీశారు. అందుకే దీన్ని అరుంధతి బంగ్లా అని కూడా అంటారు. ఇక్కడ అనేక సినిమాలు, సీరియల్స్‌ షూటింగ్‌లు జరిగాయి. యాగంటికి వచ్చే యాత్రికులు తప్పనిసరిగా నవాబు బంగ్లాను సందర్శిస్తుంటారు.


చౌడేశ్వరీ మాత ఆలయం

నందవరంలో చౌడేశ్వరీమాత ఆలయం ఉంది. యాత్రా స్థలంగానే కాక ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతోంది. కాశీవిశాలాక్షిగా నందవరం చౌడేశ్వరీమాత ఖ్యాతి పొందింది. నిత్యం వందలాది మంది భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. జిల్లా నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచి నిత్యం వాహనాల్లో వస్తుంటారు. ఉగాది ఉత్సవాల సందర్భంగా లక్షలాది మంది భక్తులు మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఏపీ నుంచి వస్తుంటారు. కర్నూలుకు 85 కిలోమీటర్ల దూరంలో, బనగానపల్లెకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. బనగానపల్లె నుంచి 20 నిమిషాలకోసారి బస్సు సౌకర్యం ఉంది.

Read more