కొడుకు ఊయలతో ఉరి

ABN , First Publish Date - 2022-02-19T05:36:32+05:30 IST

ఆ తల్లికి తీవ్రమైన మనోవ్యథ కలిగింది. భర్త ఇక మారడని జీవితంపై విరక్తి చెందింది.

కొడుకు ఊయలతో ఉరి

 భార్య, భర్త మధ్య తగాదాలే కారణం
కన్నతల్లి ఆత్మహత్యను కళ్లారా  చూసిన కూతురు
డనాపురంలో విషాదం

ఆదోని రూరల్‌, ఫిబ్రవరి 18: ఆ తల్లికి తీవ్రమైన మనోవ్యథ కలిగింది. భర్త ఇక మారడని జీవితంపై విరక్తి చెందింది. కొడుకు ఊయలకే ఉరేసుకున్నది. ఈ ఘటన మండలం డనాపురం గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఆంజనేయులు అలియాజ్‌ అంజికి 18 సంవత్సరాల క్రితం కౌతాళం పట్టణంలోని ఎన్టీఆర్‌ కాలనీకి చెందిన సమీప బంధువు లక్ష్మి అలియాజ్‌ ఈరమ్మ (43)తో పెళ్లయింది. వీరికి నలుగురు పిల్లలు. పొట్టకూటి కోసం గుంటూరుకు వలస వెళ్లారు. అయితే తాగుడుకు, ఇతర వ్యసనాలకు బానిసైన ఆంజనేయులు నిరంతరం భార్య లక్ష్మితో గొడవకు దిగేవాడు. ఈ నెల 16వ తేదీన ఆంజనేయులు సమీప బంధువు రామాంజనేయులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దహన సంస్కారాలకు 17వ తేదీన  భార్యాభర్తలు ఇద్దరు పిల్లల్ని గుంటూరులోనే వదిలి డనాపురం వచ్చారు. అయితే రామాంజనేయులు అంత్యక్రియల్లో భార్య పాల్గొనలేదని ఆంజనేయులు గురువారం రాత్రి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆమె తీవ్ర మనస్తాపం చెందింది భర్త ఇక మారడని భావించింది. అన్న గంగన్నకు ఫోన్‌ ద్వారా తన కష్టం చెప్పుకుంది. ఆయన ఉదయాన్నే వస్తానని చెప్పాడు. ఆ రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయారు. శుక్రవారం తెల్లవారుజామున 10 ఏళ్ల కూతురు సుజాత తన పక్కన తల్లి లేకపోవడంతో లేచి చూసింది. తమ్ముడి ఊయలకు తల్లి వేలాడుతూ కొట్టుమిట్టాడుతున్న దృశ్యం చూసింది. గాడనిద్రలో ఉన్న తండ్రిని లేపింది. ఆంజనేయులు ఊయలకు వేలాడుతున్న భార్యను కిందికి దించాడు. అప్పటికే ఆమె మరణించింది.  ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి ఘటనా స్థలానికి చేరుకుని ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 
న్యాయం చేయండి

 ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి బిడ్డలకు పోలీసులు న్యాయం చేయాలి.  మా చెల్లెలు ఇట్లా ఆత్మహత్య చేసుకుంటుందని అనుకోలేదు. -గంగన్న, మృతురాలి అన్న

Updated Date - 2022-02-19T05:36:32+05:30 IST