అశ్వవాహనంపై శివపార్వతులు

ABN , First Publish Date - 2022-03-05T05:53:37+05:30 IST

శ్రీశైలంలో ఫిబ్రవరి 22న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం పూర్తయ్యాయి. ప్రతిరోజూ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, వాహనసేవలు నిర్వహించారు.

అశ్వవాహనంపై శివపార్వతులు
అశ్వవాహనంపై విహరిస్తున్న ఆదిదంపతులు

ఉత్సవమూర్తులకు పుష్పోత్సవం, శయనోత్సవం
శ్రీశైలంలో ముగిసిన శివరాత్రి బ్రహ్మోత్సవాలు


శ్రీశైలం, మార్చి 4: శ్రీశైలంలో ఫిబ్రవరి 22న ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం పూర్తయ్యాయి. ప్రతిరోజూ స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, వాహనసేవలు నిర్వహించారు. చివరి రోజు శుక్రవారం భ్రమరాంబ సమేత మల్లికార్జునుడు అశ్వవాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. సాయంత్రం అక్కమహాదేవి అలంకార మండపంలో స్వామిఅమ్మవార్లకు పుష్పోత్సవం జరిపారు. పసుపు బంతి, పసుపు చేమంతి, తెల్ల చేమంతి, నీలం చేమంతి, నందివర్ధనం, గరుడవర్ధనం, మందారం, ఎర్ర ఆస్టర్‌, నీలం ఆస్టర్‌, మల్లెలు, కాగడాలు, కనకాంబరాలు, ఎర్రగులాబీలు, పసుపు గులాబీలు, బహువర్ణ గులాబీలను పుష్పోత్సవానికి వినియోగించారు. అనంతరం ఉత్సవమూర్తులకు ఏకాంతసేవ నిర్వహించి శయనోత్సవం జరిపించారు.


శ్రీగురు రాఘవేంద్రా..

శ్రీమంఠంలో గురుభక్తి ఉత్సవాలు ప్రారంభం
స్వామి బంగారు పాదాలకు అభిషేకం


మంత్రాలయం, మార్చి 4: మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి గురుభక్తి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మొదటి రోజు పీఠాధిపతి శ్రీసుబుధేంద్రతీర్థులు రాఘవేంద్రస్వామి బంగారు పాదుకలను బంగారు సింహాసనంపై ఉంచి పుష్పాలు, గంగాజలం, బంగారు నాణేలు, ముత్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం బంగారు పాదుకలను భక్తులకు చూపించారు. భజన మండళ్ల గీతాలు, కోలాట నృత్యాలు, మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ బంగారు రథం మఠం ప్రాకారంలో ఊరేగించారు. అంతకుముందు రాఘవేంద్ర స్వామి మూల బృందావనానికి విశేష పూజలు నిర్వహించి బంగారు, వెండి, పట్టువస్త్రాలతో అలంకరించారు. రాఘవేంద్రస్వామి మహిమలు, జీవితఘట్టాల గురించి పీఠాధిపతి భక్తులకు దివ్యసందేశాన్ని ఇచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. కార్యక్రమంలో పండిత కేసరి, విద్వాన్‌, రాజా ఎస్‌ గిరిరాజాచార్‌, ఏఏవో మాధవశెట్టి, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతాచార్‌, మేనేజర్‌ వెంకటేష్‌ జోషి, అసిస్టెంట్‌ మేనేజర్‌ ఐపీ నరసింహ మూర్తి, ఈఈ సురేష్‌ కోనాపుర్‌, గౌతమాచార్‌, సుధీంద్రాచార్‌, భద్రినాథాచార్‌, వ్యాసరాజాచార్‌, జయతీర్థచార్‌, ద్వారపాలక అనంతస్వామి, డీఎం ఆనందరావు, వాజేంద్రాచార్‌, పవమానాచార్‌, భీమ్‌సేన్‌ రావ్‌ పాల్గొన్నారు.

మహానందీశ్వరుడి తెప్పోత్సవం

మహానంది, మార్చి 4: మహానంది రుద్రగుండం కోనేరులో శుక్రవారం రాత్రి ఉత్సవమూర్తులు తెప్పపై విహరించారు. ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలోని కోనేరు వద్దకు తీసుకొచ్చారు. అనంతరం పూలతో అలంకరించిన తెప్పపై ఆశీనులను చేసి వేదపండితులు పూజలు చేశారు. అనంతరం రుద్రగుండంలో గంటపాటు తెప్పోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్‌రెడ్డి, పాలకమండలి చైర్మన్‌ పాల మహేశ్వరరెడ్డి, భక్తులు పాల్గొన్నారు. కాగా తెప్పను తమిళనాడు రాష్ట్రం అంబూరుకు చెందిన జగన్‌ బృందం తీర్చిదిద్దారు.

Updated Date - 2022-03-05T05:53:37+05:30 IST