ఆవేదన.. ఆగ్రహం

ABN , First Publish Date - 2022-12-07T00:23:07+05:30 IST

మండలాల్లోని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సహకరించడం లేదని జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆవేదన.. ఆగ్రహం

అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదు

అంగన్‌వాడీ కేంద్రాలకు కుళ్లిపోయిన గుడ్లు

నాంపల్లి సొసైటీలో అక్రమాలపై విచారణ చేపట్టాలి

రోడ్లు వేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదు

జడ్పీ సమావేశంలో సమస్యల గళం వినిపించిన జడ్పీటీసీలు

గుడ్ల సరఫరాపై థర్డ్‌ పార్టీతో విచారణ

వాస్తవమని తేలితే సీడీపీవోలపై చర్యలు: మంత్రి బుగ్గన

హాల్లో జడ్పీటీసీల బంధువుల హడావుడి

ఒక్క తీర్మానంతోనే ముగిసిన సమావేశం

కర్నూలు (న్యూసిటీ), డిసెంబరు 6: మండలాల్లోని సమస్యలను పరిష్కరించడానికి అధికారులు సహకరించడం లేదని జడ్పీటీసీలు, ఎంపీపీలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్‌ సమావేశ భవనంలో జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి, ఇన్‌చార్జి మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లా కలెక్టర్లు పి.కోటేశ్వరరావు, మనజీర్‌ జిలానీ సామూన్‌, ఆళ్లగడ్డ, కోడుమూరు ఎమ్మెల్యేలు గంగుల బిజేంద్రనాథరెడ్డి, డా.జె .సుధాకర్‌ హాజరయ్యారు. ఉదయం 11.40 గంటలకు ప్రారం భమైన సమావేశం మధ్యాహ్నం 2.15 గంటలకు ముగిసింది. ఉమ్మడి జిల్లాలకు సంబంధించి అజెండాలో డీఆర్‌డీఏ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, పౌరసరఫరాల శాఖల పని తీరుపై చర్చించారు. మిగతా శాఖలపై ఎటువంటి చర్చ రాలేదు.

గుడ్ల సరఫరాపై ఆందోళన..

ఉమ్మడి జిల్లాలోని జూపాడుబంగ్లా, క్రిష్ణగిరి, కర్నూలు, దొర్నిపాడు, కోడుమూరు తదితర మండలాల్లో అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లు నెలకోసారి సరఫరా చేస్తున్నారని ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని గుడ్లు సరఫరా చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా థర్డ్‌ పార్టీతో విచారణ చేయించి వాస్తవాలని తేలితే సీడీపీవోలపై చర్యలు తీసుకుంటామని అన్నారు. కర్నూలు మండల పరిధిలోని ప్రజానగర్‌ కాలనీలో 1500 ఇళ్లు ఉన్నాయని, అక్కడ ఒక్క అంగన్‌వాడీ కేంద్రం ఏర్పాటు చేయలేదని కోడుమూరు ఎమ్మెల్యే డా.జె.సుధాకర్‌ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.

జీతాలు రావడం లేదు..

తాము ఎన్నికై సంవత్సరమైనా ఇప్పటి వరకు జీతాలు రావడం లేదని ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటూ ఎంపీపీలు సమావేశం దృష్టికి తెచ్చారు. తాము గ్రామాలకు వెళితే పదవి పూర్తయ్యాక జీతాలు ఇస్తారా అని అడుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మండలాల్లో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం లేదని, ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా సమాచారం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక మంత్రి స్పందించి ఎంపీటీసీలకు జీతాలు ఇప్పించాలని కోరారు.

బడ్జెట్‌ ప్రకటన..

జిల్లా పరిషత్‌ 2022-23 సంవత్సరానికి సంబంధించి సవరణ బడ్జెట్‌, అంచనాలను డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి వివరించారు. 2023-2024కు సంబంధించి ఆదాయం రూ.924.743 కోట్లు, వ్యయం రూ.924.670 కోట్లుగా బడ్జెట్‌ రూపొందించారు. ఇందులో జిల్లా పరిషత్‌కు సంబంధించి ఆదాయం రూ.12.850 కోట్లు, వ్యయం రూ.12.738 కోట్లు కాగా ఇతర అనుబంధ శాఖలకు సంబంధించి ఆదాయం రూ.911.893 కోట్లు, వ్యయం రూ.911.869 కోట్లు ప్రకటించారు.

ఒకే ఒక్క తీర్మానం..

సర్వసభ్య సమావేశంలో వివిధ అంశాలపై తీర్మానాలు చేస్తుంటారు. బడ్జెట్‌కు సంబంధించిన ఒక్క తీర్మానం మాత్రమే చేశారు. మిగతా వాటిని పట్టించుకోకుండానే సమావేశం ముగించారు.

బంధువుల హడావుడి

జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశంలో నిబంధనలను గాలికి వదిలేశారు. కొందరు జడ్పీటీసీలు తమ బంధువులు, పీఏలను సమావేశ భవనంలో కూర్చోబెట్టుకుని ఫొటోలు తీయించుకోవడం.. మాట్లాడుకోవడం చర్చనీయాంశమైంది. ఏకంగా ఓ జడ్పీటీసీ పీఏ తమ జడ్పీటీసీ మాట్లాడటానికి మైక్‌ ఇవ్వాలని బెదిరింపులకు దిగాడు. సభ్యులు తప్ప మిగిలిన వారు బయటికి వెళ్లాలని జడ్పీ చైర్మన్‌ పలుమార్లు సూచించినా ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.

బాధ్యతగా వ్యవహరించండి..

గత సమావేశంలో సీపీసీడబ్ల్యూల స్కీంలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని అడిగినా ఎందుకు స్పందించడం లేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. సీపీఎస్‌డబ్ల్యూ స్కీంలకు అధికారులు అనవసర ప్రతిపాదనలు పంపి సమయాన్ని వృథా చేస్తున్నారని మండిప్డారు. స్కీంలకు ఎంతవరకు మరమ్మతులు ఉంటే అంతవరకే అంచనాలు వేయాలని అన్నారు. పైప్‌లైన్ల నిర్మాణంలో నాణ్యత లోపాలు ఎక్కువగా ఉన్నాయని, అలాంటి సమస్యలను పరిష్కరించడానికి తనతో వచ్చి చర్చించాలని గత సమావేశంలో చెప్పానని, అయినా ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

ఒక్క మంత్రి.. ఇద్దరు ఎమ్మెల్యేలు

ఉమ్మడి జిల్లాలో 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశానికి మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్‌, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్‌రెడ్డి మాత్రమే హాజరయ్యారు. మిగిలిన మంత్రి, ఇద్దరు ఎంపీలు, పది మంది ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.

సమస్యలపై సభ్యుల గళం

కొత్తపల్లి మండలంలోని నాంపల్లి సొసైటీలో రూ.9 కోట్లు దుర్వినియోగమయ్యాయని, వాటిపై విచారణ చేపట్టాలని జడ్పీటీసీ సుఽధాకర్‌రెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. డీఆర్‌డీవోకు సంబంధించి మండలాల్లో బుక్‌కీపర్‌గా మహిళలనే నియమించాలని నిబంధనలు ఉన్నా పురుషులను ఏవిధంగా నియమిస్తారని నందికొట్కూరు ఎంపీపీ పి.మురళికృష్ణారెడ్డి డీఆర్‌డీఏ అధికారులను ప్రశ్నించారు. కొందరు బుక్‌ కీపర్లు గ్రామాల్లో డబ్బులు వసూలు చేసుకుని పెత్తనం చెలాయిస్తున్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. మండల పరిధిలోని కోనేటమ్మపల్లిలో రూ.2 లక్షల గోల్‌మాల్‌ జరిగిందని, విచారణ జరిపించాలని కలెక్టర్‌ను కోరారు. మరికొందరు జెడ్పీటీసీలు తమ పరిధిలోని సమస్యలను ఏకరువు పెట్టారు.

ఆదాయ వనరుల పెంపునకు సహకరించాలి

జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ పరిధిలో ఆదాయ వనరులు పెంచుకునేందుకు జడ్పీటీసీలు, ఎంపీపీలు సహకరించాలని జడ్పీ చైర్మన్‌ ఎర్రబోతుల పాపిరెడ్డి కోరారు. ప్రొటోకాల్‌ విషయం పునరావృతం కాకుండా అధికారులు చూసుకోవాలని అన్నారు. సమావేశంలో జడ్పీ సీఈవో జి.నాసరరెడ్డి, డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, వైస్‌ చైర్మన్‌ దిల్షాద్‌నాయక్‌, పీఆర్‌ ఎస్‌ఈ కే.సుబ్రమణ్యం, ఆర్‌డబ్ల్యూఎస్‌ కర్నూలు, నంద్యాల ఎస్‌ఈలు నాగేశ్వరరావు, మనోహర్‌, ఈఈలు రామక్రిష్ణారెడ్డి, ఎస్‌ఈసీ మద్దన్న, కో ఆప్టెడ్‌ సభ్యులు సయ్యద్‌ సులేమాన్‌, వీరశైవ లింగాయత్‌ చైర్మన్‌ రుద్రగౌడు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:23:12+05:30 IST