‘రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి’

ABN , First Publish Date - 2022-10-08T06:13:26+05:30 IST

పొలాలు, గ్రామాల రీసర్వేను పొరపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని ఆత్మకూరు ఆర్డీవో దాసు మండల సర్వేయర్లకు, వీఆర్వోలకు, రెవెన్యూ సిబ్బందికి సూచించారు.

‘రీ సర్వేను పకడ్బందీగా చేపట్టాలి’
మిడుతూరు తహసీల్దార్‌ కార్యాలయంలో మాట్లాడుతున్న ఆర్డీవో దాసు

నందికొట్కూరు రూరల్‌, అక్టోబరు 7: పొలాలు, గ్రామాల రీసర్వేను పొరపాట్లు లేకుండా పకడ్బందీగా చేపట్టాలని ఆత్మకూరు ఆర్డీవో దాసు మండల సర్వేయర్లకు, వీఆర్వోలకు, రెవెన్యూ సిబ్బందికి సూచించారు. శుక్రవారం మిడుతూరు మండల తహసీల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ సిరాజ్జుద్దీన్‌ ఆధ్వర్యంలో రేవెన్యూ వ్యవసాయ, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్డీవో మిడుతూరు మండల నుంచి భూతగాదాలు గ్రీవెన్స్‌లో ఎక్కువగా వస్తున్నాయని, వాటిని ఇక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీఆర్వోలు క్షేత్ర స్థాయిలో పర్యటించి రైతులకు భూ సమస్యలను లేకుండా చేయాలన్నారు. ఈ మండలంలో వీఆర్వోలపై రైతుల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపారు. ఈ క్రాప్‌ నమోదు జాప్యం చేయకూడదని తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు పీరునాయక్‌, రంగారెడ్డి, అధికారులు పాల్గొన్నారు. 


‘రైతుల నుంచి సమగ్ర వివరాల సేకరణ’


నందికొట్కూరు: భూములు కోల్పోతున్న రైతుల సమగ్ర వివరాలను సేకరించాలని ఆత్మకూరు ఆర్డీవో దాసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం 340-సి జాతీయ రహదారి భూసేకరణ కోసం అవార్డు విచారణ స్టేట్‌మెంట్‌లో భాగంగా రైతుల నుంచి వివరాలను స్వీకరించే కార్యక్రమాన్ని పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేశారు. ఆర్డీవో మాట్లాడుతూ నందికొట్కూరు మండలంలోని బ్రాహ్మణకొట్కూరు, దామగట్ల, 10బొల్లవరం, నందకొట్కూరు పట్టణ పరిధిల్లో 229 మంది రైతుల నుంచి 180.61 ఎకరాలను సేకరిస్తున్నట్లు తెలిపారు. ఇందులో బ్రాహ్మణకొట్కూరు పరిధిలో 97 మంది రైతులకు సంబంధించిన 56.52 ఎకరాల భూమిని, దామగట్ల గ్రామంలో 12 మంది రైతులకు సబంధించి 10.20 ఎకరాల భూమిని, 10 బొల్లవరం గ్రామంలో 65 మంది రైతులకు సంబంధించి 60ఎకరాల భూమిని, నందికొట్కూరు గ్రామంలో  55 మంది రైతులకు సంబంధించి 53.89 ఎకరాల భూమిని సేకరిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా బాధిత రైతులు ఎవరు, ఒరిజనల్‌ డాక్యుమెంట్ల పరిశీలన, 13 సంవత్సరాల ఈసీ, అడంగల్‌, ఆర్‌వోఆర్‌1(బి), ఆధార్‌ కార్డు, బ్యాంకు, పట్టాదారు పాసు పుస్తకాలు, టైటిలు డెడ్‌, విక్రయం, దానం, భాగపరిష్కారం దస్తావేజుల నకలు, కట్టడములకు సంబంధించిన నకల్లను రైతుల నుంచి సేకరించామని తెలిపారు. జూపాడుబంగ్లా, పాములపాడు మండలాల్లో విచారణ పూర్తయ్యిందని, నందికొట్కూరు, మిడ్తూరు మండలాల్లో  విచారణ చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే అవార్డు పాసు అవుతుందని ఆయన తెలిపారు. రైతుల నుంచి ఒప్పంద పత్రాలు స్వీకరిస్తున్నామన్నారు. నందికొట్కూరు తహసీల్దార్‌ రాజశేఖర్‌బాబు, జూపాడుబంగ్లా తహసీల్దార్‌ పుల్లయ్య, నందికొట్కూరు ఆర్‌ఐ సత్యనారణ, తదితరులు పాల్గొన్నారు. 

Read more