సీమ రైతుల వ్యథలే ‘వాన మెతుకులు’

ABN , First Publish Date - 2022-04-25T04:55:06+05:30 IST

రాయలసీమ రైతుల బతుకు వెతలను ‘వాన మెతుకులు’ కథల సంపుటి ఆవిష్కరిస్తున్నదని హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఈ. వెంకటేశ అభిప్రాయపడ్డారు.

సీమ రైతుల వ్యథలే ‘వాన మెతుకులు’

కథా సంకలనం ఆవిష్కరణ సభలో ఇ.వెంకటేశ

కర్నూలు (కల్చరల్‌), ఏప్రిల్‌ 24: రాయలసీమ రైతుల బతుకు వెతలను ‘వాన మెతుకులు’ కథల సంపుటి ఆవిష్కరిస్తున్నదని హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయ ఆచార్యుడు ఈ. వెంకటేశ అభిప్రాయపడ్డారు. ఆదివారం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో రాయలసీమ ప్రచురణలు సంస్థ వెలువరించిన  ‘వాన మెతుకులు’ కథల సంకలనం ఆవిష్కరణ సభ నిర్వహించారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఈ. వెంకటేశ ముఖ్య అతిథిగా హాజరై కథల సంకలనం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంపుటిలోని కథలన్నీ రైతుల కన్నీటి జీవితానుభవాలకు దగ్గరగా ఉన్నాయని అన్నారు.  గోనెగండ్ల మండలం, రాళ్లదొడ్డికి చెందిన రైతు డీజీ ఈరన్న మాట్లాడుతూ రైతు ఎంత నష్టపోయినా వ్యవసాయాన్ని వీడడని, మట్టికి, రైతుకు ఉన్న అనుబంధం గొప్పదని చెప్పారు. న్యూ సోషలిస్ట్‌ ఇన్సియేటివ్‌ ఆఫ్‌ ఇండియా కన్వీనర్‌ జి. భార్గవ మాట్లాడుతూ రైతు జీవితాలను చిత్రించడమేగాక పాలకుల దుర్మార్గాలను కూడా ఈ సంకలనం ఎండగడుతుందని అన్నారు. గుర్రాల ట్రస్టు, కెనడాలోని తెలుగు పత్రిక తెలుగుతల్లి సంయుక్తంగా ప్రకటించిన గుర్రాల లక్ష్మీప్రసాద్‌ స్మారక పురస్కారం ఊరిమర్లు కథారచయిత పౌరోహితం మారుతికి  జి. వెంకటకృష్ణ చేతుల మీదుగా ఈ సభలో అందజేశారు. ఇనాయతుల్లా, గజల్‌ గాయకుడు మహ్మద్‌ మియాతోపాటు పలువురు సాహితీవేత్తలు, సాహిత్యాభిమానులు పాల్గొన్నారు. 


Read more