-
-
Home » Andhra Pradesh » Kurnool » Purnahuti for Shivratri celebrations-NGTS-AndhraPradesh
-
శివరాత్రి ఉత్సవాలకు పుర్ణాహుతి
ABN , First Publish Date - 2022-03-05T05:40:11+05:30 IST
మహానంది శివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం మహా పూర్ణాహుతితో ముగిశాయి.

- మహానందిలో ధ్వజావరోహణం
- నంద్యాలకు బయలుదేరిన ఉత్సవమూర్తులు
మహానంది, మార్చి 4: మహానంది శివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం మహా పూర్ణాహుతితో ముగిశాయి. ఉదయం ఆలయంలో ఉత్సవమూర్తుల విగ్రహాలకు ఆలయ వేదపండితులు, రుత్వికులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కలశపూజ, నాకబలిపూజలను శాస్ర్తోక్తంగా జరిపారు. అంతకుమందు రుద్రగుండం కోనేరులోని జలాలను ప్రధాన గర్భాలయంలో పోసి అభిషేకాలను నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తుల విగ్రహాలతో పాటు పెళ్లి పెద్దగా వచ్చిన నంద్యాల బ్రహ్మానందీశ్వరుని ఉత్సవమూర్తుల విగ్రహాలను ప్రత్యేక పల్లకిలో రుద్రగుండం కోనేరులోకి తీసుకొచ్చి భక్తి శ్రద్ధలతో త్రిశూల స్నానం చేయించారు. కోనేరు గట్టుపై ఉన్న ధ్వజాన్ని అవరోహణం చేశారు. యాగశాల మండపంలో వివిధ ద్రవ్యాలతో మహాపుర్ణాహుతి కార్యక్రమాన్ని జరిపారు. సాయంకాలం బ్రహ్మోత్సవాల్లో మహానందీశ్వరుని కల్యాణానికి పెళ్ళిపెద్దగా వచ్చిన నంద్యాల బ్రహ్మానందీశ్వరుని ఉత్సవమూర్తుల విగ్రహాలు పల్లకిపై నంద్యాలకు బయలుదేరి వెళ్ళాయి. కార్యక్రమంలో ఆలయ ఈవో చంధ్రశేఖర్‌రెడ్డి, చైర్మన్ కొమ్మా మహేశ్వరరెడ్డి, ఏఈవో మధు పాల్గొన్నారు.
యాగంటిలో..
బనగానపల్లె: యాగంటి ఉమామహేశ్వరస్వామి క్షేత్రంలో శివరాత్రి బ్రహ్మాత్సవాలు శుక్రవారం వసంతోత్సవంతో ముగిశాయి. ఉదయం 5గంటలకు రుద్రాభిషేకం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్, ఆలయ చైర్మన్ బుచ్చిరెడ్డి, పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో నాగవల్లి, వసంతోత్సవం తెప్పోత్సవం నిర్వహించారు. వసంతోత్సవం సందర్భంగా ఉమామహేశ్వరస్వామి విగ్రహాలను ఆలయం చుట్టూ ఊరేగించారు. అనంతరం తెప్పోత్సవం నిర్వహించారు. సాయంత్రం ధ్వజావరోహణం కార్యక్రమంతో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిశాయి.
కాల్వబుగ్గలో..
ఓర్వకల్లు: కాల్వబుగ్గ రామేశ్వరస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ముగిశాయి. చివరి రోజు శుక్రవారం ఈవో డీఆర్‌కేవీ ప్రసాద్ ఆధ్వర్యంలో వేద పండితులు జంధ్యాల ప్రసాద్ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు కల్లె లక్ష్మీనారాయణశర్మ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ గుర్రాల చెన్నారెడ్డి, వెంగన్న నిర్వహించిన హోమం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హోమంలో చాముండేశ్వరి పూజ, జపాలు, నిత్య హోమం, బలిహరణ, రుద్రహోమం వంటి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం వసంతోత్సవం, సాయంత్రం పారువేట కార్యక్రమాలు జరిపారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు ఆకుల మహేష్, లీలావతమ్మ, వెంకటసుబ్బమ్మ, లక్ష్మీనారాయణ, నాగశేషయ్య, జయమ్మ, రమణమ్మ, దేవమ్మ పాల్గొన్నారు.
దుర్గా భోగేశ్వరంలో..
గడివేముల: దుర్గాభోగేశ్వరంలో గత నెల 28న ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు శుక్రవారం గ్రామోత్సవంతో ముగిశాయి. దుర్గాభోగేశ్వరుల స్వామి వార్లకు ఆలయ ప్రధాన అర్చకుడు తిరుమంజనం, నాకబలి నిర్వహించారు. అనంతరం ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ స్వామి ఉత్సవ విగ్రహాలను ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. అనంతరం పంచకోనేర్లలో ఉత్సవ విగ్రహాలకు అవభృత స్నానం చేయించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాచమల్లు గోపాలయ్య, ధర్మకర్త వెంకటరమణ పాల్గొన్నారు.