నిరసన గళం
ABN , First Publish Date - 2022-01-11T05:14:59+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొంది.
ఉద్యోగాల కోసం రోడ్డెక్కిన యువత
పీఆర్సీ ఫిట్‌మెంట్‌పై ఏపీటీఎఫ్ అసంతృప్తి
పేస్కేల్ డిమాండ్‌తో సచివాలయ ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వంపై అన్ని వర్గాల ప్రజల్లో అసంతృప్తి నెలకొంది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు నిరసన బాట పట్టారు. ఏటా ఉద్యోగ క్యాలెండర్ ఇస్తామని నమ్మించి మోసగించారని కర్నూలు నగరంలో నిరుద్యోగులు రోడ్డెక్కారు. వీరికి వివిధ విద్యార్థి సంఘాలు మద్దతుగా నిలిచాయి. పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను ఐఆర్ కంటే తక్కువగా ఇవ్వడం సరికాదంటూ కలెక్టరేట్ వద్ద ఏపీటీఎఫ్ ఆందోళనకు దిగింది. వీరికి ఏపీ ఎన్జీవోలు మద్దతుగా తెలిపారు. రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమను రెగ్యులర్ చేయాలని కోరుతూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించారు. జిల్లా అంతటా సోమవారం నిరసన గళాలు హోరెత్తాయి.
రెండేళ్లయినా రెగ్యులర్ చేయరా?
జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగుల నిరసన
కర్నూలు, జనవరి 10(ఆంధ్రజ్యోతి): రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న తమను రెగ్యులర్ చేయాలని, పే స్కేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు సోమవారం విధులను బహిష్కరించారు. నల్లబ్యాడ్జీలు ధరించి మున్సిపల్, ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిరసన తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 శాఖలకు చెందిన దాదాపు 14 వేల మంది ఉద్యోగులు విధులు బహిష్కరించారు. కర్నూలు కార్పొరేషన్ ఎదుట 132 వార్డు సచివాలయాలకు చెందిన దాదాపు 800 మంది ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లను అంగీకరించాలని ప్లకార్డులు ప్రదర్శించారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఎమ్మిగనూరులో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆదోనిలో మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో నిరసన తెలియజేశారు. కల్లూరు, కర్నూలు ఎంపీడీవో కార్యాలయాల వద్ద నిరసన తెలిపారు. గూడూరు నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన తెలిపిన ఉద్యోగులు, కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. బనగానపల్లె, జూపాడుబంగ్లాలో సచివాలయ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిరసనలో పాల్గొన్నారు. నందికొట్కూరులో నిరసన తెలిపిన అనంతరం మున్సిపల్ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. నందవరం, రుద్రవరం, ఓర్వకల్లు తదితర మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
‘తక్షణమే క్రమబద్ధీకరించాలి’
కర్నూలు (ఆర్బన్) జనవరి 10: సచివాలయ ఉద్యోగులను తక్షణమే క్రమబద్ధీకరించాలని ఆ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మద్దిలేటి డిమాండ్ చేశారు. సోమవారం నగర పాలక సంస్థ ఎదుట జిల్లా అధ్యక్షుడు బాణ భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో 132 సచివాలయాల్లో పనిచేస్తున్న 800 మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో నిరసన చేపట్టారు. మద్దిలేటి మాట్లాడుతూ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులతో పీఆర్సీ అమలుపై జరిపిన చర్చల్లో వచ్చే జూలై నాటికి ప్రొబేషన్ పూర్తి చేస్తామన్న ప్రకటనతో తమను తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందన్నారు. సీఎం జగన్ నిర్ణయం సచివాలయ ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ మాదిరి ఉందన్నారు. ఈ ప్రకటనతో 9 నెలల పాటు సర్వీసు నిబంధనలో వెనకబడిపోతామని, పదోన్నతుల్లో నష్టపోతామని తెలిపారు. సంక్రాంతి లోపు క్రమబద్ధీకరించి, మూడు నెలల జీత వ్యత్యాసాన్ని కలిపి జనవరి నెల జీతంతో పాటు ఇచ్చేలా సీఎం నిర్ణయం తీసుకోవాలన్నారు.
కేంద్ర పే రివిజన్ వద్దు: ఏపీటీఎఫ్
కర్నూలు(ఎడ్యుకేషన్), జనవరి 10: రాష్ట్రంలో కేంద్ర పే రివిజన్ అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది. కలెక్టరేట్ ఎదుట సోమవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు మాట్లాడుతూ జనవరి 7న ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరిగినది సమావేశం కాదని, కేవలం ప్రభుత్వ విధాన ప్రకటన కోసం ఆ కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. ఐఆర్ కంటే ఫిట్‌మెంట్ తక్కువగా ప్రకటించడం గత పీఆర్‌సీలలో చూడలేదని అన్నారు. పునఃపరిశీలన చేసి 27 శాతానికి తగ్గకుండా ఫిట్‌మెంట్ ఇవ్వాలని కోరారు. 11వ పీఆర్‌సీపై అశుతోష్ మిశ్రా కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని, హెచ్‌ఆర్‌ఏ, ఏఏఎస్, సీపీఎస్ రద్దు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరసనకు మద్దతు తెలిపిన ఏపీఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంగళ్‌రెడ్డి మాట్లాడుతూ ఎవరికీ ఆమోదం లేని ఫిట్మెంట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామని, దానిని సరిచేయకపోతే జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు కమలాకర్‌రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సాంబశివుడు, జిల్లా అదనపు కార్యదర్శి నగరి శ్రీనివాసులు, మహిళా ప్రతినిధి విజయలక్ష్మి, రాష్ట్ర మాజీ కౌన్సిలర్ ఇనయతుల్లా, జిల్లా అధ్యక్షుడు మాధవస్వామి, కార్యదర్శి ఇస్మాయిల్, జిల్లా కార్యదర్శి జవహర్‌లాల్, కాశన్న, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం నాయకుడు మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.
నిరుద్యోగుల ధర్నా
కర్నూలు(ఎడ్యుకేషన్), జనవరి 10: నిరుద్యోగులను మోసగిస్తే సహించేది లేదని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. డెమో క్రటిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్, ఐక్యభారత విద్యార్థి ఫెడరేషన్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నిరుద్యోగులు బిర్లా గేటు సర్కిల్‌లో సోమవారం ధర్నా చేశారు. ఈ సందర్భంగా డీఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేంద్ర, యూఎస్ ఎఫ్‌ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రకాష్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ ప్రసంగించారు. ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని, లక్షల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ ప్రకటించారని అన్నారు. అధికారంలోకి వచ్చాక మాట తప్పారని, నిరుద్యోగులను కోచింగ్ సెంటర్లకే పరిమితం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ప్రభుత్వానికి నేటికీ అవగాహన లేకపోవడం సిగ్గు చేటని అన్నారు. జాబ్ క్యాలెండర్‌పై తప్పుడు ప్రకటనలతో మోసగిస్తున్న ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి నిరుద్యోగులు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిం చారు. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు సంవత్సరాల పదవీ కాలం పెంచి తీపి కబురు చెప్పారని, నిరు ద్యోగులకు ఏ కబురు చెబుతారో వెంటనే చెప్పాలని డిమాండ్ చేశారు. గ్రూప్ 1, 2, ఎస్‌ఐ, మెగా డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేయడం లేదని అన్నారు. వేలకు వేలు ఫీజులు కట్టి శిక్షణ తీసుకుంటున్న నిరు ద్యోగులకు సమాధానం చెప్పాలని అన్నారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులను ఐక్యం చేసి వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరిం చారు. కార్యక్రమంలో డీఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శరత్, నగర నాయకులు రాజు, పీడీఎస్‌యూ నాయకులు రాము, రంగస్వామి, యూఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రాము, శివ, నిరుద్యోగులు, లక్ష్మి, రజిత, సునంద పాల్గొన్నారు.