పరిశ్రమలకు పవర్‌ హాలిడే

ABN , First Publish Date - 2022-04-09T06:10:31+05:30 IST

చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలపై కరెంట్‌ పిడుగు పడింది.

పరిశ్రమలకు పవర్‌ హాలిడే


  1. ప్రతి సోమవారం ప్రకటించిన ప్రభుత్వం
  2. లోడ్‌ రిలీఫ్‌ పేరుతో అప్రకటిత కోతలు 


కల్లూరు, ఏప్రిల్‌ 8: చిన్న, మధ్య తరహా భారీ పరిశ్రమలపై కరెంట్‌ పిడుగు పడింది. కరోనా కారణంగా కొన్ని నెలలపాటు మూతపడిన పరిశ్రమలు ఇప్పుడిప్పుడే కోలుకుంటుండగా వాటిపై విద్యుత ప్రభావం పడింది. పరిస్థితులు చక్కబడ్డాయనుకునే లోపు ప్రభుత్వం పరిశ్రమలకు ప్రతి సోమవారం పవర్‌ హాలిడే ప్రకటించింది. దీంతో ఇండసి్ట్రయలిస్టులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్‌కు సరిపడా పవర్‌ను అందించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శలు గుప్పిస్తున్నారు.


రోజుకు 835 మెగా వాట్ల విద్యుత వాడకం 

జిల్లాలో ప్రతిరోజూ 835 మెగా వాట్ల విద్యుత ఉత్పత్తి డిమాండ్‌ ఉన్నట్లు అధికారిక సమాచారం. నెలకు 158.13 మిలియన యూనిట్లు అవసరమవుతుందని విద్యుత అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో డొమెస్టిక్‌, అగ్రికల్చర్‌, పరిశ్రమలకు 748 మెగా వాట్లు ప్రస్తుతం సరఫరా చేస్తున్నట్లు సమాచారం. అందులో పరిశ్రమలకు 154, గృహ అవసరాలకు 166, అగ్రికల్చర్‌ సర్వీసులకు 340 మెగా వాట్లు విద్యుత అందిస్తున్నారు. లోడ్‌ రిలీఫ్‌ పేరుతో అప్రకటిత కోతలకు విద్యుత సంస్థల యాజమాన్యాలు తెరలేపాయి. ఒక్క రోజు విద్యుత వినియోగం 835 మెగా వాట్లు కాగా.. ప్రస్తుతం 748 మెగా వాట్ల విద్యుత మాత్రమే సరఫరా చేస్తున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. దీంతో దక్షిణ ప్రాంత విద్యుత పంపిణీ సంస్థ యాజమాన్యం అగ్రికల్చర్‌ కనెక్షన్లకు 200, ఇండస్ర్టియల్‌కు 100, లైటింగ్‌కు 100 మెగావాట్లకు సర్దుబాటు చేయాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో లోడ్‌ రిలీఫ్‌ పేరిట అప్రకటిత కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. 


జిల్లాలో 11,741 పరిశ్రమలు

జిల్లా వ్యాప్తంగా భారీ పరిశ్రమలు 648, చిన్న పరిశ్రమలు 11,093 ఉన్నాయి. దక్షిణ ప్రాంత విద్యుత సంస్థ అధికారులు 24 గంటలు పని చేసే పరిశ్రమలను 50 శాతం విద్యుత లోడుతో రన చేసుకోవాలని, అలాగే చిన్న మధ్యతరహా పరిశ్రమలకు ప్రతి సోమవారం పవర్‌ హాలిడే ప్రకటిస్తున్నామని తెలిపారు. దీంతో 9 నుంచి 22వ తేదీ వరకు ఈ నిబంధనలు కొనసాగే అవకాశం ఉంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఇప్పటికే లేబర్లు, కార్మికులకు ఒక రోజు సెలవు ప్రకటిస్తుండగా ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ఇచ్చిన ఆదేశాలతో పరిశ్రమలకు పవర్‌ హాలీడే రెండు రోజులు ఉండనుంది. 


కొనసాగనున్న అప్రకటిత కోతలు

జిల్లా వ్యాప్తంగా లోడ్‌ రిలీఫ్‌ పేరిట విధిస్తున్న విద్యుత అప్రకటిత కోతలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ జిల్లా విద్యుత శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలోని రూరల్‌ ప్రాంతాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 6 గంటల మధ్యలో గంటపాటు విద్యుత కోత ఉండనున్నట్లు విద్యుత అధికారులు స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా మున్సిపాలిటీల్లో అరగంటపాటు కోతలతోపాటు వ్యవసాయ విద్యుత కనెక్షన్లకు గ్రూపుల వారీగా 7 గంటలు మాత్రమే కరెంటు ఇవ్వనున్నట్లు తెలిపారు. 


యాజమాన్యాలు సహకరించాలి: కె.శివప్రసాద్‌ రెడ్డి, ఆపరేషన సర్కిల్‌ ఎస్‌ఈ

రాష్ట్రంలో డిమాండ్‌కు తగ్గ విద్యుత సరఫరా లేకపోవడంతో విద్యుత కోతలు అనివార్యమయ్యాయి. ఏపీఎస్‌పీడీసీఎల్‌ సీఎండీ ఆదేశాల మేరకు జిల్లాలోని పరిశ్రమలకు సోమవారం పవర్‌ హాలీడే ఇవ్వనున్నాం. 24 గంటలు నడిచే పరిశ్రమలకు 50 శాతం లోడ్‌ రిలీఫ్‌తో పరిశ్రమలను రన చేసుకోవాలి. అదేవిధంగా రూరల్‌, మున్సిపాలిటీ ప్రాంతాల్లో, అగ్రికల్చర్‌ కనెక్షన్లకు లోడ్‌ రిలీఫ్‌ పేరిట విద్యుత సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. వినియోగదారులందరూ విద్యుత శాఖకు సహకరించాలి.


Updated Date - 2022-04-09T06:10:31+05:30 IST