తపాలా.. భళా..
ABN , First Publish Date - 2022-06-14T04:45:10+05:30 IST
తపాలా శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందింపుచ్చుకొని ముందుకు సాగుతోంది.
- నాటికి నేటికీ తగ్గని సేవలు
- సాంకేతిక పరిజ్ఞానంతో అడుగులు
- విస్తరిస్తున్న మొబైల్ సేవలు
- జిల్లాలో 516 పోస్టాఫీసులు
కర్నూలు(న్యూసిటీ) జూన 13: తపాలా శాఖ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందింపుచ్చుకొని ముందుకు సాగుతోంది. ప్రజలకు సేవలందించడంలో తగ్గేదేలా అన్నట్టుగా తన పరిధిని విస్తరించుకుంటూ పోతోంది. పాతతరం పద్ధతులను పక్కనపెట్టిన నూతన ఒరవడితో ప్రత్యేకతను చాటుకుంటోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా వినియోగదారుల ఆలోచనలకు తగ్గట్టుగా సేవలందిస్తోంది. ఎన్నో రకాల కొరియర్ సర్వీసులు అందుబాటులోకి వస్తున్నప్పటికీ నేటికీ తపాలా శాఖ ద్వారానే ఉత్తరాలు, పార్సిల్‌లు ప్రజలకు అందుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆధార్ నుంచి పాస్‌పోర్టు వరకు ఎన్నో సేవలను అందిస్తూ వినియోగదారులకు మరింత చేరువవుతోంది.
నూతన పద్ధతులతో..
డిపాజిట్ల సేకరణలో నూతన పద్ధతులను అవలంబిస్తోంది. తపాలా శాఖ ఓ మొబైల్ యాప్‌ను సిద్ధం చేసింది. యాప్ ద్వారా సుమారు ఎనిమిది రకాల సేవలను పొందే సౌకర్యం కల్పించింది. యాప్ ద్వారా ప్రీమియం, వివిధ రకాల డిపాజిట్లపై వడ్డీ లెక్కలు వెంటనే తెలుసుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ ఫోనలో ప్లేస్టోర్ ద్వారా డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ అనే యాప్‌ను డౌనలోడ్ చేసుకోవాలి. దీని ద్వారా సుకన్య సమృద్ధి యోజన పథకంతోపాటు రికరింగ్ డిపాజిట్‌లో ఏడాది నుంచి ఐదేళ్ల వరకు చేసే డిపాజిట్లపై ఆదాయాన్ని తెలుసుకోవచ్చు.
- దేశంలో ఏ పినకోడ్ అయినా తెలుసుకోవచ్చు. ఊరి పేరు తెలుస్తే చాలు దాని పినకోడ్ తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. పినకోడ్ నంబరు తెలిస్తే మనకు కావాల్సిన పోస్టాఫీసు ఎక్కడ ఉంది...ఏ డివిజనలో ఉంది..ఏ ప్రధాన తపాలా కార్యాలయం పరిధిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. పోస్టేజీ కాలిక్యులేటర్ ద్వారా వినియోగదారులు పంపించే పార్సిళ్లు, పోస్టల్ కవర్లు, ఎంత బరువుకు ఎంత చెల్లించాలి. సాధారణ, స్పీడ్ పోస్టుల్లో పంపిస్తే ఎంత ఖర్చు అవుతుందనే విషయాన్ని చాలా సులభంగా స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఫీడ్‌బ్యాక్ ద్వారా పోస్టల్ సేవలకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే వివరంగా తెలుసుకోవచ్చు. సలహాలు, సూచనలు ఇచ్చే అవకాశం ఉంది. ఇంట్రస్ట్ కాలిక్యుటేలర్ ద్వారా ఏ పథకానికి ఎంత వడ్డి వస్తుంది. ఎంత మొత్తం పొందవచ్చు. ఆర్టికల్ ట్రాకింగ్ వినియోగదారులు పంపిన స్పీడ్ పోస్టు, రిజిస్టర్ పోస్టు, పార్సిల్, ఈఎంఓ ఎక్కడ ఉన్నాయి, ఎప్పుడు చేరతాయో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. కంప్లైంట్ ట్రాకింగ్ ద్వారా వినియోగదారులు ఇచ్చిన ఫిర్యాదులు ఏ దశలో ఉన్నాయి. దానికి సంబంధించిన సమాచారం ఇంకా ఏవైనా కావాలా అనే అంశాలు తెలుస్తాయి. ఇన్సూరెన్సు పోర్టల్ ద్వారా తపాలా శాఖ ద్వారా అందిస్తున్న వివిధ రకాల బీమా పథకాల సమాచారం తెలుసుకోవచ్చు. సర్వీస్ రిక్వెస్ట్ నుంచి ఇటి వద్ద సేవలు పొందేందుకు డోర్‌డెలివరీ వంటి సదుపాయాలు పొందేందుకు సమాచారం తెలుసుకోవచ్చు.
- ఇంటి వద్దనే సేవలు...
ప్రజలు పోస్టాఫీసుకు రాకుండానే ఇంటి వద్దనే సేవలు అందించే విధంగా తపాలా శాఖ నూతన పద్ధతులు తీసుకువచ్చింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నెట్‌వర్కులను ప్రజలకు చేరువ చేసింది. గతంలో వయోవృద్ధులు పోస్టాఫీసు వద్ద క్యూలో నిలబడే వారు. అయితే ప్రస్తుతం తపాలా శాఖ అందిస్తున్న సేవలతో ఇంటి వద్దనే పోస్ట్‌మెనలతో సేవలు పొందుతున్నారు. డబ్బు చెల్లించడం నుంచి డబ్బు వితడ్రా, ట్రాన్సఫర్ తదితర వాటిని ఆనలైనలోనే పూర్తి చేసుకుంటున్నారు. వినియోగదారులకు ఎటువంటి సేవలు కావాలో సమీప పోస్టాఫీసులో తెలుసుకోవచ్చు.
చెన్నకేశవులు, కర్నూలు డివిజనల్ ఇంచార్జి పోస్టల్ సూపరింటేండెంట్
అందుబాటులో పోస్టల్ సేవలు
గతంలో పోస్టాఫీసుకు వెళ్లాలంటే నిలబడాల్సిన పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అందరికి అందుబాటులో పోస్టల్ సేవలు ఇంటి వద్దకే అందుతున్నాయి. చిన్నారుల దగ్గర నుంచి వయోవృద్ధుల వరకు వివిధ రకాల పథకాల సేవలు తపాలా శాఖలో అందుతున్నాయి. డిపాజిట్లపై మెరుగైన వడ్డీ వస్తుంది. ఎన్ని వచ్చినా తపాలా శాఖకు వచ్చే ప్రజల సంఖ్య తగ్గడం లేదు. మొట్టమొదటగా ఆధార్ సెంటర్‌ను ప్రారంభించింది తపాలా శాఖనే.
- కిరణ్‌కుమార్, ప్రైవేట్ ఉద్యోగి