35 మందిపై పీడీయాక్టు

ABN , First Publish Date - 2022-09-18T05:13:11+05:30 IST

కర్నూలు రేంజ్‌ పరిధిలో 35 మంది రౌడీలపై పీడీ యాక్టు నమోదు చేశామని డీఐజీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు.

35 మందిపై పీడీయాక్టు

  1. నంద్యాల జిల్లాలో 24 మంది
  2. వీరిలో 10 మంది రౌడీషీటర్లు, 14 మంది సారా విక్రేతలు 
  3. రౌడీ ఎలిమెంట్స్‌పై గట్టి నిఘా
  4. కర్నూలు రేంజ్‌ డీఐజీ సెంథిల్‌ కుమార్‌ 


కర్నూలు, సెప్టెంబరు 17: కర్నూలు రేంజ్‌ పరిధిలో 35 మంది రౌడీలపై పీడీ యాక్టు నమోదు చేశామని డీఐజీ సెంథిల్‌ కుమార్‌ తెలిపారు. శనివారం స్థానిక డీఐజీ కార్యాలయంలో నంద్యాల ఎస్పీ రఘువీరారెడ్డితో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లాలో ఆరుగుపైన, నంద్యాల జిల్లాలో 24 మంది పైన, కడప జిల్లాలో నలుగురిపైన, అన్నమయ్య జిల్లాలో ఒకరిపైన పీడీ యాక్టు కేసులు నమోదు చేసి కడప సెంట్రల్‌ జైలుకు తరలించామన్నారు. వీరంతా గత కొన్నేళ్లుగా అనేక నేరాలకు పాల్పడుతూ పలుమార్లు జైలుకు వెళ్లి వచ్చారని, ఆ తర్వాత కూడా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని డీఐజీ వెల్లడించారు. ఆయా జిల్లాల కలెక్టర్ల ఉత్తర్వుల మేరకు వీరిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించామని తెలిపారు. నాలుగు జిల్లాల ఎస్పీలు అప్రమత్తంగా ఉన్నారని, రౌడీషీటర్ల కదలికపై నిరంతరం నిఘా ఉంచుతున్నామన్నారు. స్మగ్లింగ్‌, పేకాట, మట్కా, సెటిల్మెంట్లు ఇలాంటి అసాంఘఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నేరాలు చేసేవారు భయపడే విధంగా పోలీసు చర్యలు ఉండబోతున్నాయని వివరించారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే.. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని చెప్పారు.


  

Read more