మా గెలుపు తథ్యం

ABN , First Publish Date - 2022-09-30T05:43:46+05:30 IST

రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత స్పష్టం చేశారు.

మా గెలుపు తథ్యం
నిరాహార దీక్ష శిబిరంలో మాట్లాడుతున్న గౌరు వెంకటరెడ్డి

2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం  
ఎన్టీఆర్‌ హెల్త్‌ వర్సిటీ పేరు అలాగే ఉంచాలి
చెన్నమ్మ కూడలిలో గౌరు దంపతుల నిరాహార దీక్ష

కల్లూరు,సెప్టెంబరు 29:
రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని ఆ పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి గౌరు చరిత స్పష్టం చేశారు. హెల్త్‌ యూనివర్సిటీకి ఎన్టీఆర్‌ పేరును తొలగించడాన్ని నిరసిస్తూ బుధవారం కల్లూరు చెన్నమ్మ సర్కిల్‌లో వారు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ 1986లో ఏర్పాటు చేసిన హెల్త్‌ యూనివర్సిటీకి సీఎం జగన్‌ తన తండ్రి వైఎస్‌ పేరు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. జగన్‌ ముఖ్యమంత్రిగా అర్హుడు కాదని, వైఎస్‌ఆర్‌లో కనీసం పది శాతం పాలనా దక్షత కూడా అతనికి లేదని అన్నారు. గ్రామ పంచాయతీల నిధులు ప్రభుత్వం కాజేసిందని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని  ఆరోపించారు. 2024 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తుందని అన్నారు. అన్న క్యాంటీన్లను వైసీపీ ప్రభుత్వం తొలగించడం సరి కాదని అన్నారు. మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత మాట్లాడుతూ ఎన్టీఆర్‌ హయాంలో జిల్లాలో తెలుగుగంగ, హంద్రీ నీవా సుజల స్రవంతి, గాలేరు నగరి వంటి ప్రాజెక్టులు కట్టినా వాటికి ఆదర్శవంతంగా స్థానిక పేర్లు పెట్టారని గుర్తు చేశారు. అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తానన్న సీఎం పాలనలో వైసీపీ నాయకులు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారని అన్నారు.  పాణ్యం నియోజకవర్గంలో దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైందని  ఆరోపించారు.  కార్యక్రమంలో నంద్యాల టీడీపీ మహిళా అధ్యక్షురాలు కె.పార్వతమ్మ, కర్నూలు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ పెరుగుపురుషోత్తంరెడ్డి, వైస్‌ చైర్మన్‌ కురపాటి దేవేంద్రరెడ్డి, జడ్పీ మాజీ చైర్మన్‌ మల్లె రాజశేఖర్‌,  ఎ.వెంకటస్వామి, మండల కన్వీనర్‌ డి. రామాంజనేయులు, పెద్దపాడు చంద్రకళాధర్‌రెడ్డి ఈ దీక్షలు చేపట్టారు. అనంతరం గౌరు చరిత నిరాహార దీక్ష దీక్ష చేస్తున్న వారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. అనంతరం గౌరు వెంకటరెడ్డి అన్న క్యాంటిన్‌ ద్వారా ప్రజలకు భోజనం పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభాకర్‌ యాదవ్‌, కాసాని మహేష్‌గౌడు, జిల్లా కమిటీ నాయకులు మాదన్న, శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Read more