ఓటీఎస్ రిజిస్ట్రేషన్లను పూర్తి చేయాలి: కలెక్టర్
ABN , First Publish Date - 2022-03-05T05:47:52+05:30 IST
ఓటీఎస్ రిజిస్ట్రేషన్లు రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
నంద్యాల, మార్చి 4: ఓటీఎస్ రిజిస్ట్రేషన్లు రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నంద్యాల పట్టణంలోని మున్సిపల్ టౌన్హాల్లో స్పందన గ్రీవెన్స్, జగనన్న లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాల పురోగతి, మీ సేవా సర్వీసులు, ప్రభుత్వ భవన నిర్మాణాల పురోగతి, జగనన్న సంపూర్ణ గృఆ హక్కు పథకం తదితర అంశాలపై నంద్యాల డివిజన్ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జేసీలు రామసుందర్‌రెడ్డి, డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, వివిధ శాఖల జిల్లా అధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ప్రతి అర్జీకి జవాబుదారితనంతో తక్షణమే పరిష్కారం అందించాలని తహసీల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు. కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసులపై వెంటనే స్పందించాలన్నారు. ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. నంద్యాల డివిజన్లో 146లే అవుట్లలో 25,273 ఇళ్లు మొదటి విడతలో మంజూరయ్యాయని, వీటిలో 16,855 ఇళ్లకు జీయో ట్యాగింగ్ పెండింగ్‌లో ఉందని, వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. బేస్మెంట్ లెవెల్లో దిగువన ఉన్న ఇళ్లను వారం రోజుల్లో బేస్మెంట్ స్థాయికి తీసుకురావాలని, వచ్చే శుక్రవారం నిర్వహిస్తున్న సమావేశంలో ఇళ్ల నిర్మాణాల పురోగతిపై సమీక్షించనున్నట్లు వెల్లడించారు. నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని ఎంపీడీవో, హౌసింగ్ ఏఈలను ఆదేశించారు. ప్రతి ఇంటి నిర్మాణం కోసం రూ.1.80 లక్షలు ఖర్చు చేస్తామని, నిర్మాణానికి అవసరమైన ఇసుకను ఉచితంగా అందజేస్తామన్నారు. గ్రామ, వార్డు సెక్రటేరియట్ వారిగా లబ్ధిదారుల జాబితా తయారు చేసి అయా సెక్రటేరియట్ సిబ్బంది, వలంటీర్లతో టీంలుగా రూపొందించి, ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన టార్గెట్ పెట్టాలని ఆదేశించారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం అమలుకు సంబంధించి నంద్యాల డివిజన్లో 1,14,370 లబ్ధిదారులకుగాను 1,23,871 లబ్ధిదా రుల వివరాలను జీయో ట్యాగింగ్ చేశామన్నారు. ఎంపీడీవోలు, ఏఈవోలు సంయుక్తంగా సమావేశాలు నిర్వహించి తహసీల్దార్ల అప్రూవల్, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తదితర ప్రక్రియలను పెండింగ్‌లో లేకుండా లాగిన్లోకి వచ్చిన వెంటనే క్లియర్ చేయాలని అధికారులను ఆదేశించారు.
కార్యాలయాల పరిశీలన: జిల్లా పునర్విభజనలో భాగంగా నూతన కార్యాలయాల పరిశీలన కోసం వివిధ భవనాలను కలెక్టర్ పి.కోటేశ్వరరావు పరిశీలించారు. నూనెపల్లె రోడ్డులోని ఆర్‌ఏఆర్‌ఎస్ ప్రాంగణంలో చిరు ధాన్యాల బీజనిధి, చిరుధాన్యాల ల్యాబొరేటరి, సాయిల్ ఫిజిక్స్ ల్యాబొరేటరి, భూసారా పరీక్ష కేంద్రం భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించారు. ఆర్అండ్బీ విశ్రాంత భవనాన్ని, సబ్ కలెక్టర్ బంగ్లాను పరిశీలించారు.