మట్కా డోన

ABN , First Publish Date - 2022-09-14T05:15:07+05:30 IST

వెనుక గట్టి సపోర్టు లేకుంటే మట్కా వ్యాపారం ముందుకుసాగదు.

మట్కా డోన

  1.  సొమ్ము మాత్రం వైసీపీ నాయకులదే
  2.  ప్రతిరోజూ రూ.40 లక్షలు పైనే టర్నోవర్‌ 
  3.  అంతా సెల్‌ఫోన్ల ద్వారానే  
  4.  పుష్కళంగా పోలీసుల అండదండలు


డోన, సెప్టెంబరు 13: వెనుక గట్టి సపోర్టు లేకుంటే మట్కా వ్యాపారం ముందుకుసాగదు. డోనలో వైసీపీ నాయకుల చలువ వల్లే మట్కా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతోన్నదనే ప్రచారం సాగుతోంది.  మట్కా  సొమ్ము మాత్రం వైసీపీ నాయకులకే నేరుగా చేరుతోందనే విమర్శలు కూడా ఉన్నాయి. లేకపోతే పోలీసులు మాత్రం చూస్తూ ఎందుకు ఊరుకుంటారు?  డోన కేంద్రంగా  ప్యాపిలి, బేతంచెర్ల పట్టణాల్లో, చుట్టుపక్కల పల్లెల్లో  మట్కా జోరుగా సాగుతున్నదనే విమర్శలున్నాయి.  

డోన పట్టణంలో మట్కా జోరుకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పట్టణంలో కొందరు వ్యక్తులు పకడ్బందీగా మట్కా నడిపిస్తున్నట్లు తెలుస్తోంది.  ఒక్కో ప్రాంతాన్ని ఒక్కో బీటరు ఎంచుకున్నారు.  మట్కా బీట్‌ సేకరించే బీటర్లకు రూ.100కు రూ.15లు కమిషన ఇస్తున్నారు. దీంతో పట్టణంలో వంద మంది వరకు మట్కాబీటర్లు ఉంటారని సమాచారం. ప్రతి బీటరు సెల్‌ఫోన్ల ద్వారానే బీట్‌ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.  ఎప్పటికప్పుడు సెల్‌ఫోన సిమ్‌ కార్డు నెంబర్లు మారుస్తూ బీట్‌ సేకరిస్తున్నారు. ఏ నెంబరుకు ఎంత డబ్బు అనేది సెల్‌ఫోనల ద్వారానే లావాదేవీలు నడిపిస్తున్నట్లు విమర్శలున్నాయి. ఇలా బీటర్లు సేకరించిన మట్కాబీట్‌ను మట్కా ముఖ్య కేంద్రాలకు చేరవేస్తున్నట్లు విమర్శలున్నాయి. ప్రతిరోజు మట్కాబీట్‌ రూ.20 లక్షలపైనే టర్నోవర్‌ నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కొందరు అధికారపార్టీ నేతల కనుసన్నల్లో ఈ మట్కా జూదం నడుస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. అందువల్ల  పోలీసు అధికారుల అండదండలు  పుష్కలంగా ఉన్నట్లు తెలుస్తోంది.  

బేతంచెర్లలో మితిమీరిన మట్కా 

బేతంచెర్ల పట్టణంలో మట్కా జూదం మితిమీరిపోయిందన్న విమర్శలున్నాయి. పట్టణంతో పాటు గ్రామాలకు మట్కా పురివిప్పింది. పట్టణంలో బీటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు వస్తున్నారు. కొందరు మట్కా నిర్వాహకులు బీటర్లపై కమిషన వల విసిరి బీట్‌ను సేకరించేలా చూసుకుంటున్నారు. సెల్‌ఫోన, వాట్సాప్‌ల ద్వారా మట్కా బీట్‌ను సేకరిస్తున్నట్లు విమర్శలున్నాయి. ప్రతి రోజూ రూ.15 లక్షలు వరకు మట్కా బీట్‌ టర్నోవర్‌ ఉంటుందన్న ఆరోపణలున్నాయి. ఇలా సేకరించిన మట్కాబీట్‌ను డోనకు చేరవేస్తున్నట్లు విమర్శలున్నాయి. 

అక్కడి బీట్‌ గుత్తికి:

ప్యాపిలి పట్టణంలోనూ మట్కా జోరుగా సాగుతుందన్న విమర్శలున్నాయి. దాదాపు 20 మంది బీటర్ల వరకు అక్కడ మట్కా బీట్‌ సేకరిస్తున్నట్లు సమాచారం. పలువురు మహిళలు కూడా మట్కా ఊబిలో కూరుకుపోయారన్న విమర్శలున్నాయి. ప్రతిరోజూ రూ.5 లక్షల పైనే మట్కా బీట్‌ సేకరించి అనంతపురం జిల్లాలోని గుత్తికి చేరవేస్తున్నట్లు విమర్శలున్నాయి. 

ఆర్థికంగా చితికిపోతున్న జీవితాలు: 

మట్కా మాయలో పడి డోనలో ఎంతో మంది జీవితాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. రూపాయికి రూ.80 వస్తాయన్న ఆశతో ఎంతో మంది మట్కా ఉచ్చులో కూరుకుపోయి నష్టపోతున్నారు.  పట్టణంలో పలువురు వ్యాపారులు మట్కా జూదంలో పడి ఆర్థికంగా చితికిపోతున్నారు. కొందరు ఉద్యోగులు కూడా మట్కా మాయలో పడి తీవ్రంగా నష్టపోతున్నారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో వందల మంది కార్మికులు మట్కా జూదంలో మునిగి తేలుతున్నారు. రోజంతా కష్టపడి సంపాదించిన మట్కాకు సమర్పించుకుంటున్నట్లు విమర్శలున్నాయి. బేతంచెర్ల పట్టణంలోనూ పలువురు ఫ్యాక్టరీల యజమానులు, వ్యాపారులు, కార్మికులు మట్కా జూదంలో జీవితాలను గుల్లచేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది పేదలు ఆర్థికంగా చితికిపోతున్నా పట్టించుకున్న నాథుడే కరువయ్యారన్న విమర్శలున్నాయి.

పోలీసులు ఏం చేస్తున్నట్లు:

డోన నియోజకవర్గంలో  ప్రతి రోజూ రూ.లక్షల్లో మట్కా టర్నోవర్‌ నడుస్తున్నా .. పోలీసు అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  మట్కా నిర్వాహకుల నుంచి మామూళ్లు అందుతుండటం వల్లనే పోలీసు అధికారులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  

మట్కా నిర్మూలనకు గట్టి చర్యలు - శ్రీనివాసరెడ్డి, డీఎస్పీ, డోన

డోన నియోజకవర్గంలో మట్కా నిర్మూలనకు గట్టి చర్యలు తీసుకుంటున్నాం. డోన పట్టణంలో మట్కాబీటర్లను గుర్తించి 27 మందిని ఆర్డీవో ఎదుట హాజరు పరిచి బైండోవర్‌ కేసులు పెట్టాం. బేతంచెర్ల, ప్యాపిలి పట్టణాల్లో  మట్కా నడుస్తున్నట్లు మా దృష్టికి రాలేదు. అక్కడ కూడా మట్కాపై ప్రత్యేక నిఘా ఉంచి కట్టడి చేస్తాం. మట్కాకు పోలీసుల అండదండలు ఉన్నాయన్న విమర్శలు అవాస్తవం. 

Read more