‘రైతు రక్షణ యాత్రను విజయవంతం చేయండి’
ABN , First Publish Date - 2022-12-15T01:06:14+05:30 IST
ఏపీ రైతు సంఘం, ఏఐకేఎస్, సీపీఐ ఆద్వర్యంలో ఈ నెల 16 నుంచి 20 వరకు రైతు రక్షణ కోసం చేపడుతున్న కాలినడక యాత్రను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు.
కర్నూలు(న్యూసిటీ), డిసెంబరు 14: ఏపీ రైతు సంఘం, ఏఐకేఎస్, సీపీఐ ఆద్వర్యంలో ఈ నెల 16 నుంచి 20 వరకు రైతు రక్షణ కోసం చేపడుతున్న కాలినడక యాత్రను విజయవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు. బుధవారం సీఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతాంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందారన్నారు. నకిలీ విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన కంది రైతులకు ఎకరాకు రూ.60 వేలు, ఉల్లి,పత్తి రైతుకు రూ.50 వేలు ఇవ్వాలన్నారు. ఈనెల 16న రైతు రక్షణ కాలినడక ఆదోని, మద్దికెర, మంత్రాలయం, కటారికొండ మండలాల నుంచి ప్రారంభమై 18న సాయంత్రం కోడు మూరుకు చేరుకుంటాయన్నారు. కోడుమూరులో బహిరంగ సభ ఏర్పాటు చేశామన్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.రామక్రిష్ణ పాల్గొంటారన్నారు. 19న కోడుమూరు నుంచి బయలుదేరి 20న బళ్లారి చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ సభ నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీలైన సీపీఎం, టీడీపీ, కాంగ్రెస్, జనసేన నాయకులు సభలో ప్రసంగిస్తారన్నారు. సమావేశంలో రైతు సంఘం జిల్లా కార్య దర్శి కే.జగన్నాథం, సీపీఐ నగర కార్యదర్శి పి.రామక్రిష్ణారెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కే.శ్రీనివాసులు, నగర కార్యదర్శి బాబయ్య పాల్గొన్నారు.