ధరలతో నడ్డి విరుస్తున్న జగన్
ABN , First Publish Date - 2022-07-04T06:30:48+05:30 IST
వివిధ రకాల వస్తువులు, సేవలపై ధరలు పెంచుతూ సీఎం జగన్ ప్రజల నడ్డి విరుస్తున్నారని నంద్యాల, కర్నూలు టీడీపీ పార్లమెంటరీ పరిశీలకులు ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రులు ఫరూక్ ధ్వజమెత్తారు.

పిట్ట కథల మంత్రి ఈసారి ఇంటికే..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
టీడీపీ నాయకుల పిలుపు
బనగానపల్లె, జూలై 3: వివిధ రకాల వస్తువులు, సేవలపై ధరలు పెంచుతూ సీఎం జగన్ ప్రజల నడ్డి విరుస్తున్నారని నంద్యాల, కర్నూలు టీడీపీ పార్లమెంటరీ పరిశీలకులు ప్రభాకర్ చౌదరి, మాజీ మంత్రులు ఫరూక్ ధ్వజమెత్తారు. బనగానపల్లె నియోజకవర్గ టీడీపీ విస్తృత స్థాయి సమావేశం జీఎంఆర్ ఫంక్షన్ హాల్ ఆవరణలో ఆదివారం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి, కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, బీవీ జయనాగేశ్వరరెడ్డి, గౌరు చరిత, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, నాయకులు శివానందరెడ్డి, ధర్మవరం సుబ్బారెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్‌లు ప్రసంగించారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రజలకు ముద్దుల మీద ముద్దులు పెట్టి అధికారంలోకి వచ్చాక ధరలు పెంచి ప్రజల నడ్డి విరిచారని విమర్శించారు. నవరత్నాలకు చిల్లులు పడ్డాయన్నారు. పంటలకు గిట్టుబాట ధర, రూ.3 వేల పింఛన్, సన్న బియ్యం ఇస్తామని చెప్పి మాట మార్చారని విమర్శించారు. అప్పులు చేసి రాష్ట్రాన్ని గుండు గీయించారన్నారు. ఇసుక కొరతతో వేలాది మంది ఉపాధి కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. నిరుద్యోగులను నిలువునా ముంచారని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు భవిష్యత్‌లో మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. కారు కూతలు కూస్తున్న మాజీ మంత్రి కొడాలి నాని వంటి వారిని నడి రోడ్డుపై బట్టలూడదీసి కొట్టడం ఖాయమన్నారు. మంత్రి బుగ్గన ఇలాఖా డోన్‌లో నాటుసారా తయారీ విచ్చలవిడిగా సాగుతోందని నాయకులు ఆరోపించారు. నిత్యం పిట్టకథలు చెప్పే బుగ్గన వచ్చే ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయమన్నారు. బనగానపల్లెలో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి కమీషన్లు వసూలు చేస్తున్నారని విమర్శించారు. గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నా పట్టించుకోవడం లేదన్నారు. కార్యకర్తలు వైసీపీ కుట్రలకు భయపడకుండా సైనికుల్లా పని చేసి టీడీపీని గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కార్యదర్శి జాహిద్‌హుస్సేన్, రాష్ట్ర ఎస్టీ సెల్ కార్యదర్శి వెంకట రమణనాయక్, బీసీ రామనాథరెడ్డి, అంబాల రామకృష్ణారెడ్డి, టంగుటూరు శ్రీనయ్య, తదితరులు పాల్గొన్నారు.