నమ్మక ద్రోహి జగన్
ABN , First Publish Date - 2022-12-07T23:31:15+05:30 IST
సీఎం జగన్ నమ్మక ద్రోహి అని... బీసీలను నట్టేట ముంచి జయహో అనడం ఆయనకే చెల్లిందని తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు.
బీసీలను నట్టేట ముంచి.. జయహోనా?
గౌరు వెంకటరెడ్డి ధ్వజం
కర్నూలు(అగ్రికల్చర్), డిసెంబరు 7: సీఎం జగన్ నమ్మక ద్రోహి అని... బీసీలను నట్టేట ముంచి జయహో అనడం ఆయనకే చెల్లిందని తెలుగుదేశం పార్టీ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి అన్నారు. బుధవారం తెలుగుదేశం పార్టీ నాయకుల నేతృత్వంలో ఆ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు బీసీ వర్గాలకు వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయానికి నిరసనగా ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా గౌరు వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలకు తీవ్ర అన్యాయం చేసిన మొదటి సీఎంగా జగన్ చరిత్రలో మిగిలిపోతారని అన్నారు. ఖాళీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల కడుపు కొట్టిన జగన్మోహన్ రెడ్డిని దేవుడు కూడా క్షమించడని అన్నారు. గత ప్రభుత్వాలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే జగన్మోహన్రెడ్డి వాటిని 27 శాతానికి తగ్గించారని తెలిపారు. చేతివృత్తులు, కులవృత్తులతో జీవనం పొందే బీసీల అభివృద్ధి జగన్ పుణ్యమా అని ఎక్కడి గొం గళి అక్కడే అన్నట్లుగా ఉందన్నారు. సబ్ ప్లాన్ నిధుల నుంచి స్థానిక రిజర్వేషన్ల వరకు ప్రతి అంశంలోనూ నిరాదరణకు, దగాకు గురవుతున్నారని అన్నారు.
కేంద్రంపై ఒత్తిడి తీసుకురండి
స్థానిక సంస్థల ఎన్నికల్లో రద్దు చేసిన పది శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు శాసనసభలో తీర్మానం చేయాలని, అందుకు వైసీపీ ఎంపీలంతా కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. కులవృత్తుల వారికి పనిముట్లను అందించాలని... విదేశీ విద్య పథకాన్ని కొనసాగించాలని, కోరారు. ప్రభుత్వ సలహాదారులు, యూనివర్సిటీల వైస్ చాన్సలర్లలో 34 శాతం పదవులు బీసీలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. చేనేతలకు సబ్సిడీ పథకాలు పునరుద్ధరించాలని, బీసీల కోసం కేంద్రం అమలు చేస్తున్న పథకాలు సక్రమంగా కొనసాగేందుకు రాష్ట్రం తనవంతు నిధులు మంజూరు చేయాలని అన్నారు. మత్స్యకారులకు సబ్సిడీపై వలలు, పడవలు, పుట్టీలు పంపిణీ చేయాలని, జీవో.217ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీఆర్వోకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నరసింహయాదవ్, తిరుపాల్బాబు, మహేష్గౌడు, రాజు యాదవ్, ప్రభాకర్ యాదవ్, విజయలక్ష్మి, చంద్రకళాబాయి, ఆశాలత, ఈరన్నగౌడు, బసవరాజు, రామక్రిష్ణ పాల్గొన్నారు.