జడ్పీ ఆదాయానికి గండి

ABN , First Publish Date - 2022-10-12T05:23:33+05:30 IST

జిల్లా పరిషత ఆవరణలో ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాలను అద్దెకు ఇచ్చారు.

జడ్పీ ఆదాయానికి గండి

  1. అద్దె కట్టని పలు ప్రభుత్వ శాఖలు 
  2.  పైసా అద్దె చెల్లించని మెగా సీడ్స్‌ కార్పొరేషన
  3. ఉచితంగా తహసీల్దారు, కార్మిక శాఖ మంత్రి కార్యాలయాలు 

కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 11: జిల్లా పరిషత ఆవరణలో ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలకు అనువైన స్థలాలను  అద్దెకు ఇచ్చారు. ఇందుకుగాను ప్రైవేటు  కార్యాలయాలు, సంస్థలు ప్రతి నెలా అద్దె చెల్లిస్తున్నాయి.  కొన్ని ప్రభుత్వ శాఖలు అద్దె చెల్లించకపోగా కనీసం కరెంటు బిల్లులు కూడా కట్డడం లేదని జడ్పీ అధికారులు వాపోతున్నారు. జడ్పీ ఆస్తులకు అద్దె రూపంలో వచ్చే ఆదాయాన్ని జడ్పీ సాధారణ నిధులలో జమ చేస్తారు. పాత జడ్పీ కార్యాలయంలో కొన్ని భాగాలను ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకు ఇచ్చారు. గతంలో మెగా సీడ్స్‌ పార్క్‌ కార్పొరేషన వారు కార్యాలయాన్ని అద్దెకు తీసుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా అద్దె చెల్లించకలేదు.   కరెంటు బిల్లు మాత్రం చెల్లిస్తూ వచ్చారు.   తహసీల్దారు, కార్మిక శాఖ మంత్రి క్యాంప్‌ కార్యాలయాల పరిస్థితి కూడా ఇంతే.  ఈ రెండు కార్యాలయాల అద్దె, కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో అధికారులు విస్తుపోతున్నారు. పంచాయతీరాజ్‌ శాఖ  కార్యాలయాలకు అద్దె తీసుకోకుండానే  ఇవ్వవచ్చని, ఇతర శాఖల కార్యాలయాలు   తప్పకుండా అద్దె చెల్లించాలని నిబంధనలు చెబుతున్నాయి.  2020 సంవత్సరంలో జిల్లా పరిషతకు ప్రత్యేక అధికారి కలెక్టర్‌ కావడంతో తహసీల్దారు కార్యాలయాన్ని అనధికారికంగా అద్దెకు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. 


- మెగాసీడ్స్‌ పార్క్‌ కార్పొరేషన కార్యాలయానికి 2018 అక్టోబర్‌ 4న నెలకు రూ.20 వేల అద్దె  ప్రకారం 25 నెలలకు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పటి వరకు కార్పొరేషన   ఒక్కపైసా కూడా అద్దె చెల్లించలేదు. సుమారు రూ.5 లక్షల వరకు అద్దె వసూలు కావాలని అధికారులు చెబుతున్నారు. 2020లో  కార్యాలయాన్ని ఎత్తివేసారు. 

- కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం క్యాంపు కార్యాలయాన్ని 2019 సంవత్సరంలో అద్దెకు ఇచ్చారు. అయితే ఇప్పటి వరకు  అద్దె చెల్లించకపోగా కరెంటు బిల్లు కూడా జడ్పీ సాధారణ నిధుల నుంచే చెల్లిస్తున్నారు.  క్యాంప్‌ కార్యాలయం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు మంత్రి గుమ్మనూరు జయరాం ఒక్కసారి కూడా కార్యాలయానికి రాలేదని అధికారులే చెబుతున్నారు. అలాంటప్పుడు వేరే  శాఖలకు అద్దెకు ఇస్తే జడ్పీకి ఆదాయం వస్తుందని కొందరు అంటున్నారు. 


- 2020 ఏప్రిల్‌లో అర్బన తహసీల్దారు కార్యాలయాన్ని అనధికారింగా అద్దెకు ఇచ్చారు. ఈ శాఖ నుంచి ఇప్పటి వరకు అద్దె రావడం లేదు.  కరెంటు బిల్లు కూడా చెల్లించడం లేదు. ప్రతి నెల సుమారు రూ.1300 నుంచి రూ.1400 దాకా జడ్పీ సాధారణ నిధుల నుంచి  చెల్లిస్తున్నారు.  ఇప్పటి వరకు రూ.2,70,000 జడ్పీ సాధారణ నిధుల నుంచి కరెంటు బిల్లు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. 

- .అధికారుల ఆదేశాల బేఖాతరు...

తహసీల్దారు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని ఇప్పటికే పలుమార్లు జిల్లా పరిషత అధికారులు తహసీల్దారుకు నోటీసులు జారీ చేశారు. అయితే ఆదేశాలను బేఖాతరు చేస్తూ కనీసం జడ్పీ అధికారులను సంప్రదించకుండా తహసీల్దారు కార్యకలాపాలు నిర్వహించడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఉన్నతాధికారులు ఖాళీ చేయాలని చెప్పినా పట్టించుకోకపోవడం ఏమిటని జడ్పీ అధికారులు విస్తుచెందుతున్నారు.   సొమ్ము ఒకరిది సోకు ఒకరిది అన్న చందంగా ఇటీవల తహసీల్దారు కార్యాలయంలో  ఏసీ(ఎయిర్‌ కండీషనర్‌) ఏర్పాటు చేసుకున్నారు. ఈ ధోరణిని కొందరు తీవ్రంగా ఖండిస్తున్నారు.   ఇటీవల దసరా పండుగకు ముందు కార్యాలయాన్ని ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది.

- వీటితో పాటు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, జడ్పీ ఆవరణ ముందు భాగంలో సైన బోర్డ్సు, కొత్త జడ్పీ భవనం పక్కనే బీఎస్‌ఎనఎల్‌ టవర్‌ ఏర్పాటు చేశారు. అయితే వీరంతా ప్రతి నెల అద్దెను చెల్లిస్తున్నారు. 

కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం: జి. నాసరరెడ్డి, జడ్పీ సీఈఓ

మెగా సీడ్స్‌ పార్కు కార్పొరేషన నుంచి అద్దె రావాలని గతంలో  ప్రభుత్వానికి నివేదికలు పంపారు. తహసీల్దారు కార్యాలయానికి సంబంధించి కరెంటు బిల్లుల విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం. మిగతా వాటి గురించి త్వరలోనే జడ్పీ అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. 




Updated Date - 2022-10-12T05:23:33+05:30 IST