గుండ్రేవుల ఎండమావిలా!

ABN , First Publish Date - 2022-05-18T05:45:47+05:30 IST

ఉమ్మడి జిల్లా ప్రజల జలస్వప్నం గుండ్రేవుల.

గుండ్రేవుల ఎండమావిలా!
గుండ్రేవుల నిర్మాణానికి ప్రతిపాదించిన తుంగభద్ర నది ప్రాంతం.

  1.  ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలో చోటు 
  2.   మూడేళ్లయినా నిధుల ఊసే లేదు
  3.   రూ.5,500 కోట్లకు చేరిన అంచనాలు
  4.  ఉమ్మడి జిల్లా రైతులకు మిగిలింది నిరాశే 


(కర్నూలు-ఆంధ్రజ్యోతి):


ఉమ్మడి జిల్లా ప్రజల జలస్వప్నం గుండ్రేవుల. దాన్ని నిజం చేసుకోవడానికి పాదయాత్రలు చేశారు. ఎన్నో ఆందోళనలు చేశారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చారు. జిల్లా నీటి పారుదల వ్యవస్థలోనేగాక జగన ప్రభుత్వ ప్రాధాన్య ప్రాజెక్టుల జాబితాలోనూ గుండ్రేవుల చోటు సంపాదించుకుంది.  దీంతో ఇక తమ కల ఫలిస్తుందని జిల్లా ప్రజలు సంబర పడ్డారు. కానీ ఇది ఉత్తుత్తి ప్రాధాన్యంగా మారిపోయింది. పేపర్‌ ప్రాధాన్యంగా మిగిలిపోయింది. వైీసీపీ ప్రభుత్వ దృష్టిలో ‘అప్రాధాన్య’ జాబితాలో చేరిపోయిందనే విమర్శ వినిపిస్తోంది. 

మొదట అలా... 

జగన ప్రభుత్వం కొలువుదీరిన మూడు నెలలకే రాష్ట్రంలో 14 సాగునీటి ప్రాజెక్టులను   ప్రాధాన్య జాబితాలో చేర్చింది. వీటికి ప్రాధాన్యం ఇచ్చి పూర్తి చేయడమే ప్రధాన ఉద్దేశం.  ప్రభుత్వమే ప్రాధాన్య జాబితాలో చేరిస్తే నిధుల కొరత ఉండదని.... పనుల్లో జాప్యం ఉండదని ప్రజలు అనుకున్నారు. కానీ మూడేళ్లు గడిచినా నిధుల ఊసే లేదు. గుండ్రేవుల ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులే ఇవ్వలేదు. దీనిని చేపడతారో.. లేదో స్పష్టత ఇవ్వలేదు. వేదవతి, ఆర్డీఎస్‌ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం.. ప్రజాప్రతినిధుల వైఫల్యం కారణంగా అ‘ప్రాధాన్య’ ప్రాజెక్టుగా గుండ్రేవుల మిగిలిపోయిందా? అనే సందేహం కలుగుతోంది.   

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన రాయలసీమ ప్రాజెక్టులపై ఎన్నో హామీలు ఇచ్చారు. 2019 ఎన్నికల్లో విజయం సాధించి...అదే ఏడాది మే 30న సీఎంగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రంలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ ఒకేసారి పూర్తి చేయడం అసాధ్యం కాబట్టి ప్రాధాన్య క్రమంలో పూర్తి చేస్తామని ప్రకటించారు. ఇలా రాష్ట్రంలో 14 ప్రాజెక్టులను  ఎంపిక చేసి 2019 ఆగస్టు 28న అప్పటి జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అదిత్యనాథ్‌దాస్‌ మెమో నంబరు 2821255/సీఈస్‌ ఈఎస్‌టీటీ/2019 జారీ చేశారు. ప్రభుత్వ ప్రాధాన్య జాబితాలో హంద్రీనీవా ఫేజ్‌-1, 2, గాలేరు-నగరి ప్రాజెక్టు ఫేజ్‌-1, 2, గుండ్రేవుల జలాశయం, పోతిరెడ్డిపాడుకు ప్రత్యామ్నాయ నీటి మళ్లింపు మార్గం ప్రాజెక్టులు ఉన్నాయి. ఏళ్లు గడుస్తున్నా వీటికి నిధులు మంజూరు చేయకపోగా కనీసం సమీక్ష కూడా చేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేతగా జగన ఇచ్చిన హామీలను నమ్మిన ఉమ్మడి జిల్లా ప్రజలు కర్నూలు, నంద్యాల పార్లమెంట్‌ స్థానాలు సహా 14 అసెంబ్లీ నియోజవర్గాల్లో వైసీపీని గెలిపించారు. ప్రశ్నించేందుకు ఒక్క ప్రతిపక్ష ఎమ్మెల్యేనైనా గెలిపించలేదు. ఇంతచేసినా... వైసీపీ ప్రజాప్రతినిధులు జిల్లా ప్రయోజనం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు తెప్పించడంలో... పనులు చేయించడంలో పూర్తిగా విఫలమయ్యారనే ఆరోపణలు లేకపోలేదు. 

  కరువు రైతుల ‘గుండె’రేవుల: 

తుంగభద్రపై గుండ్రేవులు జలాశయాన్ని నిర్మిస్తే కర్నూలు, నంద్యాల, కడప జల్లాల్లో సాగు, తాగునీటి సమస్య తీరుతుంది. కేసీ కాలువ కింద ఉమ్మడి కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కర్నూలు నగరంతో పాటు కొన్ని పల్లెసీమలకు తాగునీరు అందించే జల జీవనాడి. కేసీ కాలువకు కేడబ్ల్యూడీటీ 39.90 టీఎంసీలు కేటాయించింది. అందులో 8 టీఎంసీలు ఎస్‌ఆర్‌బీసీకి కేటాయించారు. 31.90 టీఎంసీలు నీటివాటా ఉన్నా దీనిని నిలుపుకునే జలాశయం లేదు. 10 టీఎంసీలు తుంగభద్ర జలాశయం నుంచి తీసుకోవాల్సి వస్తే.. 21.89 టీఎంసీలు నదీ ప్రవాహం ద్వారా సుంకేసుల బ్యారేజీ నుంచి తీసుకోవాల్సి ఉంది. తుంగభద్రకు వరద తగ్గడం.. వరద రోజులు కూడా   పడిపోవడంతో కేసీ ఆయకట్టుకు పంట చివరి దశలో నీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో సుంకేసుల జలాశయం ఎగువన 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల రిజర్వాయరు నిర్మించాలనే డిమాండ్‌ తెరపైకి వచ్చింది. సాగునీటి నిపుణులు, రిటైర్డ్‌ ఈఈ సుబ్బరాయుడు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వానికి పంపించారు. ఉమ్మడి రాష్ట్రం చివరి సీఎం కిరణకుమార్‌రెడ్డి గుండ్రేవుల జలాశయం సర్వే, డీపీఆర్‌ తయారీకి రూ.54.95 లక్షలు నిధులు మంజూరు చేస్తూ 2013 నవంబరు 1న జీఓ ఎంఎస్‌ నంబరు.100 జారీ చేశారు. ఈ డీపీఆర్‌ తయారీ కాంట్రాక్ట్‌ హైదరాబాదుకు చెందిన ఏఆర్‌వీఈఈ అసోసియేట్స్‌ సంస్థ దక్కించుకొని పనులు మొదలు పెట్టింది. 

 చంద్రబాబు హయాంలో రూ.2,890 కోట్లు మంజూరు:

 సుంకేసుల జలాశయం సామర్థ్యం 1.20 టీఎంసీలే. ఈ బ్యారేజీకి ఎగువన సి.బెళగల్‌ మండలం గుండ్రేవుల గ్రామం సమీపంలో 20 టీఎంసీల సామర్థ్యంతో గుండ్రేవుల జలాశయం నిర్మించాలనే డిమాండ్‌తో రాయలసీమ సాగునీటి సాధన సమితి కర్నూలు నుంచి గుండ్రేవుల వరకు పాదయాత్ర చేసింది. ఈ జలాశయాన్ని నిర్మిస్తే కర్నూలు నగరంలో 6.50 లక్షలు జనాభా, పశ్చిమ ప్రాంతంలో 8.50 లక్షల జనాభాకు తాగునీరు అందించవచ్చు. ఎగువ జలాల ఆధారంగా పశ్చిమ ప్రాంత పల్లెలకు సాగునీరు, కేసీ ఆయకట్టు 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు పుష్కలంగా ఇవ్వవచ్చు. రూ.2,890 కోట్ల అంచనాతో ఏఆర్‌వీఈఈ  అసోసియేట్స్‌ సంస్థ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌) ఇచ్చింది. 2019 ఫిబ్రవరి 21న అప్పటి సీఎం చంద్రబాబు ప్రభుత్వం రూ.2,890 కోట్లు మంజూరు చేస్తూ జీఓ నం.153 జారీ చేసింది. నిధులు మంజూరైనా పనులు మొదలు కాలేదు. ప్రాధాన్య ప్రాజెక్టుల్లో గుండ్రేవుల ప్రాజెక్టును చేర్చి కూడా ప్రభుత్వం  రైతుల ఆశలను  తుంగలో తొక్కేసింది.  

  రూ.5,500 కోట్లకు చేరిన అంచనా 

 జగన ప్రభుత్వం గుండ్రేవులకు ఒక్క పైసా ఇవ్వకపోగా.. పక్క రాష్ట్రం తెలంగాణతో కనీసం చర్చలు కూడా జరపలేదు. 2019-20 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం మళ్లీ అంచనాలు తయారు చేస్తే రూ.4,330 కోట్లకు ఈ ప్రాజెక్టు వ్యయం చేరింది. తాజా ఎస్‌ఎస్‌ఆర్‌ ధరల ప్రకారం ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.5,500 కోట్లకు పైగా చేరిందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లాలో మూడు గ్రామాలు పూర్తిగా, రెండు గ్రామాలు పాక్షికంగా ముగినిపోతాయి.  2,371 ఎకరాలు ముంపునకు గురవుతాయి. దీంతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) ద్వారా సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తెలంగాణ సర్కారుకు కూడా పంపారు. ఆ రాష్ట్ర ప్రభుత్వం  ఏమాత్రం దీనిపై స్పందించలేదు.  ఇప్పటికైనా మన రాష్ట్ర ప్రభుత్వం గుండ్రేవుల నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

  ప్రభుత్వానికి నివేదించాం 

 గుండ్రేవుల జలాశయం నిర్మాణ అంచనా 2019-20 ఎస్‌ఎస్‌ఆర్‌ రేట్ల ప్రకారం   రూ.4,330 కోట్లకు చేరింది. దీని వల్ల కర్నూలు జిల్లాలో 4,464 ఎకరాలు, 7 గ్రామాలు పూర్తిగా, 4 గ్రామాలు పాక్షికంగా ముంపునకు గురవుతున్నాయి. తెలంగాణలో కూడా ముంపు ఉంటుంది. అందువల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వం సహకారం అవసరం. ప్రభుత్వం ద్వారా ఆ రాష్ట్రానికి డీపీఆర్‌ పంపించాం. ఇటీవల జరిగిన ప్రాజెక్టుల సమీక్షలో గుండ్రేవులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం.

-  మురళీనాథ్‌రెడ్డి, చీఫ్‌ ఇంజనీరు, జలవనరుల శాఖ, కర్నూలు: 

Updated Date - 2022-05-18T05:45:47+05:30 IST