తాత హత్య కేసులో మనవడి అరెస్టు

ABN , First Publish Date - 2022-12-07T01:11:35+05:30 IST

మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాధవనగర్‌లో జరిగిన సుబ్రహ్మణ్యంశర్మ హత్య కేసులో నిందితుడు దీపక్‌శర్మను పోలీసులు అరెస్టు చేశారు.

తాత హత్య కేసులో మనవడి అరెస్టు

కర్నూలు, డిసెంబరు 6: మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని మాధవనగర్‌లో జరిగిన సుబ్రహ్మణ్యంశర్మ హత్య కేసులో నిందితుడు దీపక్‌శర్మను పోలీసులు అరెస్టు చేశారు. కర్నూలు డీఎస్పీ మహేష్‌, త్రీటౌన్‌ సీఐ తబ్రేజ్‌లు మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. సుబ్రహ్మణ్యం శర్మ, తన కోడలు అరుణ, మనుమడు దీపక్‌ శర్మతో కలిసి స్థానిక మాధవనగర్‌లో నివాసముంటున్నాడు. మనవడు దీపక్‌జశర్మ ఏ పనిపాటా లేకుండా తిరుగుతూ జల్సాలకు అలవాటు పడ్డాడు. దీంతో సుబ్రహ్మణ్య శర్మ పలుసార్లు మందలించాడు. తరచూ పౌరోహిత్యం నేర్చుకోవాలని చెబుతుండేవాడు. దీంతోపాటు దీపక్‌శర్మ తన ఖర్చుల కోసం సుబ్రహ్మణ్యం శర్మకు వచ్చే పింఛన్‌ డబ్బుల కోసం తరచూ వేధించేవాడు. దీనికితోడు కొద్ది కాలంగా దీపక్‌శర్మ మానసిక స్థితి సరిగా లేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 3వ తేదీన సుబ్రహ్మణ్యం శర్మ, దీపక్‌ శర్మ మధ్య చిన్న వాగ్వివాదం జరిగింది. క్షణికావేశానికి గురైన దీపక్‌శర్మ ఇంట్లో ఉన్న మూడు కత్తులు తీసుకుని తాతపైన దాడి చేసి గాయపరిచాడు. ఈ ఘటనలో తాత శర్మ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితుడి అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన సీఐ తబ్రేజ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రసాద్‌ సింగ్‌, కానిస్టేబుల్‌ చంద్రబాబు నాయుడును డీఎస్పీ అభినందించారు.

Updated Date - 2022-12-07T01:11:39+05:30 IST