సమస్యల పరిష్కారంలో విఫలం: పీడీఎస్యూ
ABN , First Publish Date - 2022-08-17T05:58:54+05:30 IST
విద్యారంగ సమస్యలను పరిష్కరించండంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రఫి, జిల్లా కార్యదర్శి నాగరాజు ఆరోపించారు.

నంద్యాల (నూనెపల్లె), ఆగస్టు 16: విద్యారంగ సమస్యలను పరిష్కరించండంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రఫి, జిల్లా కార్యదర్శి నాగరాజు ఆరోపించారు. పీడీఎస్యూ ఆధ్వర్యంలో మంగళవారం డీఈవో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ 3, 4, 5వ తరగతులను ఉన్నత పాఠశాలలో విలీన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరమవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యాలయ ఏడీ అనురాధకు పీడీఎస్యూ నాయకులు వినతిపత్రం అందజేశారు. నంద్యాల డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు దస్తగిరి, నవీన్, ఉపాధ్యక్షులు నాని, కళ్యాణ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.