గంట కార్యక్రమానికి ఇంత ఆర్భాటమా?

ABN , First Publish Date - 2022-10-17T05:43:32+05:30 IST

సీఎం జగన్‌ గంట సేపు కార్యక్రమానికి ఇంత ఆర్భాటం అవసరమా అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు.

గంట కార్యక్రమానికి ఇంత ఆర్భాటమా?
మాట్లాడుతున్న అఖిలప్రియ

ఆళ్లగడ్డ, అక్టోబరు 16: సీఎం జగన్‌ గంట సేపు కార్యక్రమానికి ఇంత ఆర్భాటం అవసరమా అని మాజీ మంత్రి అఖిలప్రియ ప్రశ్నించారు. పట్టణంలోని ఆమె స్వగృహంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం జగన్‌ గంట సేపు ఉంటారని, దీని కోసం ఏర్పాట్ల పేరుతో పట్టణంలో అల్లకల్లోలం సృష్టించారని అన్నారు. ప్రధాన రహదారి టీబీ రోడ్డులో చిన్నచిన్న బంకులు వేసుకొని వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మున్సిపాల్టీ సిబ్బంది, పోలీసులు తొలగించటంతో ఉపాధి కోల్పోయారన్నారు. టీబీ రోడ్డు రహదారి వెడల్పు కోసం సొంత స్థలంలో ఇంటి యజమానులు వేసుకున్న ప్లాట్‌ ఫారాలను, రేకుల షెడ్లను పూర్తిగా తొలగించటం అన్యాయమన్నారు. గతంలో మురికి కాలువల పేరుతో స్థానిక ప్రజా ప్రతినిధులు వారికి నచ్చిన వారి అక్రమణలు తొలగించకుండా ముడుపులు పొందారని, అలాగే ఆక్రమణలో తొలగించగా ఉన్న మట్టిని వారు అమ్ముకొని సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు. ప్రస్తుతం తొలగించిన బంకులను తిరిగి వేసుకునేందుకు ప్రజా ప్రతినిధులు వారి నుంచి డబ్బులు వసూలు చేసుకొని సొమ్ము చేసుకోవడానికి మార్గం ఏర్పడిందన్నారు. సీఎం రాకతో జరుగుతున్న అభివృద్ధి స్థానిక ప్రజాప్రతినిధులు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. నియోజకవర్గంలో గత రెండు, మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు చాగలమర్రి మండలంలోని నేలంపాడు గ్రామ ప్రజలు వరద నీటిలో చిక్కుక పోయారని, వీరిని పట్టించుకునే వారే కరవయ్యారని ఆరోపించారు. తాము వెళ్లి పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు అందించి వచ్చాక ఎమ్మెల్యే చుట్టపు చూపుగా వెళ్లారని ఎద్దేవా చేశారు. రైతులు ప్రకృతి వైపరీత్యాలతో పండించిన పంటలు చేతికి అందక, అందినా వాటికి గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నా ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన సబ్సిడీ ఇవ్వకపోవడంతో అప్పుల బాధలు తాళలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అన్నారు.  ఇవేవి అధికార పార్టీ నాయకులకు, సీఎంకు పట్టటం లేదని ఆరోపించారు.  ఆళ్లగడ్డ ప్రజాప్రతినిధులు చేస్తున్న అరాచకాలు, అక్రమణలపై సీఎంకు చెప్పేవారే కరవయ్యారన్నారు. నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ఉన్నారన్న విషయమే ప్రజలకు  తెలియదని, ఆయనను  ప్రజలు కనుక్కోలేరని అన్నారు. చాబోలు గ్రామ రైతులకు ఆయన చేసిన మోసం తెలియని వారుండరన్నారని ఆరోపించారు. పట్టణంలో ఆక్రమణల పేరుతో మున్సిపాల్టీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు ప్రజల ఆస్తులను కొల్లగొడుతున్నారని, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో ప్రజలు గమనించి పాలకులపై తిరగబడాలని ఆమె పిలపునిచ్చారు.  


Updated Date - 2022-10-17T05:43:32+05:30 IST