చెరువుల్లో ‘ఉపాధి’

ABN , First Publish Date - 2022-05-30T05:41:37+05:30 IST

ఉపాధి హామీ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.

చెరువుల్లో ‘ఉపాధి’

  1. పూడికతీతతో పాటు ముళ్లకంపల తొలగింపు
  2. కేంద్రం నిర్ణయంతో రైతుల్లో సంతోషం 


కర్నూలు (అగ్రికల్చర్‌), మే 29: ఉపాధి హామీ పథకం ద్వారా చెరువుల పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, అనంతపురం, పుట్టపర్తి జిల్లాల్లో 500 చెరువులను మిషన అమృత సరోవర్‌ పథకం కింద ఎంపిక చేస్తూ జిల్లా నీటి పారుదల శాఖ అధికారులు పంపిన నివేదికకు ఆమోదం లభించింది. ఈ చెరువుల ప్రగతికి ఉపాధి హామీ పథకం నిధులను వెచ్చించనున్నారు. ఈ పనులు ఆగస్టు 15వ తేదీలోగా పూర్తి చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. పది వేల క్యూబిక్‌ మీటర్ల మేర నీటిని నిల్వ చేసేలా పూడిక మట్టిని తొలగించి ఆ మట్టిని పొలాలకు తరలిస్తారు. అదేవిధంగా చెరువు కట్టల పటిష్టానికి పనులు చేయించనున్నారు. మట్టి కట్టలపై అడవిని తలపిస్తున్న ముళ్ల కంపలను కూడా తొలగిస్తారని... ఒక్కొక్క చెరువుకు రూ.10లక్షలతో పాటు ఇంకా కావాల్సి వస్తే.. 15వ ఆర్థిక సంఘ నిధులను ఖర్చు చేసేందుకు చర్యలు చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. రాయలసీమలోని జిల్లాల్లో 17.75 లక్షల జాబ్‌కార్డులు అందజేశామని, వారిలో ఆరు లక్షలకు పైగా కూలీలు ఈ పనులకు హాజరవుతారని ఆశిస్తున్నట్లు నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. ఈ పథకం కింద ప్రతి చెరువు కింద లక్ష దాకా పని దినాలు కల్పించాలన్నదే లక్ష్యమన్నారు. ప్రస్తుత రాయలసీమ జిల్లాల్లో కనీస వేతనం రూ..150 నుంచి రూ.200 వరకు ఇస్తున్నారు. ఈ పథకం ద్వారా పనిది నాలను... వేతనాన్ని పెంచడానికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ పనులు చేపట్టేందుకు గ్రామ పంచాయతీ, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. పనుల పురోగతిని ఎప్పటికప్పుడు నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ విధానం ద్వారా పరిశీలిస్తారు. ఇందుకు ఏరియా ఆఫీసర్‌ యాప్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ పనులు పూర్తయిన తర్వాత చెరువు కట్టపై ఆగస్టు 15న స్వాతంత్ర వేడుకలను పురస్కరించుకుని జాతీయ జెండా ఎగురవేయనున్నారు.

 

Read more