నీరు పారని ఎల్లెల్పీ

ABN , First Publish Date - 2022-10-27T22:59:48+05:30 IST

ఎల్లెల్సీకి నీటి సరఫరా ఆగిపోయింది. హగరిపై నిర్మించిన తుంగభద్ర దిగువ కాలువ అక్విడక్ట్‌ పిల్లరు కొట్టుకుపోయి 15 రోజులవుతోంది. దీంతో ఎల్లెల్సీకి నీరు ఆపేశారు. జిల్లాలో ఎల్లెల్సీ కింద సాగయిన వరి, మిరప పంటలకు నీరు అందడం లేదు.

   నీరు పారని ఎల్లెల్పీ
హగరి నదిపై నిర్మించిన ఎల్లెల్సీ అక్విడక్ట్‌ వంతెన

వరదకు కొట్టుకపోయిన హగరి అక్విడక్ట్‌ పిల్లరు

15 రోజులుగా నిలిచిపోయిన నీటి సరఫరా

మరమ్మతుల్లో జాప్యం

ఎండిపోతున్న వరి, మిరప పంటలు

రూ. 375 కోట్లు దిగుబడులు ప్రశ్నార్థం!

(కర్నూలు-ఆంధ్రజ్యోతి): ఎల్లెల్సీకి నీటి సరఫరా ఆగిపోయింది. హగరిపై నిర్మించిన తుంగభద్ర దిగువ కాలువ అక్విడక్ట్‌ పిల్లరు కొట్టుకుపోయి 15 రోజులవుతోంది. దీంతో ఎల్లెల్సీకి నీరు ఆపేశారు. జిల్లాలో ఎల్లెల్సీ కింద సాగయిన వరి, మిరప పంటలకు నీరు అందడం లేదు. నేల నీర్రెలువారుతోంది. పంటలు పొట్ట, పూత దశకు చేరుకున్నాక ఇలా నీరు అందకపోవడంతో భారీ నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. సుమారుగా రూ.375 కోట్ల పంట దిగుబడులు ప్రశ్నార్థమయ్యాయని అంటున్నారు. తుంగభద్ర ప్రాజెక్టు బోర్లు ఇంజనీర్లు తక్షణమే స్పందించి అక్విడక్ట్‌ పిల్లరు మరమ్మతులు చేయించాలని రైతులు కోరుతున్నారు. లేదంటే.. నష్టానికి టీబీపీ బోర్డు అధికారులు పూర్తి బాధ్యత వహించి రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఆలూరు, ఆదోని, మంత్రాయలం, ఎమ్మిగనూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ) ఈ ఖరీఫ్‌ సీజనలో 38 వేల ఎకరాల్లో పత్తి, మిరప, వరి వంటి పంటలు సాగు చేశారని ఎల్లెల్సీ ఇంజనీర్లు పేర్కొన్నారు. మరో 10-15 వేల ఎకరాల్లో నాన ఆయకట్టు కింద సాగులో ఉందని అంచనా వేస్తున్నారు. వరి పొట్ట దశలో, మిరప, పత్తి పూత, కాయ దశలో ఉంది. ఆశాజనకంగా పంట దిగుబడులు రావాలంటే సాగు తడులు క్రమం తప్పక అందించాలి. ఈ నెల 12న ఎల్లెల్సీ కాలువ 121 కి.మీల వద్ద హగరి నదిపై నిర్మించిన అక్విడక్ట్‌ 15వ పిల్లరు వరదకు కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. తక్షణం మరమ్మతులు చేసిన నీటి ప్రవాహం పునరుద్ధరిస్తాని రైతులు ఆశించారు. అయితే.. టీబీపీ బోర్డు ఇంజనీర్ల జాప్యం కారణంగా 13 రోజులైనా మరమ్మతులు మొదలు పెట్టలేదు. వరద ప్రవాహంలో కూడా అక్విడక్ట్‌ పిల్లర్లు నిర్మాణం, మరమ్మతులు చేయడానికి ఉన్న అవకాశాలపై చెన్నైకి చెందిన ఐఐటీ నిపుణుల బృందం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ నిపుణులు అక్విడక్ట్‌ను పరిశీలించి పలు సూచనలతో బోర్డుకు నివేదిక ఇచ్చారు.

ఫ టెక్నాలజీ లేక జాప్యం:

హగరి నదిపై 700 మీటర్లు పొడవున, 56 పిల్లర్లతో అక్విడక్ట్‌ నిర్మించారు. ఒక్కో పిల్లరు మధ్య 30 అడుగులు దూరం ఉంది. పిల్లరు మధ్య భాగంలో కాలువ, రోడ్డు స్లాబులు జాయింట్‌ (అనుసంధానం) చేశారు. పిల్లరు అనవాళ్లు లేకుండా కూలిపోయి వరదకు కొట్టుకుపోవడంతో స్లాబులు కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో అదే రోజే నీటి సరఫరాను నిలిపివేశారు. మరమ్మతు పనులు బళ్లారికి చెందిన కాంట్రాక్టరు భూపాల్‌రెడ్డికి అప్పగించినట్లు బోర్డు అధికారులు పేర్కొన్నారు. మరమ్మతులకై మంగళవారం టీబీపీ బోర్డు సెక్రెటరీ నాగమోహన, ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి, ఈఈ నీలకంఠేశ్వరరెడ్డి బళ్లారిలో సమావేశమై చర్చించారు. వరద తగ్గితే తప్ప పిల్లరు పునర్నిర్మాణం, మరమ్మతులు చేసే అవకాశం లేదు. వరద నీటి ప్రవాహంలో మరమ్మతులు చేసే సాంకేతిక నైపుణ్యం (టెక్నాలజీ) కాంట్రాక్టరు వద్ద లేదని, వరద తగ్గిన తరువాత పనులు మొదలు పెట్టాలని ఓ నిర్ణయానికి వచ్చిననట్లు సమాచారం. అప్పటిలోగా అవసరమైన సామగ్రిని సమకూర్చుకోవాలని బోర్డు అఽధికారులు కాంట్రాక్టరుకు సూచించినట్లు తెలుస్తోంది. వరదలోనూ మరమ్మతులు చేసే టెక్నాలజీ లేకపోవడం వల్లనే జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

దిగుబడిపై ప్రభావం:

ఎల్లెల్సీ కింద హాలహర్వి, హొళగుంద, ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడుబూరు, మంత్రాలయం, నందవరం, ఎమ్మిగనూరు, గోనెగండ్ల మండలాల్లో 50 వేల ఎకరాల్లో పత్తి, మిరప, వరి పంటలు సాగు చేశారు. కీలకమైన పొట్ట, పూత, కాయ దశలో పంటలు ఉన్నాయి. పిల్లరు కొట్టుకుపోయిన సమయంలో జిల్లాలో పుష్కలంగా వర్షాలు ఉండడంతో సాగునీటి సమస్య తలెత్తలేదు. వారం రోజులుగా చుక్క వర్షం లేదు. కాలువలో నీటి సరఫరా నిలిపివేశారు. ఫలితంగా నీటి తడులు అందక పంట పొలాలు నెర్రలిస్తున్నాయి. వరి, మిరప, పత్తి పంటలు ఎండు దశకు చేరుకున్నాయి. ఇప్పటికే ఎకరాకు రూ.45 వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. మిరప పంటకు రూ.75 వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు చేశారు. మరో ఐదారు రోజుల్లో కాలువకు నీరు ఇవ్వకపోతే ముప్పాతిక శాతం పంట దిగుబడులు కోల్పోవాల్సి వస్తుందని రైతులు అంటున్నారు. అదే జరిగితే దిగుబడి, పెట్టుబడి రూపాల్లో ఎకరాకు సగటున రూ.75 వేల ప్రకారం రూ.375 కోట్లు నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఇరిగేషన ఇంజనీర్ల దృష్టికి ఈ సమస్య తీసుకెళితే.. అక్విడక్ట్‌ పిల్లరు మరమ్మతుల బాధ్యత టీబీపీ బోర్డు చూడాలని, బోర్లును ఆదేశించే అధికారం తమకు లేదని అన్నారు. కాలువకు నీళ్ల్లొచ్చినప్పుడే పంటలకు ఇస్తామని వారు తేల్చేవారు. ఇంత జరుగుతున్నా ఆలూరు, ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, కోడుమూరు ఎమ్మెల్యేలు మంత్రి గుమ్మనూరు జయరాం, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, వై. సాయిప్రసాద్‌రెడ్డి, వై. బాలనాగిరెడ్డి, డాక్టర్‌ జె.సుధాకర్‌ తమకేమి పట్టనట్లు వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. మరమ్మతులపై టీబీపీ బోర్డు ఎస్‌ఈ శ్రీకాంతరెడ్డి వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

ఫ పెట్టుబడి మట్టిపాలే - విరుపాక్షి, ఎల్లెల్సీ ఆయకట్టు రైతు, మదిరె గ్రామం, ఆదోని మండలం:

ఎల్లెల్సీ కింద ఎకర ఆయకట్టులో వరి సాగు చేశాను. ఇప్పటికే రూ.45 వేలు ఖర్చు చేశారు. పంట పొట్ట దశలో ఉంది. కీలకమైన సమయంలో కాల్వకు నీరు ఆపేశారు. వర్షాలు కూడా పడడం లేదు. పది రోజులుగా తడి అందక పైరు ఎండుదశక చేరింది. ఐదారు రోజుల్లో తడి ఇవ్వకపోతే 75 శాతానికి పైగా దిగుబడి కోల్పోతాను.

ఫ అప్పులపాలు అవుతాం

- సింధూవాళం వెంకటేష్‌, కౌలు రైతు, హొళగుంద:

ఎల్లెల్సీని నమ్ముకొని 8 ఎకరాలు కౌలుకు తీసుకొని 5 ఎకరాల్లో వరి, 3 ఎకరాల్లో మిరప సాగు చేశాను. వరి పొట్ట దశలో, మిరప పూత, కాయ దశలో ఉంది. దాదాపు రూ.5 లక్షల వరకు ఖర్చు చేశాను కీలకమైన దశలో హగరి అక్విడక్ట్‌ పిల్లరు కొట్టుకుపోయిందని కాల్వకు నీటిని ఆపేశారు. సకాలంలో సాగునీరు ఇవ్వకపోతే రూ.10 లక్షల దిగుబడి నష్టపోయి అప్పులపాలవుతాను.

Updated Date - 2022-10-27T23:01:02+05:30 IST