ప్రజాస్వామిక శక్తులు బలోపేతం కావాలి

ABN , First Publish Date - 2022-07-18T05:46:33+05:30 IST

దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని, రాజ్యాంగ విలువలకు భిన్నంగా కుహనా సెక్యులరిజం అమలు జరుగుతోందని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా వైద్యుడు డాక్టర్‌ వి. బ్రహ్మారెడ్డి అన్నారు.

ప్రజాస్వామిక శక్తులు బలోపేతం కావాలి

 జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ వి. బ్రహ్మారెడ్డి

కర్నూలు (కల్చరల్‌), జూలై 17: దేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని, రాజ్యాంగ విలువలకు భిన్నంగా కుహనా సెక్యులరిజం అమలు జరుగుతోందని జన విజ్ఞాన వేదిక (జేవీవీ) రాష్ట్ర అధ్యక్షుడు, ప్రజా వైద్యుడు డాక్టర్‌ వి. బ్రహ్మారెడ్డి అన్నారు. ఆదివారం నగరంలోని బిర్లా గేటు సమీపంలోని డాక్టర్‌ బ్రహ్మారెడ్డి ఆసుపత్రిలోని కాన్ఫరెన్స హాలులో, ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ‘కుహనా సెక్యులరిజం - ముంచుకొస్తున్న మతోన్మాదం - ఫాసిజం - విభిన్న రూపాలు - ప్రమాదం - మన కర్తవ్యం’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ప్రధాన వక్తగా డాక్టర్‌ బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ దేశంలో మెజారిటీ మతం పేరిట మైనారిటీ మతాల వారిపై దాడులు జరుగుతున్నాయని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాల వారీగా, మతాల వారీగా ప్రజలను విడదీస్తోందని చెప్పారు. ఈ పరిస్థితి దేశ లౌకిక, సామ్యవాద స్థితికి భంగకరమని పలు ఉదాహరణల మధ్య వివరించారు. మరో వక్త ప్రజా అభ్యుదయ సంస్థ నాయకుడు భార్గవ మాట్లాడుతూ పాలక వర్గాలు చేస్తున్న దోపిడీని, అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక పాలసీలను ప్రశించకుండా ఉండడానికి మతాన్ని ఎరగా వాడుతున్నారని విమర్శించారు. ఒకేదేశం, ఒకే పార్టీ పేరిట మళ్లీ హిందుత్వ మనువాద సిద్ధాంతాలను అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని, తమ ఫాసిస్టు విధానాలను ప్రశించిన ప్రజాస్వామికవాదులు, రచయితలు, హక్కుల నేతలపై ఊపా, జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేసి నిర్బంధిస్తున్నారని అన్నారు. ప్రగతిశీల, ప్రజాస్వామిక వాదులు లౌకిక ఉద్యమాలను బలోపేతం చేయాలని, ప్రభుత్వం చేస్తున్న ఫాసిస్టు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రత్నం ఏసేపు అధ్యక్షుడిగా వ్యవహరించిన ఈ సదస్సులో ప్రజాస్వామ్య సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ రామకృష్ణారెడ్డి, ప్రజా అఽభ్యుదయ సంస్థ నాయకుడు యోహాన, రాయలసీమ కో ఆర్డినేషన కమిటీ నాయకుడు రాజు, ఎస్‌డీపీఐ నాయకుడు చాంద్‌బాషా, జేవీవీ నాయకుడు ప్రతాపరెడ్డి, డీటీఎఫ్‌ ప్రధాన కార్యదర్శి గట్టు తిమ్మప్ప, పౌర హక్కుల సంఘం నాయకుడు అల్లాబకాష్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-07-18T05:46:33+05:30 IST