-
-
Home » Andhra Pradesh » Kurnool » Decreased peanut yield-NGTS-AndhraPradesh
-
తగ్గిన వేరుశనగ దిగుబడి
ABN , First Publish Date - 2022-02-19T05:33:46+05:30 IST
మండలంలో రబీ సీజన్‌లో బోర్ల కింద సాగు చేసిన వేరుశనగ పంట దిగుబడి భారీగా తగ్గింది.

- ఆందోళనలో రైతులు
చాగలమర్రి, ఫిబ్రవరి 18: మండలంలో రబీ సీజన్‌లో బోర్ల కింద సాగు చేసిన వేరుశనగ పంట దిగుబడి భారీగా తగ్గింది. అధిక వర్షాలు, తెగుళ్లతో పంట దెబ్బతిని నష్టం వాటిల్లిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. చింతలచెరువు, కొలుములపేట, పెద్దవంగలి, చిన్నవంగలి, కేపీ తండా, మూడురాళ్లపల్లె తదితర గ్రామాల్లో 500 ఎకరాల్లో రైతులు వేరుశనగ సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో తుఫాను ప్రభావం పం టపై పడి దెబ్బతింది. ఎకరాకు 40 బస్తాలు దిగుబడి రావాల్సి ఉండగా 10 నుంచి 15 బస్తాలకు మించలేదు. మరో పక్క ధర కూడా పడిపోవడంతో పొలాల్లోనే ఆరబెట్టుకున్నారు. రెండు నెలల క్రితం క్వింటా ధర రూ.2 వేల నుంచి రూ.2,500 పలికింది. పంట చేతికొచ్చాక రూ.1,800కు పడిపోయింది. తుఫాను ప్రభావంతో కాయ రంగుమారడంతో వ్యాపారులు కొనుగోలు చేసేందుకు ముందుకు రావడం లేదు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నారు.
వర్షాల వల్ల నష్టపోయాం
వేరుశనగ పంట సాగు చేసి వర్షాల వల్ల భారీగా నష్టపోయాం. ఎకరాకు 15 బస్తాల దిగుబడి కూడా రాలేదు. రెండు ఎకరాల్లో పంట సాగు చేశాను. ఎకరాకు రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలి.
- మనోహర్‌రెడ్డి, రైతు, చింతలచెరువు
పెట్టుబడి కూడా రాలేదు
వేరుశనగ పంట దిగుబడి తగ్గి నష్టాలు మిగిల్చింది. మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. పంట చేతికొచ్చే సమయంలో వర్షాల వల్ల కాయలు దెబ్బతిని నష్టం వాటిల్లింది. పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. పరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలి.
- శివశంకర్‌రెడ్డి, రైతు, చింతలచెరువు