మంత్రాలయంలో పెరిగిన భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-08-08T04:33:03+05:30 IST

మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది.

మంత్రాలయంలో పెరిగిన భక్తుల రద్దీ

మంత్రాలయం, ఆగస్టు 7: మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనార్థం వచ్చే భక్తులతో మంత్రాలయం కిక్కిరిసింది. ఆదివారం సెలవు దినం కావడం, ఉరుకుంద ఈరన్న స్వామి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుండటంతో మఠం ప్రాంగణం కిటకిటలాడింది. దక్షిణాది రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ప్రధాన రహదారులు, అన్నపూర్ణ భోజనశాల, మఠం ముఖద్వారం, నదితీరం, మఠం ప్రాంగణం భక్తులతో సందడిగా మారింది. మంచాలమ్మను దర్శించుకుని రాఘవేంద్రస్వామికి పూజలు చేసి రథోత్సవాల ఊరేగింపులో పాల్గొని పీఠాధిపతి ఆశిస్సులు పొందారు. భక్తుల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. పూజా సామగ్రికి, ప్రైవేటు అతిథిగృహాలకు డిమాండ్‌ పెరిగింది. 

నూతనంగా క్యూలైన్లు  

మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంలో ఉత్తర భాగంలో మఠం ప్రాంగణంలో భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తులు దర్శనార్థం వచ్చి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రెండు లైన్లును స్టీల్‌ కడ్డీలతో ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు అధిక సంఖ్యలో వచ్చే భక్తుల కోసం తోపులాడకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు మఠం అధికారులు తెలిపారు.  


Updated Date - 2022-08-08T04:33:03+05:30 IST