అదును దాటుతోంది..!

ABN , First Publish Date - 2022-06-27T05:03:49+05:30 IST

ఖరీఫ్‌ కాలం మొదలైంది. రైతులు పొలాలను దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచారు.

అదును దాటుతోంది..!
కొండమాయపల్లె చిన్నరాజు చెరువు

ఇంకా జోరందుకోని వ్యవసాయం

నిండని చెరువులు, బావులు

అందుబాటులో లేని ఎరువులు, విత్తనాలు 

ఆందోళనలో అన్నదాతలు


 ఖరీఫ్‌ కాలం మొదలైంది. రైతులు పొలాలను దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచారు. కానీ ప్రకృతి ఇంకా అనుకూలించలేదు. తగినన్ని వానలు కురవలేదు. చెరువులు, బావులు నిండలేదు. ప్రాజెక్టుల్లో కూడా అంతంత మాత్రంగానే నీరు ఉంది. కేసీ, తెలుగుగంగ ఆయకట్టు రైతులకు నీరందే సూచనలు కనిపించడం లేదు.  దీనికి తోడు ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇన్‌పుట్‌ సబ్సిడీ కొద్దిమంది రైతులకు మాత్రమే అందింది. సాగుకు సిద్ధంగా ఉన్నా రైతులకు ఇంకా విత్తనాలు అందలేదు. అదును దాటుతోంది.. ఏం చేయాలి? అని రైతులు ఆందోళనలో ఉన్నారు. 


-నంద్యాల, ఆంధ్రజ్యోతి


రాయలసీమలోని కోనసీమగా నంద్యాలను చెప్పుకుంటారు. ఇక్కడ కాల్వల కింద సాగయ్యే ఆయకట్టు ఉమ్మడి జిల్లాలోని మిగతా ప్రాంతాలతో పోల్చితే చాలా ఎక్కువ. చెరువులు, బావుల కింద కూడా సాగు భూములు బాగా ఉన్నాయి. జిల్లాలో దాదాపు 450 చెరువులు ఉన్నాయి. వీటిలో దాదాపు 22 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. ఈ చెరువుల కింద 1.75 లక్షల ఎకరాల ఎకరాల్లో పంటలు పండుతాయి. అలాగే జిల్లా వ్యాప్తంగా దాదాపు 95 వేల పంపుసెట్లు ఉన్నాయి. వాటిలో భూగర్భ జలాధారిత బోర్లు 45 వేలు కాగా మిగతావి కాల్వలు, చెరువులు, బావుల మీద ఉన్నాయి. ఒక్కో బోరు కింద దాదాపు రెండున్నర ఎకరాలు సాగవుతాయి. ఈ సంవత్సరం వర్షాలు ఇప్పటి వరకు అనుకున్నంతగా కురవలేదు. దీంతో చెరువులు, బావులు నిండలేదు. వీటి మీద ఆధారపడిన రైతులు ఉసూరుమంటున్నారు.


ప్రకటనలకే పరిమితం..


ఆర్బీకేల్లో అన్నీ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో సాగుచేసే వేరుశనగ, కంది, మినుములు, పెసర వంటి వివిధ రకాల పంటలకు అవసరమై విత్తనాలు 26,816 క్వింటాళ్లు అవసరం కాగా, ఇప్పటి వరకు 12,870 క్వింటాళ్లు మాత్రమే అందుబాటులో ఉంచారు. అలాగే అలాగే డీఏపీ, ఎమ్‌వోపీ, ఎన్‌పీకేఎస్‌, ఎస్‌ఎస్‌పీ, కంపోస్ట్‌ ఫెర్టిలైజర్స్‌ 1,92,336 మెట్రిక్‌ టన్నలు, యూరియా 59,018 మెట్రిక్‌ టన్నులు అవసమవుతాయని అధికారులు అంచనా. అయితే వీటిలో ప్రతి ఆర్బీకేలో 10 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉంచాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఈ లెక్కన జిల్లాలోని 411 ఆర్బీకేల్లో కేవలం 4,110 మెట్రిక్‌ టన్నులు అందుబాటులో ఉండాలి. అధికారుల అంచనాకు, ఆర్బీకేల్లో అందుబాటులో ఉంచేవాటికి ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. దీంతో జిల్లా రైతులు సాగు కోసం నానా ఇబ్బందులు పడుతున్నారు. 

 

సాగైంది కొంతే..


ఈ అన్ని ఇబ్బందుల వల్ల జిల్లాలో సాగు ఆశాజనకంగా లేదు. జిల్లాలో పత్తి ప్రతి ఏటా 22,410 హెక్టార్లలో సాగవుతుంది. కానీ ఈసారి ఇప్పటికి కేవలం 209 హెక్టార్లు మాత్రమే సాగయింది. అలాగే వేరుశనగ 17,397 హెక్టార్లలో సాగువుతుండగా ప్రస్తుత 116 హెక్టార్లు, మిరప 7,012 హెక్టార్లు కాగా, 40 హెక్టార్లు, ఇతర పంటలు 28,225 హెక్టార్లు కాగా ఇప్పటి వరకు 48 హెక్టార్లలో మాత్రమే సాగయింది. ఇలా ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వరి, మొక్కజొన్న, కంది, మినుము, పత్తి, వేరుశనగ, మిరపతో పాటు ఇతర పంటలు 2 లక్షల, 28 వేల 984 హెక్టార్లలో పంటలు పండుతాయి. అయితే ప్రస్తుతం కేవలం 427 హెక్టార్లలో మాత్రమే అన్ని రకాల పంటలు సాగయ్యాయి.


ప్రైవేటు వ్యాపారుల వైపు..


వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇస్తున్నామని, పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారుల వైపు చూడాల్సిన అవసరం లేదని గొప్పలు చెప్పుకుంటోంది. కానీ ఇవేవీ నిజాలు కాదని క్షేత్ర పరిశీలనలో తేలింది. ఇన్‌పుట్‌ సబ్సిడీని అర్హులైన రైతులకు కాకుండా వైసీపీ అనుకూలురకే ఇస్తున్నారనే  ఆరోపణలు ఉన్నాయి. ప్రతి ఏటా రైతులు దుక్కి దున్ని, విత్తనాలు, ఎరువులు కొనుగోలు కోసం ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు తీసుకోవాల్సి వస్తోంది. ఈసారి కూడా అదే పరిస్థితి దాపురించింది. జిల్లాలో అధిక శాతం కౌలు రైతులు ఉన్నారు. వీరందరికీ కౌలు కార్డులు లేవు. వీరికి ఇన్‌పుట్‌ సబ్సిడీ అందే అవకాశం లేదు. వీరు కూడా ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దగ్గర పెట్టుబడి డబ్బులు తీసుకుంటున్నారు.  ప్రైవేటు వడ్డీ వ్యాపారులు అధిక వడ్డీతో రైతులు నడ్డి విరుస్తున్నారు.


 ఇచ్చేది కొంతే..


జిల్లాలో వ్యవసాయం చేసే ప్రతి రైతుకు ఆర్బీకేల ద్వారా కావాల్సిన పంట విత్తనాలు అందిస్తామని అటు ప్రభుత్వం, ఇటు అధికారులు చెబుతున్నారు. అయితే అది వట్టి మాటేనని క్షేత్రస్థాయి పరిస్థితి చూస్తే అర్థమవుతుంది. జిల్లాలో ముఖ్యంగా వరి, వేరుశనగ, పత్తి, మిరప, మినుము, మొక్కజొన్న వంటి పంటలు పండిస్తారు. ఇవన్నీ ఆర్బీకేల్లో అందుబాటులో లేవు. ఉన్నా అవసరమైన మేర లేవు. దీనికి తోడు ఫలానా విత్తనాలు కావాల్సిన వారు ముందుగా డబ్బులు చెల్లించాలన్న నిబంధన ఉండటంతో చాలా మంది రైతులు ముందుకు రావడం లేదు. ఇక ఏదైనా పంట వేస్తామని, దానికి కావాల్సిన విత్తనాలు ఇవ్వమని రైతులు అడిగినా అరకొరా ఇస్తున్నారు. వేరుశనగ సాగు చేయడానికి 3 బస్తాలు అవసరమవుతాయి. ఒక బస్తా వేరుశనగ ధర బహిరంగ మార్కెట్‌లో రూ.8,580 పలుకుతోంది. దీనిపై 40 శాతం సబ్సిడీ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఆర్బీకేల ద్వారా ఒక రైతుకు ఒక బస్తా మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన 5 ఎకరాల్లో వేరుశనగ సాగు చేసే రైతుకు 15 బస్తాలు అవసరం కాగా, ఒక బస్తాను మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన 14 బస్తాలు బహిరంగ మార్కెట్‌లో కొనాల్సిందే.  ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందకపోగా, బయట కొనడం ద్వారా నకిలీల బారినపడే పరిస్థితి ఏర్పడింది. 


చెరువు తూములు శిథిలం 


సాగునీరు  నిలువ ఉండేనా? 


రుద్రవరం, జూన్‌ 26: రుద్రవరం మండలంలోని కొండమాయపల్లె గ్రామ సమీపంలో ఉన్న చిన్నరాజు చెరువును పూర్వం తాగునీటి కోసం నిర్మించారు.  ఈ చెరువు కింద ఆయకట్టు, నాన్‌ ఆయకట్టు భూములు సుమారు 200 ఎకరాలు ఉన్నాయి. దీనికి ఉన్న రెండు తూములు శిథిలమయ్యాయి. వర్షాలు కురిస్తే వర్షపు నీరు నిల్వ ఉండదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షపు నీరు నిల్వ చేరకపోతే ఆయకట్టు భూములు సాగుచేయడం సాధ్యం కాదని రైతులు వాపోతున్నారు. 


అడుగంటిన అభిరెడ్డి పల్లె చెరువు


డోన్‌ (రూరల్‌), జూన్‌ 26: డోన్‌ మండలం వెంకటాపురం గ్రామ సమీపంలోని అభిరెడ్డిపల్లె చెరువు అడుగంటిపోతోంది.  వర్షాభావం వల్ల ఈ చెరువులో నీటి శాతం తగ్గుతూ వస్తోంది. క్రమంగా అడుగంటిపోయింది. 

Updated Date - 2022-06-27T05:03:49+05:30 IST