రామ్‌కో ఏర్పాటు ఘనత టీడీపీదే: బీసీ

ABN , First Publish Date - 2022-10-01T06:13:58+05:30 IST

కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు ఘనత టీడీపీదేనని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు.

రామ్‌కో ఏర్పాటు ఘనత టీడీపీదే: బీసీ
మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి

కొలిమిగుండ్ల, సెప్టెంబరు 30: కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ ఏర్పాటు ఘనత టీడీపీదేనని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌ రెడ్డి అన్నారు. కొలిమిగుండ్ల టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం మండల టీడీపీ కన్వీనర్‌ మూలె రామేశ్వర రెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం  నిర్వహించారు. బీసీ మాట్లాడుతూ ఇటీవల కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమ ప్రారంభించడానికి సీఎం జగన్‌ వచ్చారని, అయితే కొలిమిగుండ్ల ప్రాంతం సమస్యలు సీఎం ప్రస్తావించకపోవడం దారుణమని అన్నారు. గత మూడు దశాబ్దాల క్రితం నుంచే రామ్‌కో, ప్రిజం, గ్రాసిమ్‌, ఆల్ర్టాటెక్‌ సిమెంట్‌ పరిశ్రమల యాజమాన్యం కొలిమిగుండ్ల మండలంలో 16గ్రామాల్లో 90శాతం భూములను కొనుగోలు చేశారన్నారు. దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామరావు హయాంలో కొలిమిగుండ్ల మండలం తుమ్మలపెంట పరిధిలో ఎల్‌అండ్‌టి సిమెంట్‌ పరిశ్రమకు భూమిపూజ చేసి సిమెంట్‌ పరిశ్రమలకు శ్రీకారం చుట్టారన్నారు. నవ్యాంధ్రప్రదేశ్‌ ఏర్పడిన తరువాత అప్పటి సీఎం చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కొలిమిగుండ్లలో రామ్‌కో సిమెంట్‌ పరిశ్రమకు 500ఎకరాల ప్రభుత్వ  భూమి కేటాయించి  2018 డిసెంబర్‌ 14వ తేదీన వర్చువల్‌గా అనుమతులు ఇచ్చి రామ్‌కో పరిశ్రమ ఏర్పాటుకు భూమి పూజ చేశారన్నారు.  అప్పట్లో రెండున్నర సంవత్సర కాలంలోనే పరిశ్రమ నిర్మాణం పూర్తి కావాల్సి ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయన్నారు. టీడీపీ హయాంలో ప్రారంభించబడిన పరిశ్రమను ఇప్పుడు వైసీపి ప్రభుత్వం ప్రారంభించి ఆ ఘనత తమదేనని చెప్పుకుంటున్నారన్నారు. సీఎంకు, స్థానిక ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ప్రిజం, గ్రాసిమ్‌ సిమెంట్‌ పరిశ్రమల యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి వాటి నిర్మాణం పూర్తి అయ్యేటట్లు చర్యలు చేపట్టాలన్నారు. లేదంటే ఆ రెండు పరిశ్రమల మైనింగ్‌ లీజులను రద్దు చేయాలన్నారు. పరిశ్రమల్లో 75శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని 2019లో వైసీపీ ప్రభుత్వం జీవో ఇచ్చిందన్నారు. ఎమ్మెల్యే ఆ జీవో ప్రకారం పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇచ్చేటట్లు పరిశ్రమలపై ఒత్తిడి తెస్తున్నారా? అని ప్రశ్నించారు. నాపరాయి పరిశ్రమ గురించి ముఖ్యమంత్రి దృష్టికి ఎమ్మెల్యే తీసుకుపోక పోవడం అసమర్థత అని అన్నారు. ఎప్పుడైనా ఈ అంశంపై  పరిశ్రమల యజమానులతో సమీక్ష పెట్టి  చర్చించారా? అని ప్రశ్నించారు. స్థానిక యువత తమ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని ధర్నాలు చేస్తే పోలీసులచే వారి ధర్నాలను అణచివేస్తున్నారన్నారు.  పెట్నికోట, గొర్విమాన్‌పల్లి గ్రామాల మధ్య ఎత్తిపోతల పథకాన్ని గురించి ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్‌ సీఎం దృష్టికి తీసుకుపోకపోవడం సిగ్గుచేటన్నారు. తిమ్మనాయునిపేట చెరువుకు రూ.32 కోట్లతో ఎత్తిపోతల పథకం మంజూరు చేయించామని అలాగే సంఘపట్నం చెరువుకు ఎత్తిపోతల పథకం మంజూరు చేయించామని అన్నారు. సుజల స్రవంతి పథకం కూడా మంజూరు చేయించామన్నారు. 75శాతం ఉద్యోగాలు ఇవ్వకపోతే స్థానిక యువతతో కలిసి తాము ఉద్యమాలు చేస్తామని తెలిపారు.  టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల రామేశ్వర రెడ్డి, నియోజకవర్గం కో కన్వీనర్‌ విఆర్‌ లక్ష్మీరెడ్డి, మండల తెలుగు యువత అద్యక్షులు ఉసేన్‌ రెడ్డి, కల్వటాల కామిని క్రిష్ణా రంగారెడ్డి, భాస్కర్‌ రెడ్డి, తోట శివారెడ్డి, అంబటి ప్రసాద రెడ్డి, అందె రాము, కార్యకర్తలు పాల్గొన్నారు. 

Read more