నకిలీ నోట్ల ముఠా అరెస్టు
ABN , First Publish Date - 2022-08-05T05:16:16+05:30 IST
నకిలీ నోట్ల ముఠాను నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని జలదుర్గం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.80 వేలు రికవరీ చేశారు.
ప్యాపిలి, ఆగస్టు 4: నకిలీ నోట్ల ముఠాను నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని జలదుర్గం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.80 వేలు రికవరీ చేశారు. అనంతరం స్థానిక సర్కిల్ కార్యాలయంలో సీఐ రామలింగమయ్య సమక్షంలో నిందితులను హాజరు పరిచి కేసు వివరాలను వెల్లడించారు. ప్యాపిలి మండలంలో ని రాచర్ల గ్రామానికి చెందిన లక్ష్మీకాంతమ్మకు గత ఏడాది సెప్టెంబరులో ఇద్దరు అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ.లక్ష అసలు నోట్లు ఇస్తే రెండు లక్షలు నకిలీ నోట్లు ఇస్తామని చెప్పారు. ఈ నకిలీ నోట్లు ఎవరూ గుర్తుపట్టరని నమ్మించారు. 15 రోజుల తర్వాత కడపకు చెందిన రాజశేఖర్, నంద్యాల జిల్లా బండిఆత్మకూరుకు చెందిన దస్తగిరి ఆ మహిళను కలిశారు. రెండు ఒరిజినల్ రూ.500 నోట్లు ఇచ్చారు. వారు అక్కడే ఉండి వాటిని మార్పించారు. దీంతో ఆమె ఆ ఇద్దరు వ్యక్తులను పూర్తిగా నమ్మింది. విషయాన్ని భర్త పెద్దఎల్లయ్యకు చెప్పి అసలు నోట్లు ఇవ్వడానికి సిద్ధపడింది. బనగానపల్లిలోని ఓ బ్యాంకులో, ఇతర వ్యక్తుల దగ్గర రూ.8లక్షలు అప్పు చేసింది. గత ఏడాది అక్టోబరులో సదరు వ్యక్తులకు రాచర్లలో రూ.8లక్షలు ఇచ్చింది. వాటిని తీసుకున్న దుండగులు రూ.16 లక్షల నకిలీ నోట్లు ఇచ్చి ఉడాయించారు. దీంతో బాధితురాలు బయట చెప్పితే అవమానమని నిమ్మకుండిపోయింది.
సీఐని కలసిన బాధితురాలు
గత ఏడాది నకిలీ నోట్ల ముఠాతో మోసపోయిన బాధితురాలు లక్ష్మీకాంతమ్మ ఎట్టకేలకు పెద్దల సలహా మేరకు వారం రోజుల క్రితం సీఐ రామలింగమయ్యను కలిసి తన మోసపోయిన విషయాన్ని వివరించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న ఆయన జలదుర్గం ఎస్ఐ నరేష్, ఏఎస్ఐ సుబ్బారెడ్డి సహకారంతో వారం రోజుల్లో కేసును ఛేదించారు. గురువారం ప్యాపిలి మండలంలోని చిగురుమాను మిట్ట దగ్గర నిందితులను అరెస్టు చేశారు. రాజశేఖర్, దస్తగిరితోపాటు స్థానిక మండలం వెంగళాంపల్లికు చెందిన విజయభాస్కర్ కూడా కేసులో నిందితుడిగా ఉన్నట్లు సీఐ తెలిపారు.