అధికారులు బాధ్యతగా పని చేయాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-08-11T06:06:51+05:30 IST

అధికారులు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సూచించారు.

అధికారులు బాధ్యతగా పని చేయాలి: కలెక్టర్‌
సచివాలయంలో ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడుతున్న కలెక్టర్‌

అవుకు, ఆగస్టు 10: అధికారులు బాధ్యతగా పని చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సూచించారు. అవుకు పట్టణంలోని రెవెన్యూ కార్యాలయాన్ని బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. మండల పరిషత్‌ రైతు భరోసా, సచివాలయం కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రంలో రైతులకు అందిస్తున్న సేవలపై వ్యవసాయ అధికారులను ప్రశ్నించారు. వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులు సాగు చేసిన పంటలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు, పురుగు మందులు సకాలంలో రైతులకు అందించే విధంగా కృషి చేయాలన్నారు. సచివాలయానికి చేరుకొని ప్రజలకు, పాఠశాలల్లోని విద్యార్థులకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరోగ్య సిబ్బందిని ప్రశ్నించారు. గ్రామాలలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా వైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. బాధ్యతా నిర్వహణలో అధికారులు అలసత్వం వహిస్తున్నట్లు ప్రజల నుంచి ఫిర్యాదులు అందితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్రీనివాసులు, ఎంపీడీవో ఆజాంఖాన్‌, వ్యవసాయ అధికారి ప్రసాదరావు, హౌసింగ్‌ ఏఈ గౌస్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ కరీముల్లా, పశువైద్యాధికారి భారతీదేవి, ఎంఈవో శ్రీధర్‌రావు, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ నాగ సుంకమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-11T06:06:51+05:30 IST