చిరుత ఒక్కటి కాదు
ABN , First Publish Date - 2022-09-18T05:38:05+05:30 IST
అంతరించిపోయిన చీతాలు మళ్లీ వస్తున్నాయి... వచ్చేశాయి...
చీతా, చిరుత, జాగ్వార్‌ల రూపం...జీవన విధానంలో వైరుధ్యం
శరీరంపై ఉన్న చారలతోనే గుర్తింపు
1952లోనే చీతాలు అంతరించినట్లు కేంద్రం ప్రకటన
నమీబియా నుంచి దేశానికి ఎనిమిది రాక
అంతరించిపోయిన చీతాలు మళ్లీ వస్తున్నాయి... వచ్చేశాయి... మూడు నాలుగు రోజులుగా మీడియాలో వస్తున్న ఈ వార్తలతో అనేక మందిలో సందేహాలు. అందరికీ ‘చీతా’ అంటే చిరుతపులిగానే తెలుసు. మన అడవుల్లో అన్ని చిరుత పులులు ఉంటే...అంతరించిపోవడమేంటనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చీతా, చిరుతపులులు(లియోపార్డ్), జాగ్వార్.. ఇవన్నీ చిరుతలలో వివిధ రకాలు. వాస్తవానికి ఈ మూడూ ఒక్కటి కాదు. చూడడడానికి ఒకేలా కనిపించినప్పటికీ వాటి జీవన విధానంలో ఎంతో వైరుధ్యం ఉంటుంది. మనదేశంలో చిరుతపులులు చాలా ఉన్నాయి. చీతాలు మాత్రం 1952లోనే అంతరించిపోయినట్లు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. మన రాష్ట్రంలోని నాగార్జునసాగర్-శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం పరిధిలో 150కి పైగా చిరుతపులు ఉన్నట్లు అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో ప్రత్యేకించి ఆత్మకూరు అటవీ డివిజన్‌లోనే 60కి పైగా ఉన్నట్లు సమాచారం. అంతరించిపోయిన చీతాలను దేశంలో సంరక్షించి పర్యావరణ పరిరక్షణకు మరింత ప్రాధాన్యం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అడుగు ముందుకేసింది. ఇందులో భాగంగానే నమీబియా నుంచి ఐదు ఆడ, మూడు మగ చీతాలను ప్రత్యేక విమానంలో దేశానికి తీసుకొచ్చారు. శనివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ వీటిని మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో విడిచిపెట్టారు. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు తట్టుకుని జీవిస్తే వాటిని నెలరోజుల తర్వాత అడవిలోకి వదులుతారు.
-ఆత్మకూరు
చీతా జీవన విధానం
చీతా శాస్త్రీయ నామం అసినోనిక్స్ జుబాటస్. ఇవి దట్టమైన అడవుల్లో కాకుండా చిట్టడవులు, గడ్డిమైదానాలు, ఎడారులు వంటి ప్రాంతాలను ఆవాసంగా ఎంచుకుంటాయి. ఎక్కువగా ఉప-సహారా ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఆఫ్రికన్ చిరుత తల నుంచి తోక వరకు 3.3 అడుగుల నుంచి 5 అడుగుల వరకు ఉంటుంది. తోక 24 నుంచి 32 అంగుళాలు ఉంటుంది. బరువు 21 నుంచి 72 కిలోల వరకు ఉంటుంది. మగచిరుత బరువు ఇంకా ఎక్కువగా ఉంటుంది. తలభాగం సన్నగా, గుండ్రంగా ఉండి కంటి నుంచి నీరు కారుతున్నట్లు కనిపిస్తాయి. అలాగే వీటి శరీరం గోధుమరంగు నుంచి ముదురు బంగారుఛాయ రంగులో ఉంటుంది. వీటిపై గుండ్రని నల్లమచ్చలు కప్పబడి ఉంటాయి. ఇతర మచ్చలున్న పిల్లిజాతి మాదిరిగా కాకుండా చిరుతలు తెల్లవారుఝామున లేదా మధ్యాహ్న వేళల్లో వేటాడతాయి. వాటి ఆహారంలో గాజెల్స్, ఇంపాలాస్, జింకలు ఉంటాయి. 80 నుంచి 120 వేగంతో పరిగెత్తే సామర్థ్యం కలిగి ఉండి ప్రతి శాకాహార జంతువుని వేటాడే శక్తివంతమైనదిగా చెబుతారు. మూడునెలల గర్భధారణ సమయంలో మూడు నుంచి నాలుగు పిల్లలకు జన్మనిస్తాయి. 20 నెలల వయసులో చిరుతలు స్వతంత్రంగా జీవిస్తాయి.
ఇదీ జాగ్వార్ స్టైల్
జాగ్వార్ల రూపం చిరుతపులికి చాలా దగ్గరగా ఉంటుంది. ఇవి నీటిలో ఈదే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. నీటిలో చేపలను, తాబేళ్లను, మొసళ్లను సైతం వేటాడే శక్తివంతమైన జంతువు జాగ్వార్. ఇవి ఒంటరిగా జీవిస్తాయి. తరచూ వ్యర్థాలు లేదా చెట్లకు పంజాలు ఉపయోగించి భూభాగాలను గుర్తుంచుకుంటాయి. చిరుతపులి తరహాలోనే వీటి శరీరంలో గులాబి ఆకారంలో మచ్చలు కలిగి ఉంటాయి. చిరుతపులితో పోలిస్తే మచ్చలు పెద్దగా ఉంటాయి. చిరుత పులి కంటే అధిక బరువు కలిగి ఉంటాయి. ఒకప్పుడు ఇవి యునైటెడ్ స్టేట్స్‌లోని టెక్సాస్, కాలిఫోర్నియా అటవీ ప్రాంతాల్లో జీవించేవి.
చిరుతపులుల జీవన విధానం
చెట్ల కొమ్మలపై ఇబ్బంది లేకుండా వేలాడే శక్తివంతమైన పిల్లి జాతుల్లో చిరుతపులులు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. వీటిని పాంథెర పార్డస్‌గా పిలుస్తారు. ఉప- సహారా ఆఫ్రికా, ఈశాన్య ఆఫ్రికా, మధ్య ఆసియా, భారతదేశం, చైనాలలో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవి నల్లమలలాంటి దట్టమైన అటవీ ప్రాంతాలతో పాటు పచ్చికభూములు, పర్వత ఆవాసాల్లో జీవిస్తున్నాయి. చిరుతపులులు ఎక్కువగా చెట్లపైనే జీవిస్తుంటాయి. వీటి శరీరంపై గులాబి ఆకారంలో రోసెట్ అని పిలువడే విలక్షణమైన చీకటి మచ్చలు, లేతరంగులో ఉంటాయి. చిరుతపులులు గంటకు 58కి.మీ. వేగంతో పరుగెత్తగలిగే సామర్థ్యం కలిగి ఉంటాయి. శాకాహార జంతువులను వేటాడుతాయి. చీతాలు, చిరుతపులులకు గల తేడాను శరీరంపై ఉండే చారికలను బట్టి గుర్తిస్తారు. అదేవిధంగా చీతాతో పోలిస్తే అధిక బరువును కలిగి ఉంటుంది.
చిరుతల ప్రాముఖ్యంపై అవగాహన కల్పిస్తున్నాం
పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేశంలో చిరుతల సంరక్షణకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ కసరత్తు చేయడం హర్షణీయం. చిరుతలపై ప్రజలకు అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. అక్టోబరు 1 నుంచి జరిగే వన్యప్రాణి వారోత్సవాల్లో భాగంగా చిరుతల ప్రాముఖ్యతను మరింతగా తెలియజేసేందుకు చొరవ తీసుకుంటాం.
- సందీప్‌రెడ్డి, ఆత్మకూరు ఇన్‌చార్జి డీఎఫ్‌వో