పరిహారం చెల్లించే వరకు పోరాటం

ABN , First Publish Date - 2022-02-16T06:09:33+05:30 IST

పట్టణంలో రోడ్ల వెడల్పుతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించే వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, టీడీపీ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు.

పరిహారం చెల్లించే వరకు పోరాటం
పట్టణంలో ర్యాలీ చేస్తున్న మాజీ మంత్రి అఖిలప్రియ, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, టీడీపీ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి

రోడ్ల వెడల్పుతో నష్టపోయిన వారిని ఆదుకోవాలి
కేసుల పేరుతో భయపెడుతున్న వైసీపీ ప్రభుత్వం
టీడీపీ నేతలు ఫరూక్‌, గౌరు వెంకటరెడ్డి, అఖిలప్రియ


ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 15: పట్టణంలో రోడ్ల వెడల్పుతో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించే వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ ఎన్‌ఎండీ ఫరూక్‌, టీడీపీ నంద్యాల లోక్‌సభ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, మాజీ మంత్రి అఖిలప్రియ అన్నారు. రోడ్ల వెడల్పులో అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ టీడీపీ శ్రేణులతో మంగళవారం భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం రోడ్ల వెడల్పుతో స్థలాలు కోల్పోయిన వారిని టీడీపీ నేతలు ఆరా తీశారు. అనంతరం మాజీ మంత్రి అఖిలప్రియ ఇంటిలో వారు విలేకరులతో మాట్లాడుతూ గతంలో మురుగు కాలువలు, రోడ్ల వెడల్పు పనులు చేపట్టారన్నారు. ఇప్పుడు మళ్లీ రోడ్ల వెడల్పు, మురుగు కాలువల నిర్మాణం పేరుతో పేదల స్థలాలను లాక్కోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. వైసీపీ నాయకులు స్వార్థంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. నంద్యాలలో టీడీపీ హయాంలో రోడ్ల వెడల్పు చేపట్టినప్పుడు నోటీసులిచ్చి వారి నుంచి సమాధానం వచ్చిన తరువాత అప్పటి సీఎం చంద్రబాబునాయుడు క్యాబినెట్‌లో ఆమోదం తెలిపాకే పనులు చేశామని గుర్తు చేశారు. కానీ ఇక్కడ అధికారపార్టీ నాయకులు అవేమీ పట్టించుకోక పోవడం భావ్యం కాదన్నారు. నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణికులకు సౌకర్యంగా ఉన్న భూమా బస్‌ షెల్టర్‌ను పడగొట్టారని, అయితే దీనిపక్కనే ఉన్న ఆళ్లగడ్డ మున్సిపల్‌ చైర్మన్‌ రామలింగారెడ్డి తన భవనాలు కూల్చరాదంటూ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారని అన్నారు. వారి పార్టీ నాయకులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయమా? అని నిలదీశారు. ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తే వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. పట్టణంలో నోటీసులు ఇవ్వకుండానే కట్టడాలు కూల్చి వేశారని, వారికి నష్టపరిహారం ఊసేలేదని అన్నారు. ఎమ్మెల్యే అనుచరులు అక్రమాలకు పాల్పడుతున్నారని, ఈ విషయాన్ని కలెక్టరుకు ఫిర్యాదు చేస్తామని అన్నారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలను ప్రజలు గమనిస్తున్నారని, ప్రజలు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. సమావేశంలో టీడీపీ నాయకులు భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి, భార్గవ్‌రామ్‌నాయుడు, సోముల చంద్రశేఖరరెడ్డి, మర్రిపల్లె పాపిరెడ్డి, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.

Read more