చాటుమాటుగా
ABN , First Publish Date - 2022-06-21T05:45:47+05:30 IST
మద్యం వ్యాపారం అన్నిటి కంటే లాభసాటి. కాబట్టి అక్రమార్కులు దాని చుట్టూ కాచుక్కూచున్నారు.

మద్యం దుకాణాల నుంచి బెల్ట్ షాపులకు
అధిక ధరలకు అడ్డంగా విక్రయం
బ్రాండెడ్ మద్యం బ్లాక్‌లోనే
దుకాణాల్లో కొత్త బ్రాండ్లే
అధికార పార్టీ కనుసన్నల్లో అక్రమ వ్యాపారం
మద్యం వ్యాపారం అన్నిటి కంటే లాభసాటి. కాబట్టి అక్రమార్కులు దాని చుట్టూ కాచుక్కూచున్నారు. వీలైనన్ని రకాలుగా దోచుకుంటున్నారు. అధికార పార్టీ వాళ్ల కనుసన్నల్లో లక్షల రూపాయలు దారి మళ్లుతున్నాయి. వ్యాపార నిబంధనలన్నీ గాలికిపోతున్నాయి. బ్రాండెడ్ మద్యం చాటుమాటుగా బ్లాక్‌కు తరలిపోతోంది. ధరలు పెంచి మద్యం బాబుల జేబులు ఖాళీ చేస్తున్నారు. వెరసి డోన్ ప్రభుత్వ మద్యం దుకాణాలు అక్రమాలకు నెలవయ్యాయి.
డోన్, జూన్ 20: మద్యం వ్యాపారం అక్రమార్కులపరం అయింది. బెల్టు షాపులను అడ్డు పెట్టుకుని కొందరు ఇష్టారాజ్యంగా దోచేస్తున్నారు. బ్రాండెడ్ మద్యం బాటిళ్లను తరలించి బ్లాక్‌లో విక్రయించుకుంటున్నారు. మద్యం దుకాణాలు.. అక్రమాల అడ్డాగా మారాయన్న విమర్శలున్నాయి. డోన్ నియోజకవర్గంలోని కొందరు అధికార పార్టీ నేతల గుప్పిట్లో ఈ దందా నడుస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఇందుకు ఎక్సైజ్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గంలోని డోన్ పట్టణంలో ఐదు మద్యం దుకాణాలున్నాయి. బేతంచెర్లలో 3, ఆర్ఎస్ రంగాపురంలో 2, ప్యాపిలిలో 2 మద్యం దుకాణాలున్నాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఈ మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. మద్యం దుకాణాల్లో లావాదేవీలను ఎక్సైజ్ శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ప్రతి మద్యం దుకాణాల్లో ముగ్గురు నుంచి నలుగురు ఔట్సోర్సింగ్ సిబ్బందిని నియమించారు.
ప్రతి నెలా రూ.8 కోట్ల మద్యం వ్యాపారం
డోన్ నియోజకవర్గంలో ప్రతి నెలా రూ.8 కోట్ల వరకు మద్యం వ్యాపారం జరుగుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. నియోజకవర్గంలోనే డోన్, ప్యాపిలి, బేతంచెర్లలో మొత్తం 12 దుకాణాలున్నాయి. ఈ మద్యం దుకాణాల్లో ప్రతి రోజూ రూ.25 లక్షలకు పైనే వ్యాపారం జరుగుతుంది. ఈ లెక్కన ప్రతి ఏడాదికి రూ.90 కోట్ల పైనే మద్యం వ్యాపారం జరగుతుందని అంచనా. దీనిబట్టి చూస్తే ఏ స్థాయిలో దోచుకుంటున్నారో వేరే చెప్పనక్కర్లేదు.
అక్రమాల అడ్డాగా..
డోన్ నియోజకవర్గంలో మద్యం దుకాణాల నుం చి బయటకు భారీ ఎత్తున మద్యం తరలిపో తున్న ట్లు ఆరోపణలున్నాయి. ఈ మద్యం దుకాణాలన్నీ కొంద రు అధికార వైసీపీ నేతల కనుసన్నల్లో నడుసు ్తన్నాయి. నేతలకు సంబంధించిన ఔట్సోర్సింగ్ సిబ్బందే మద్యం దుకా ణాల్లో లావాదేవీలను చూస్తున్నారు. దీంతో మద్యం దుకాణాల్లో అక్రమాలకు తెరలేపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బెల్టు షాపులకు పెద్ద ఎత్తున మద్యాన్ని సరఫరా చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఏ బెల్టు దుకాణం షాపునకు ఎంత మద్యం పంపాలి.. ఏయే బ్రాండ్లను పంపాలన్న వివరాలతో కూడిన లిస్టు కొందరు నాయకుల నుంచి మద్యం దుకాణాల్లోని ఔట్సోర్సింగ్ సిబ్బందికి వస్తున్నట్లు సమాచారం. వాటికి అనుగుణంగా రాత్రివేళల్లో మద్యం బాటిళ్లను సేల్స్ చేసి చూపిస్తున్నట్లు విమర్శలున్నాయి. సేల్స్ చూపిన మద్యాన్ని బెల్టుషాపులకు తరలిస్తున్నట్లు సమాచారం.
బెల్ట్ షాపుల దందా
డోన్, ప్యాపిలి, బేతంచెర్ల మండలాల్లో బెల్టు దుకాణాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామాల్లో బెల్టు షాపులు దర్శనమిస్తున్నాయి. అధికార పార్టీ నేతల అండ వున్న వారే ఈ బెల్టు షాపులను నిర్వహిస్తున్నారన్న విమర్శలున్నాయి. బెల్టు షాపుల్లో ప్రతి క్వాటర్ బాటిల్ మీద రూ.20 నుంచి 30ల వరకు ఎంఆర్పీ ధరలపై అదనంగా గుంజుతున్నట్లు విమర్శలున్నాయి.
మద్యం దుకాణాల్లో బిల్లులేవీ?
ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలన్న నిబంధనలున్నాయి. అయితే ఈ నిబంధనలను మద్యం దుకాణాల్లో అసలు పాటించడం లేదు. మద్యం కొనుగోలు చేసిన వ్యక్తులకు బిల్లులు ఇవ్వకుండానే పంపిస్తున్నారు. ఎవరైనా బిల్లులు అడిగితే .. ఎంత మందికని బిల్లులు ఇవ్వాలని సిబ్బంది అంటున్నారు. దీని మీద అధికారులు స్పందించడం లేదు.
బ్రాండెడ్ మద్యం మాయం
మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ కంపెనీల మద్యం మాయమవుతుందన్న విమర్శలున్నాయి. నియోజకవర్గంలో ఉన్న మద్యం దుకాణాల్లో బ్రాండెడ్ మద్యం అసలు దొరకడం లేదు. బ్లెండర్ స్ర్పైడ్, మాన్షన్ హౌస్, రాయల్ స్టాగ్ తదితర బ్రాండెడ్ మద్యం దుకాణాల్లో దొరకడం లేదు. బ్రాండెడ్ మద్యం దుకాణాలకు వచ్చినా బ్లాక్‌ల్లోనే విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. పాత బ్రాండ్ల బీర్లలో కింగ్‌ఫిషర్ బీరు మాత్రమే సరఫరా అవుతుంది. కేఎఫ్ స్ర్టాంగ్ కూడా దొరకడం లేదని బీర్ ప్రియులు వాపోతున్నారు. మద్యం దుకాణాలకు వచ్చిన కింగ్‌ఫిషర్ బీర్లను బ్లాక్‌లోనే అమ్మేస్తున్నట్లు విమర్శలున్నాయి.
అన్నీ కొత్త బ్రాండ్లే
మద్యం దుకాణాల్లో అన్ని కొత్త బ్రాండ్లే కనిపిస్తున్నాయి. ఎప్పుడూ చూడని, వినని కొత్త బ్రాండ్లను చూస్తున్నామని మందుబాబులు వాపోతున్నారు. మద్యం దుకాణాల్లో బ్రాందీ, వీస్కీకి సంబంధించి 37 కంపెనీల బ్రాండ్లు ఉన్నాయి. ఇందులో ఒకట్రెండు మినహాయిస్తే.. మిగతావన్నీ కొత్త బ్రాండ్లేనని మందుబాబులు లబోదిబోమంటున్నారు. మద్యం దుకాణాల్లో బూమ్, బ్లాక్‌బస్టర్, బ్రిటీష్ ఎంపైర్ తదితర కంపెనీల బీర్లను మాత్రమే లభిస్తున్నాయి. దీంతో ఈ బీర్లను ఎప్పుడూ చూడలేదని మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. ప్రతి బీరు మీద రూ.20 వరకు అదనంగా మద్యం దుకాణాల్లో వసూలు చేస్తున్నట్లు విమర్శలున్నాయని బీరు ప్రియులు వాపోతున్నారు.
హైవే పక్కనే మద్యం దుకాణం
హైవే పక్కన మద్యం దుకాణాలు ఉండరాదన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలున్నాయి. అయితే.. డోన్ హైవే పక్కనే మద్యం దుకాణాన్ని ఏర్పాటు చేశారు. హైవే పక్కన ఉండటంతో మోటారు సైకిళ్లను, వాహనాలను డోన్‌లోనే ఆపేసి మద్యం కొనుగోలు చేస్తున్నారు. ప్రతి రోజు రూ.4 లక్షల పైనే మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం. హైవే పక్కనే మద్యం షాపు ఉండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తుంది.
అడ్రస్ లేని ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ
మద్యం దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ అడ్రస్ లేకుండా పోయిందన్న విమర్శలున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు మద్యం దుకాణాల సేల్స్ బాధితులను సెబ్ అధికారులు చూసేవారు. అయితే.. వారిని ఆ బాధ్యతల నుంచి తప్పించారు. మళ్లీ ఎక్సైజ్ అధికారులకే మద్యం దుకాణాల పర్యవేక్షణ బాధ్యతలు ప్రభుత్వం అప్పగించింది. ప్రస్తుతం డోన్‌లో ఎక్సైజ్ కార్యాలయాన్ని కూడా తీసివేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రం నుంచే ఎక్సైజ్ శాఖ కార్యకలాపాలు నడుస్తున్నాయి. దీంతో డోన్ నియోజకవర్గంలోని మద్యం దుకాణాల్లో ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ నామామాత్రంగా మారిందన్న ఆరోపణలున్నాయి.