అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2022-10-08T05:16:23+05:30 IST
వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి స్పిల్వేకు నీరు విడుదల చేస్తున్న కారణంగా కుందూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలి
వాగుల్లో ప్రవాహ ఉధృతిని పరిశీలించిన కలెక్టర్
నంద్యాల టౌన్, అక్టోబరు 7: వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి స్పిల్వేకు నీరు విడుదల చేస్తున్న కారణంగా కుందూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని రాణి మహారాణి థియేటర్ సమీపంలో కుందూనదిని, దళితవాడ - భీమవరం మధ్యన మద్దిలేరు వాగు ఉధృతిని కలెక్టర్ పరిశీలించారు. ఇంకా వర్షాలు కురిసి కుందూ నదికి వరద సంభవిస్తే విపత్తును ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపల్, తహసీల్దార్, ఆర్డీవో కార్యాలయాల్లో కమాండ్ కంట్రోల్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వెలుగోడు రిజర్వాయర్ నుండి స్పిల్వేకు నీటి ప్రవాహం నిలిచిపోయిందని, వరద మరింత తగ్గుముఖం పడుతుందని కేసీ కెనాల్ ఈఈ తిరుమలేశ్వరరెడ్డి కలెక్టర్కు తెలిపారు. కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు ఉన్నారు.
బండి ఆత్మకూరు: కుందూనదితో పాటు, వాగులు, వంకలకు ఉధృతంగా ప్రవహిస్తున్న దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ సూచించారు. శుక్రవారం మండలంలోని కుందూనది, మద్దిలేరు, పోతులవాగుల్లో నీటి ప్రవాహ ఉధృతిని ఆయన వివిధ శాఖల అధికారులతో కలసి పరిశీలించారు. కుందూలో ఇప్పటికే 16 టీఎంసీలకు పైగా నిల్వ ఉందన్నారు. గాలేరు నది ద్వారా కుందూకు నీటి విడుదల పెరిగే అవకాశం ఉన్నందున నదీ తీర గ్రామాల ప్రజలు, రెవెన్యూ, నీటి పారుదల, పంచాయతీరాజ్ అధికారులను అప్రమత్తం చేశామన్నారు. కలెక్టర్ వెంట నంద్యాల సబ్ కలెక్టర్ శ్రీనివాసులు, కేసీ ఈఈ తిరుమలేశ్వరరెడ్డి, తహాశీల్దార్ హారిత, ఎంపీడీవో వాసుదేవగుప్త, ఏఈ వెంకటేశ్వర్లు, ఆర్ఐ సుప్రియ. వీఆర్వోలు ఉన్నారు.