పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-08-26T04:44:56+05:30 IST

ఉమ్మడి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకై మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు.

పరిశ్రమల ఏర్పాటుపై అవగాహన కల్పించాలి

  1. జడ్పీ చైర్మన యర్రబోతుల పాపిరెడ్డి
  2. కోరం లేకుండానే 3వ స్థాయి సంఘ సమావేశం
  3. సమావేశాలకు హాజరుకాని ఎమ్మెల్యేలు
  4. ఐటీడీఏ పీవోకు నోటీసులు

కర్నూలు(న్యూసిటీ), ఆగస్టు 28: ఉమ్మడి జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకై మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా పరిషత చైర్మన ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. గురువారం  జిల్లా పరిషత పరిపాలన భవనంలోని మినీ సమావేశ భవనంలో ఏడు స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు స్థాయి సంఘ సమావేశాలు జరిగాయి. 1,2,3,7 స్థాయి సంఘసమావేశాలకు జిల్లా పరిషత చైర్మన యర్రబోతుల పాపిరెడ్డి, 5వ స్థాయి సంఘసమావేశానికి పగిడ్యాల జడీటీసీ దివ్య, 6వ స్థాయి సంఘసమావేశానికి వైస్‌చైర్మన, హోళగుంద జడ్పీటీసీ కురువ బొజ్జమ్మ చైర్‌పర్సనగా వ్యవహరించారు. సమావేశాల్లో ఉమ్మడి జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించి చర్చించారు. నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. 

- కొత్తపల్లి మండలం ప్రజాసాధికారిక సర్వే చేయించి లబ్ధిదారులకు న్యాయం చేయాలని జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి అన్నారు. మండల ఈఓఆర్‌డీ ప్రజాప్రతినిధులను  పట్టించుకోవడం లేదని అన్నారు. కొలనుభారతి, సంగమేశ్వర ఆలయాలను ఏపీ టూరిజింలో విలీనం చేసిన పర్యాటకరంగంగా అభివృద్ధి చేయాలని కోరారు. రేమట జిల్లా పరిషత పాఠశాలలో నాణ్యమైన భోజనం వడ్డించకపోవడంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచి క్యారియర్లు తెచ్చుకుంటున్నారని కర్నూలు మండల జడ్పీటీసీ ప్రసన్నకుమార్‌ చైర్మన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే డీఈవో చర్యలు తీసుకోవాలన్నారు.  దొర్నిపాడు జడ్పీహెచఎస్‌లో తాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జడ్పీటీసీ శకుంతల అన్నారు. ఓర్వకల్లు, హుస్సేనాపురం గ్రామాలలోని ఆసుపత్రులలో వైద్యసిబ్బంది సరిగ్గా రాకపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జడ్పీటీసీ రంగనాథ్‌గౌడు తెలిపారు. కోడుమూరు నుండి గూడూరు, క్రిష్ణగిరి, క్రిష్ణాపురం, గోరంట్లకు రోడ్ల నిర్మాణం చేపట్టాలని జడ్పీటీసీ రఘునాథరెడ్డి కోరారు. మహానంది మండలం తంబళపల్లి నుంచి సూర్యనంది వరకు రోడ్డు నిర్మాణం చేపట్టాలని జడ్పీటీసీ మహేశ్వరరెడ్డి కోరారు. ఆలూరు మండల కేంద్రంలో రోడ్ల నిర్మాణం చేపట్టారని, డ్రైనేజీ నిర్మాణం చేపట్టకపోవడంతో ఇబ్బందిగా ఉందని జడ్పీటీసీ బి.చంద్రశేఖ్‌ అన్నారు. 

ఫ ఐటీడీఏ పీఓకు నోటీసులు..

నూతన పాలకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క సర్వసభ్య సమావేశానికి, స్థాయి సంఘ సమావేశాలకు హాజరుకాని శ్రీశైలం ఐటీడీఏ పీవోకు నోటీసులు జారీ చేయాలని జడ్పీ చైర్మన సీఈవొను ఆదేశించారు. 

ఫ మంత్రుల నియోజకవర్గంలోనే అభివృద్ధి :జడ్పీటీసీల ఆవేదన

ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల్లోనే అభివృద్ధి జరుగుతుందని జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. డోన, ఆలూరుకు మాత్రమే పనులు వస్తున్నాయని, మిగతా నియోజకవర్గాలకు రావడం లేదని అన్నారు. చేసిన పనులకు బిల్లులు రావాలన్నా ఆ రెండు నియోజకవర్గాలకే వస్తున్నాయని ఆరోపించారు.

ఫ కోరం లేకుండానే 3వ స్థాయి సంఘసమావేశం..ఒకేఒక్కడు..

3వ స్థాయి సంఘసమావేశం వ్యవసాయంపై జరిగింది. అయితే నిబంధనల ప్రకారం కోరం ఉంటేనే సమావేశం నిర్వహించాలి. చైర్మనతో పాటు ఒకే ఒక కోఆప్షన సభ్యులు హాజరయ్యారు. అయితే రెండవ స్థాయి సంఘసమావేశంలో ఉన్న కొత్తపల్లి జడ్పీటీసీ సుధాకర్‌రెడ్డి మూడవ స్థాయి సంఘసమావేశంలో కూర్చుని అధికారులకు సమస్యలను వివరించడం విడ్డూరంగా ఉంది. ఇదంతా చోద్యం చూస్తున్న అధికారులు ఏమి అనకపోవడం ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు. సమావేశంలో జిల్లా పరిషత నాసరరెడ్డి,  డిప్యూటీ సీఈవో సుబ్బారెడ్డి, చైర్మన సీసీ అశ్వినికుమార్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ కర్నూలు ఎస్‌ఈ నాగేశ్వరరావు , నంద్యాల జిల్లా అధికారి మనోహర్‌, పీఆర్‌ ఎస్‌ఈ సుబ్రమణ్యం, కర్నూలు ఈఈ ఎస్‌ఈసీ మద్దన్న, కార్మిక శాఖ ఉప కమిషనర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 

 

Read more