వారు చెప్పినట్లే..!

ABN , First Publish Date - 2022-06-28T04:33:39+05:30 IST

సామాన్యులు నేరం చేస్తే పోలీసులు తక్షణం స్పందిస్తారు.

వారు చెప్పినట్లే..!

అధికార పార్టీ నాయకులకు పోలీసుల వత్తాసు

కేసు నమోదు విషయంలో అత్యుత్సాహం

సామాన్యుల్లో భయాందోళన


సామాన్యులు నేరం చేస్తే పోలీసులు తక్షణం స్పందిస్తారు. అదే అధికారపార్టీ వారు నేరాలకు పాల్పడితే కళ్లు మూసుకొని ఏమీ జరగడం లేదన్నట్లు ఉంటారు.  పైగా నిందితులకు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలు జిల్లాలో వినిపిస్తున్నాయి. అదే  పోలీసులు తమ మీద ఎప్పుడు ఎలాంటి కేసులు పెడతారోనని  సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.   పోలీసు స్టేషన్‌ మెట్లెక్కినా న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు.  జిల్లాలో నేరం, శిక్ష విషయంలో చట్టబద్ధత లోపించిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 


నంద్యాల, ఆంధ్రజ్యోతి: ఏదైనా నేరం జరిగినపుడు అసలు నేరగాళ్లు ఎవరనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలి. అయితే జిల్లాలో చాలా సందర్భాల్లో పోలీసులు అలా చేయడం లేదు. నేరగాళ్లలో పెద్ద వారు ఉంటే వారిని తప్పించడం కోసం అమాయకులను కేసుల్లో ఇరికిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ‘పెద్దల’ మీద ఆరోపణలు వచ్చినప్పుడు చట్టాన్ని పోలీసులు ఎలా అమలు చేస్తున్నదీ ఆడిగేవారు లేకపోవడంతో పోలీసుల ఆడినట్లు సాగుతోంది. రేషన్‌ బియ్యం, మద్యం అక్రమ రవాణా, మట్కా, పేకాట వంటి కేసుల్లో ఊరు పేరు లేని వారే బలవుతున్నారు తప్ప, ఇప్పటి వరకు పెద్ద తలకాయల పేర్లు ఒక్కటీ బయటకు రాలేదు. దీనిని బట్టి పోలీసులు ఎలాంటి పక్షపాతాన్ని చూపుతున్నారో ఇట్టే తెలిసిపోతోంది.


దొంగతనం కేసులో పోలీసులు వేధిస్తున్నారంటూ నంద్యాలకు చెందిన సలాం 2020వ సంవత్సరం నవంబరులో కుటుంబంతో సహా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

తన దగ్గర నల్ల బెల్లం దొరికితే సారా కేసు నమోదు చేసి హింసిస్తున్నారంటూ గడివేముల మండలం ఎల్‌కే తండాకు చెందిన రేషన్‌ డీలర్‌ శోభారాణి బాయి గురువారం ఆత్మహత్యాయత్నం చేశారు. 


ఈ రెండు ఘటనలను చూస్తే పోలీసుల తీరు సామాన్యుల పట్ల ఎలా ఉందో అర్థమవుతోంది. చట్టాన్ని అమలు చేయడం పోలీసుల బాధ్యత.  అయితే దానిని అమలు చేయడంలో వారు అనుసరిస్తున్న విధానం మాత్రం ఆక్షేపణీయంగా ఉందన్న అభిప్రాయం వెలువడుతోంది. తమకు అన్యాయం జరిగిందని ఎవరైనా స్టేషను గుమ్మం తొక్కితే సరిగా స్పందించని పోలీసులు, వారిపై కేసులు పెడితే మాత్రం చట్టాన్ని ఆఘమేఘాల మీద అమలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కబ్జాలు, గుట్కా, మట్కా, పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలు సాగించే వారి పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు సామాన్యులపై మాత్రమే తమ ప్రతాపాన్ని ఎందుకు చూపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పోలీసుల అత్యుత్సాహంతో సామాన్యులు ప్రాణాలు తీసుకుంటే దానికి బాధ్యత ఎవరు వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.


 పోలీసు ప్రోత్సాహం?


న్యాయం కావాలని సామాన్యులు స్టేషన్‌ మెట్లెక్కితే వారాలకు వారాలు తమ చుట్టూ పోలీసులు తిప్పుకోవడం బహిరంగ సత్యం. అయితే అదే సమయంలో కొంచెం పేరు పలుకుబడి ఉన్న నిందితుల విషయంలో పోలీసులు అంత కఠినంగా ప్రవర్తించడం లేదు. దీనికి కారణం నిందితులు, నేరగాళ్లు, పోలీసులకు మధ్య అవినాభావ సంబంధం ఉండటమేననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ వ్యాపారాలు చేసే వారి నుంచి నెల నెలా మామూళ్లు అందుతుండటంతో పరోక్షంగా కొందరు పోలీసులే వారి వ్యాపారాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా డాన్‌ కూతురు ఫోన్‌ నంబరు పోలీసు గ్రూపులో చేర్చడం, ఏఎస్‌ఐ స్థాయి పోలీసు పేకాట ఆడించడం వంటివి ఈ విషయాలను తేటతెల్లం చేస్తున్నాయి. అసాంఘిక కార్యక్రమాల్లో పాలు పంచుకునే వారిని సస్పెండ్‌ చేస్తామని, చేస్తున్నామని పోలీసు బాసులు చెబుతున్నారు. అయితే నెల వారీ మామూళ్లకు అలవాటు పడ్డ కొందరు పోలీసులు తీరు మార్చుకోవడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు.


అధికార పార్టీకి వత్తాసు


చట్టాలకు లోబడి పనిచేయాల్సిన పోలీసులు అధికార పార్టీలకు కొమ్ముకాస్తున్నారని ఆ మధ్య సాక్షాత్తు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ విచారం వ్యక్తం చేశారు. జిల్లా పోలీసుల తీరు కూడా ఆయన మాటలకు బలం చేకూరేలా ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. తమ వ్యతిరేకులు లేదా ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టాలని అధికార పార్టీ నాయకులు ఆదేశిస్తే పోలీసులు దానిని ఆచరిస్తున్నారు. ప్రస్తుతం ఎల్‌కే తండాకు చెందిన రేషన్‌ డీలరు విషయంలో కూడా వైసీపీ నాయకులు పాత్ర ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్‌ షాపును లాక్కునేందుకు లేని కేసులు తనపై బనాయించారని శోభారాణి ఆరోపిస్తున్నారు. జిల్లా పోలీసులు సామాన్యుల పట్ల ప్రవర్తించే తీరును పలువురు బహిరంగంగానే నిరసిస్తున్నారు. ఇలా అధికార పార్టీ వారికి వత్తాసు పలికేలా పోలీసులు ప్రవర్తిస్తే ఇక సామాన్యులకు న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న తలెత్తుతోంది.

Updated Date - 2022-06-28T04:33:39+05:30 IST