వైద్యుడికి అరెస్టు వారెంటు

ABN , First Publish Date - 2022-03-17T05:15:13+05:30 IST

జాతీయ వినియోగదారుల కమిషన్‌ ఇచ్చిన తీర్పును ఖాతరు చేయని నంద్యాల వైద్యుడు డా.విశ్వరూపాచారిపై అరెస్టు వారెంట్‌ను జారీ చేస్తూ కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యులు ఎన్‌.నారాయణరెడ్డి, ఎస్‌.నజీమా కౌసర్లు బుధవారం ఆదేశాలు జారీ చేశారు.

వైద్యుడికి అరెస్టు వారెంటు

కర్నూలు(లీగల్‌), మార్చి 16: జాతీయ వినియోగదారుల కమిషన్‌ ఇచ్చిన తీర్పును ఖాతరు చేయని నంద్యాల వైద్యుడు డా.విశ్వరూపాచారిపై అరెస్టు వారెంట్‌ను జారీ చేస్తూ కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్‌ సభ్యులు ఎన్‌.నారాయణరెడ్డి, ఎస్‌.నజీమా కౌసర్లు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. నంద్యాలకు చెందిన ఫిర్యాది సి.విజయసింహారెడ్డి భార్య మృతురాలైన సి.పద్మావతి తన కుడికాలికి ఏర్పడిన అల్సర్‌ పుండుకు చికిత్స కోసం డా.విశ్వరూపాచారితో వైద్యం చేయించుకుంది. అయితే.. అది తీవ్రతరం కావడంతో ఆమె కర్నూలు, ఆ తర్వాత హైదరాబాదులోని ప్రముఖ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ మృతి చెందింది. దీంతో ఆమె భర్త సి.విజయసింహారెడ్డి కర్నూలు జిల్లా వినియోగదారుల ఫోరం, ఆ తర్వాత రాష్ట్ర, కేంద్ర వినియోగదారుల కమిషన్‌లను ఆశ్రయించారు. కేసు పూర్వపారాలను పరిశీలించిన తర్వాత సదురు వైద్యుడు ఫిర్యాదికి రూ.5లక్షలను 9 శాతం వడ్డీతో చెల్లించాలని 2020 మార్చి నెలలో జాతీయ వినియోగదారుల కమిషన్‌ తీర్పు చెప్పింది. అయినా కూడా వైద్యుడు ఫిర్యాదికి నష్టపరిహారం చెల్లించలేదు. దీంతో వైద్యుడి అరెస్టుకు వారెంట్లను జారీ చేస్తూ కేసును ఏప్రిల్‌ 18కి వాయిదా వేసినట్లు ఫిర్యాది న్యాయవాది పి.శివసుదర్శన్‌ తెలిపారు. 

Read more