అన్నదాతల నెత్తిన మరో పిడుగు..
ABN , First Publish Date - 2022-01-13T06:02:56+05:30 IST
అన్నదాతల నెత్తిన మరో పిడుగు పడింది. పిచికారీ మందుల ధరలను సగటున 10 శాతం పెంచారు.
- పురుగు మందుల ధర పెంపు
- లీటరుపై రూ.100 నుంచి రూ.200 వరకూ..
- జిల్లా రైతులపై రూ.50 కోట్ల అదనపు భారం
- మరింత సంక్షోభంలోకి అన్నదాతలు
- చేష్టలుడిగి చూస్తున్న ప్రభుత్వం
కర్నూలు, ఆంధ్రజ్యోతి: అన్నదాతల నెత్తిన మరో పిడుగు పడింది. పిచికారీ మందుల ధరలను సగటున 10 శాతం పెంచారు. దీంతో పెట్టుబడి ఖర్చులు పెరగనున్నాయి. రెండు నెలల క్రితం ఎరువుల ధరలు దాదాపు 40 శాతం పెరిగాయి. పెట్రోలు, డీజిల్, వ్యవపాయ ఉపకరణాల ధరలు సైతం భారీగా పెరిగాయి. దీంతో సేద్యం ఇప్పటికే భారంగా మారింది. ఇప్పుడు ఆ వరుసలో పురుగుమందులు చేరాయి. నవంబరులో కురిసిన అకాల వర్షాలు పంటలను దెబ్బతీశాయి. వివిధ రకాల తెగుళ్లు సోకడంతో పురుగు మందులను పిచికారీ చేయాల్సి వచ్చింది. వర్షం, తెగుళ్ల ధాటికి పత్తి దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. రబీలో వరికి పలు దఫాలుగా పురుగు మందుల్ని పిచికారి చేయాల్సి ఉంటుంది. చీడపీడల నుంచి పంటను కాపాడుకోవాలంటే పురుగు మందుల వాడకం తప్పనిసరి. గతంతో పోలిస్తే వాటి వాడకం జిల్లాలో గణనీయంగా పెరిగింది. ధరల పెరుగుదల విషయం తెలియగానే రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.
రూ.50 కోట్ల వరకు అదనపు భారం
పురుగుమందుల ధరల పెరుగుదల కారణంగా జిల్లా రైతాంగంపై రూ.50 కోట్ల వరకు అదనపు భారం పడనుంది. జిల్లాలో ఏటా పురుగు మందులపై రైతులు రూ.500 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. ఇకపై మరో రూ.50 కోట్ల వరకు భరించాల్సి ఉంటుంది. ఓ వైపు ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు మద్దతు ధర లేక రైతులు ఏటా నష్టపోయి అప్పులపాలు అవుతున్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం అంటి ముట్టనట్లు ఉంటోంది. అయినా రైతు కష్టనష్టాలను తానే భరిస్తూ సేద్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలాంటి సమయంలో పురుగు మందుల ధరలను పెంచడం వారిని మరింత సంక్షోభంలోకి నెట్టడమే అని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
వాణిజ్య పంటలకు ఎక్కువ
మిర్చి, పత్తి తదితర వాణిజ్య పంటలకు చీడపీడల బెడద ఎక్కువగా ఉంటుంది. వరికి సైతం క్రమం తప్పకుండా మందులను పిచికారీ చేయాల్సిందే. లేదంటే పంటలు నిలబడవని రైతులు అంటున్నారు. పంటను కాపాడుకోవడానికి వారానికి రెండు సార్లు తెగుళ్ల మందులను పిచికారీ చేస్తుంటారు. పెరిగిన ధరలు మూలిగే నక్కమీద తాటికాయ పడిన చందంలా ఉందని రైతులు వాపోతున్నారు. పత్తికి మార్కెట్‌లో మంచి ధర ఉన్నప్పటికీ చీడపీడల వల్ల దిగుబడులు భారీగా తగ్గిపోయాయి. నకిలీ పురుగు మందులు, ధరల బాదుడు రైతులకు శాపంగా మారుతున్నాయి.
వ్యయం పెరిగిందని..
పురుగుమందుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాలు జపాన, చైనా తదితర దేశాలనుంచి దిగుమతి అవుతాయి. అందువల్లే దేశీయంగా పురుగు మందుల ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. దీనికి తోడు పెరిగిన ఇంధన ధరలు పెరిగినందున రవాణా ఖర్చులు పెరిగాయి. ఆ భారాన్ని కూడా రైతులపైనే మోపుతున్నారు. కొవిడ్ తదనంతర పరిణామాల నేపథ్యలో విదేశాలలో సైతం ముడిపదార్థాల కొరత తలెత్తిందని, అందుకే ధరలు పెరిగాయని వ్యాపారులు అంటున్నారు.
ప్రభుత్వానికి పట్టింపేదీ..?
గతంలో ఎరువుల ధరలు పెరిగినా కొన్నింటిపై కేంద్రం రాయితీని పెంచి భారాన్ని కొంత తగ్గించింది. ఆ మేరకు రైతాంగానికి ఊరట కల్పించింది. కానీ రసాయన మందుల విషయంలో అలాంటి రాయితీలేవీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందడం లేదు. ఈ కారణంగా మొత్తం భారం రైతులపై పడుతోంది. వ్యవసాయ పెట్టుబడి ఖర్చుల్లో భారీ తేడా రానుంది. ఎకరానికి దాదాపు రూ.2,500 వరకు పెట్టుబడి ఖర్చులు పెరగుతాయని, మిర్చికి అయితే రూ.3,500 వరకు అదనంగా ఖర్చు వస్తుందని రైతులు చెబుతున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు ఏదో ఒక పథకం పేరిట ఉచితాలు, సబ్సిడీలు ఇస్తున్నారని, కానీ తమకుమాత్రం ఏమీ చేయడం లేదని రైతులు వాపోతున్నారు.
రైతు భారం..
వ్యవసాయంలో వినియోగించే అన్నింటి ధరలు పెరుగుతున్నాయి. సేద్యం రైతులకు భారంగా మారుతోంది. ఇప్పటికే ఎరువుల ధరలు పెరిగాయి. పెట్రోలు, డీజిల్ ధరలు పెరగడంతో యాంత్రీకరణ మందగించింది. ఇప్పుడు పురుగు మందులు ధరలను పెంచారు. అన్నింటి ధరలను పెరుగుతున్నా రైతుకిచ్చే మద్దతు ధర మాత్రం పెరగడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వాలు వ్యవసాయంలో వినియోగించే వాటి ధరలు కట్టడికీ పటిష్ట కార్యచరణ రూపొందించి అమలు చేయాలి.
- జగన్నాథం, రైతు సంఘం జిల్లా కార్యదర్శి