మరో దగా

ABN , First Publish Date - 2022-12-07T23:25:53+05:30 IST

గ్రామ స్వరాజ్యానికి మూలమైన పంచాయతీలను ప్రభుత్వం దగా చేస్తోంది.

మరో దగా

పంచాయతీలపై మరో పిడుగుపాటు

పంచాయతీలే విద్యుత్‌ బకాయిలు చెల్లించాలంటున్న ప్రభుత్వం

15వ ఆర్థిక సంఘం నిధులు కాజేయాలనే వ్యూహం

ఇదేం తీరంటూ సర్పంచుల మండిపాటు

నంద్యాల, ఆంధ్రజ్యోతి:

గ్రామ స్వరాజ్యానికి మూలమైన పంచాయతీలను ప్రభుత్వం దగా చేస్తోంది. గ్రామ స్థాయిలో ప్రజా పాలనకు, ప్రజా అవసరాలకు తగినట్లు నిధులు ఇవ్వడం లేదు. పైగా గతంలో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మళ్లించింది. దీనికితోడు సచివాలయాల నిర్వహణ భారాన్ని కూడా పంచాయతీలపైనే మోపింది. ఇవన్నీ చాలక ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 15వ ఆర్థిక సంఘం నిధులను కూడా కాజేసింది. ఇప్పుడేమో విద్యుత్‌ బిల్లులు, చెత్త సేకరించే గ్రీన్‌ అంబాసిడర్లకు జీతాలు చెల్లించాలని జగన్‌ ప్రభుత్వం చెబుతోంది. ఉన్న కష్టాలకు తోడు మళ్లీ ఇదొకటా? అని సర్పంచ్‌లు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.

ఉమ్మడి జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను విడుదల చేసింది. టైడ్‌, అన్‌టైడ్‌ (బేసిక్‌) నిధుల కింద ఉమ్మడి జిల్లాలో 973 గ్రామ పంచాయతీలు ఉండగా... టైడ్‌ నిధుల కింద కర్నూలు జిల్లాకు రూ.11 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.14.14 కోట్లు.. మొత్తం రూ.25.14 కోట్లు వచ్చాయి. అన్‌టైడ్‌ నిధులు కర్నూలు జిల్లాకు రూ.17 కోట్లు, నంద్యాలకు రూ.10 కోట్లు వచ్చాయి. జనాభా నిష్పత్తి ప్రకారం పంచాయతీల ఖాతాల్లో ఈ నిధులను జమ చేశారు. వీటి నుంచి విద్యుత్‌ బకాయిలు, గ్రీన్‌ అంబాసిడర్లకు చెల్లింపులు చేస్తున్నారు. పంచాయతీల విద్యుత్‌ బకాయిలు కర్నూలు జిల్లాలో రూ.350 కోట్లు, నంద్యాలలో రూ.214 కోట్లు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి చెల్లింపులకు అన్‌టైడ్‌ నిధులు నుంచి 50 శాతం చెల్లించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నంద్యాల జిల్లా గ్రామ పంచాయతీల నుంచి రూ.1.72 కోట్లు చెల్లించగా... కర్నూలు జిల్లాలో రూ.20 లక్షలు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక గ్రీన్‌ అంబాసిడర్లు ఉమ్మడి జిల్లాలో మూడు వేల మందికి పైగా ఉన్నారు. ఆరు నెలల జీతాల బకాయిలకు కర్నూలు జిల్లాలో రూ.6 కోట్లు, నంద్యాలలో రూ.7.20 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి. వీరికి టైడ్‌ నిధుల నుంచి జీతాలను ప్రభుత్వం చెల్లించనుంది. ఇప్పటికే నంద్యాల గ్రామ పంచాయతీల నుంచి దాదాపు కోటి రూపాయల వరకు చెల్లించగా... కర్నూలు జిల్లా గ్రీన్‌ అంబాసిడర్లకు దాదాపు రూ.10 లక్షలు చెల్లించినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన పంచాయతీల ఖాతాల్లో 50 శాతం నిధులు మాత్రమే మిగిలే అవకాశం ఉంది. ఇలా వచ్చిన నిధులను వచ్చినట్లే రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తుంటే పంచాయతీలు అభివృద్ధి లేక కుంటుపడతాయని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాల్లేవ్‌..

ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 వేలకు పైగా గ్రీన్‌ అంబాసిడర్లు ఉన్నారు. గ్రామాల నుంచి చెత్తను సేకరించడం, దానిని చెత్త సంపద తయారీ కేంద్రాలకు తరలించడం వీరి బాధ్యత. చెత్త సంపద కేంద్రాల్లో జీవ ఎరువుల తయారీ వంటి పనుల ద్వారా ఆదాయం సమకూర్చాలి. ఇలా వచ్చే ఆదాయాన్ని సంబంధిత కార్పొరేషన్‌కు జమ చేస్తే.. తిరిగి కార్పొరేషన్‌ వీరికి జీతాలను ఇస్తుంది. ఇక్కడికి వరకు బాగానే ఉంది. గ్రామ పంచాయతీల్లో చెత్త సంపద తయారీ కేంద్రాలు ఏర్పాటు కానట్లు సమాచారం. ఏర్పాటు చేసిన చోట కూడా నిర్వహణ సరిగా లేదు. దీంతో చెత్త సంపద తయారీ కేంద్రాల ద్వారా ఆదాయం రాకపోగా ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో కార్పొరేషన్‌ ద్వారా వీరికి చెల్లించాల్సిన జీతాలు పెండింగ్‌లో పడిపోయాయి. వీరికి జీతాలను చెల్లించే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేదు. ఎక్కువ కాలం జీతాలు ఇవ్వకుండా పని చేయించుకోవడం సాధ్యమయ్యే పరిస్థితి లేదు. దీంతో ఆర్థిక సంఘం నిధుల నుంచి వేతనాలు ఇప్పించాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది.

రాబోయే నిధులను చూపించి..

గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధులను ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కేంద్రం ఇచ్చే నిధులను మళ్లిస్తోంది. విద్యుత్‌ బకాయిల చెల్లింపులకు వాడుతోంది. అసలు మైనర్‌ పంచాయతీలకు విద్యుత్‌ చెల్లింపుల నుంచి మినహాయింపు ఉండాలి. మేజర్‌ పంచాయతీలలో 15 శాతం ఆర్థిక సంఘం నిధులను విద్యుత్‌ బకాయిలకు వాడుకోవాలి. ఆర్థిక సంఘం సూచిస్తున్న ఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని సర్పంచులు అంటున్నారు. ఇక క్లాప్‌(క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌) పేరిట సేవలందిస్తున్న గ్రీన్‌ అంబాసిడర్లకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌ జీతాలు చెల్లించకుండా వారికి కూడా ఆర్థిక సంఘం నిధుల నుంచే చెల్లించడం గమనార్హం. ఇక గతంలో చేసిన పనులకు కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా నిధులను ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చే మొత్తాన్ని వాడుకుంటే పంచాయతీల పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే విషయాన్ని అధికారులను అడగ్గా, ఉమ్మడి జిల్లాలోని గ్రామ పంచాయతీలకు మరో రూ.100 కోట్ల ఆర్థిక సంఘం నిధులు మార్చి నెలలోపు వస్తాయని పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. రాబోయే నిధులను చూపి ప్రస్తుతం వచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడమేమిటని అడిగితే వారి నుంచి సమాధానం లేదు. ఇలా వ్యవహరిస్తున్న వైసీపీ ప్రభుత్వం కేంద్రం నుంచి రాబోయే నిధులనైనా కాజేయదనే నమ్మకమేమిటని సర్పంచులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇలా కేంద్రం ఇచ్చే నిధులను రాష్ట్ర ప్రభుత్వం వాడుకుంటుంటే గ్రామ పంచాయతీల పరిస్థితి ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

ప్రజలకు సమాధానం చెప్పలేకపోతున్నాం

అరకొర నిధులతో గ్రామ పంచాయతీలోని సమస్యలను ఎలా పరిష్కరించాలి. 15వ ఆర్థిక సంఘం నిధులు పోలకల్లు గ్రామానికి రూ. 8 లక్షలు మంజూరు కాగా 20 శాతం విద్యుత్‌ బకాయిలు, గ్రీన్‌ అంబాసిడర్లకు వేతనాలు, గ్రామంలో తాగునీటి మోటార్ల మరమ్మతులు, పైపులైన్లు మరమ్మతులకు చాలడం లేదు. సర్పంచులుగా గెలిచినప్పటి నుంచి పంచాయతీలలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజలకు సమాధానం చెప్పుకోలేకపోతున్నాం.

-మల్లేపోగు మాదక్క, పోలకల్లు సర్పంచ్‌

20 శాతం విద్యుత్‌ బకాయిలు చెల్లించాం

బురాన్‌దొడ్డి పరిధిలో రెండు మజరా గ్రామాలు క్రిష్ణదొడ్డి, బ్యాథోలి ఉన్నాయి. ఆ గ్రామాలలో తాగునీరు లేక పంచాయతీకి 15వ ఆర్థిక సంఘం కింద నిధులు రాగా వాటి నుంచి 20 శాతం విద్యుత్‌ బకాయిలు చెల్లించాం. పంచాయతీలకు వచ్చే నిధులు క్రమంగా విడుదల చేస్తే పంచాయతీలలోని సమస్యలను పరిస్కరించుకోవచ్చు. అరకొర నిధులతో పంచాయతీలలోని సమస్యలను ఎలా తీర్చగలం.

-రామంజినేయులు, బురాన్‌దొడ్డి సర్పంచ్‌

నిధులు లేకపోతే బిల్లులు ఎలా చెల్లించాలి?

గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోతే బిల్లులు ఎలా చెల్లించాలి. గ్రామంలో పారిశుధ్య పనులు చేయడానికి కూడా నిఽధులు లేవు. పనులు చేసే గ్రీన్‌ అంబాసిడర్లకు కూడా జీతాలు చెల్లించలేకపోతున్నాం. ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి. విద్యుత్‌ బకాయిల భారం మోపడం సరికాదు.

-జె.నయోమి, సర్పంచ్‌, కె.నాగలాపురం

స్తంభాలకు పన్నులు వేయాల్సి వస్తుందేమో..

గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ బకాయిల పేరిట హరించడం అన్యాయం. అసలు ఏ గ్రామ పంచాయతీకి ఎంత విద్యుత్‌ బిల్లు వచ్చిందో అధికారులు చెప్పగల స్థితిలో లేరు. మైనర్‌ పంచాయతీలకు విద్యుత్‌ చెల్లింపుల నుంచి మినహాయింపు ఉంటుంది. మేజర్‌ పంచాయతీలకు కూడా 15 శాతం ఆర్థిక సంఘం నిధుల నుంచి ఖర్చు చేయాలన్న నియమం ఉంది. అలా కాకుండా కోట్ల రూపాయల విద్యుత్‌ బకాయిలు ఉన్నట్లు అధికారులు ఎలా లెక్కలు చెబుతున్నారో అర్థం కావడం లేదు. ఇలా అయితే గ్రామ పంచాయతీల్లో విద్యుత్‌ సంస్థ వేసిన స్తంభాలకు సర్పంచులు పన్నులు వేయాల్సి వస్తుంది. అపుడు విద్యుత్‌ సంస్థే గ్రామ పంచాయతీలకు తిరిగి డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.

- బిర్రు ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ పంచాయతీ రాజ్‌ చాంబర్‌

విద్యుత్‌ చార్జీలు భారంగా మారాయి

పంచాయతీకి విద్యుత్‌ చార్జీలు భారంగా మారాయి. ప్రతి నెలా సచివాలయ కార్యాలయం, తాగునీటి పథకాలకు దాదాపు రూ.30వేల కరెంటు బిల్లు వస్తోంది. ప్రభుత్వం మా పంచాయతీకి రూ.2.5 లక్షల నిధులు మంజూరు చేస్తే అందులో రూ.లక్షన్నర కరెంటు బిల్లులకే చెల్లించాను. అధికారులైతే ప్రతి నెలా విద్యుత్‌ బిల్లులు సర్పంచులే చెల్లించాలని.. నిధులు వచ్చాక డ్రా చేసుకోవాలని చెబుతున్నారు. పంచాయతీలో పైసా లేకపోతే కరెంటు బిల్లులు ఎలా చెల్లించాలి?

-బి. హరికుమార్‌, మునిమడుగు సర్పంచు, ప్యాపిలి

పంచాయతీ నిధులు మళ్లించడం తగదు

రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ నిధులను దారి మళ్లించడం తగదు. గ్రామ పంచాయతీ నిధుల నుంచి కరెంటు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించడం అన్యాయం. ఇప్పటికే నిధులు లేక ప్రజలకు కనీస వసతులు కూడా కల్పించలేకపోతున్నాం. పంచాయతీ నిధుల నుంచి కరెంటు బిల్లులు చెల్లించే ప్రసక్తే లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులపై కూడా స్పష్టత ఇవ్వాలి.

-దశరథరామిరెడ్డి, గుమ్మకొండ సర్పంచ్‌, డోన్‌ మండలం

బిల్లులు చెల్లించలేం

15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్‌ బిల్లులు, గ్రీన్‌ అంబాసిడర్లకు 50 శాతం చెల్లించాలంటే సాధ్యపడదు. గ్రామంలో మంచి నీటి పథకాల మరమ్మతుల మోటార్లకు, పారిశుధ్య పనులకు ఇబ్బంది అవు తుంది. వచ్చిన నిధులన్నీ విద్యుత్‌ బిల్లులు, గ్రీన్‌ అంబా సిడర్లకు సరిపోతాయి. గ్రామాభివృద్ధి పనులకు ఎలా?

చంద్రమోహన్‌, సర్పంచ్‌, ఎల్లావత్తుల

Updated Date - 2022-12-07T23:25:57+05:30 IST