కుంగిపోయిన అలగనూరు

ABN , First Publish Date - 2022-10-08T05:15:06+05:30 IST

మిడ్తూరు మండలం అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ బండ్‌ రెండేళ్ల కిందట కుంగిపోవడంతో అధికారులు రిజర్వాయర్‌లోని నీటిని ఖాళీ చేశారు.

కుంగిపోయిన అలగనూరు

శిథిలావస్థకు చేరిన బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ మట్టికట్ట
రెండేళ్లుగా పట్టించుకోని అధికారులు
తలముడిపి రైతులకు తప్పని కష్టాలు
మత్స్యకారులకు తిప్పలు
ఇక బండ్‌ మొత్తాన్నీ ఆధునికీకరించాల్సిందే..


నంద్యాల (ఆంధ్రజ్యోతి), నందికొట్కూరు: మిడ్తూరు మండలం అలగనూరు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ బండ్‌ రెండేళ్ల కిందట కుంగిపోవడంతో అధికారులు రిజర్వాయర్‌లోని నీటిని ఖాళీ చేశారు. కుంగిన రిజర్వాయర్‌ బండ్‌ మరమ్మతు పనులను అటు అధికారులు, ఇటు నాయకులు పట్టించుకోవడం లేదు. అసలు అలగనూరు రిజర్వాయర్‌ నీరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగపడదని ఇక్కడి నాయకులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఈ నీరు వినియోగించుకోవడానికి హక్కుదారులైన కడప జిల్లా నాయకులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వేల ఎకరాలను సేకరించి, కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్మించిన రిజర్వాయర్‌కు ఈ చిన్న మరమ్మతు చేయకపోవడంతో నిరుపయోగంగా మారింది. వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమ నీటి ప్రాజెక్టుల మీద నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం.

 2.965 టీఎంసీల సామర్థ్యంతో..

కడప-కర్నూలు జిల్లాలకు తాగు, సాగు నీరందించే కేసీ కాలువ కింద దాదాపు రెండున్నర లక్షల ఆయకట్టు ఉంది. కర్నూలులో 1.73 వేల ఎకరాలు, కడప జిల్లాలో 92 వేల ఎకరాలు కేసీ కాలువ కింద సాగువుతాయి. అయితే వర్షాలు సక్రమంగా లేనపుడు, తుంగభద్ర డ్యాం నుంచి పూర్తి స్థాయిలో నీరందనపుడు కేసీ కాలువ చివరి ఆయకట్టుకు నీరందక రైతులకు ఇబ్బంది పడేవారు. దీన్ని నివారించేందుకు మిడ్తూరు మండలం అలగనూరు గ్రామ సమీపంలో 2.965 టీఎంసీల నీటి సామర్థ్యంతో బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను నిర్మించారు. 1985లో ఈ పనులకు రూ.3.06 కోట్లతో పాక్షికంగా పరిపాలనా ఆమోదం తెలిపి, ఆనాటి సీఎం ఎన్టీ రామారావు శంకుస్థాపన చేశారు. కేసీ కెనాల్‌ నుంచి 119.65కి.మీ వద్ద ఇన్లెట్‌ ఛానల్‌ ద్వారా బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌లోకి నీరు  మళ్లించాలి. అయితే ప్రణాళిక ప్రకారం పనులు జరగలేదు. తిరిగి 1999లో రూ.59.7 కోట్లతో రిజర్వాయర్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు.  2005లో నిర్దేశిత సామర్ధ్యం మేరకు రిజర్వాయర్‌ను నీటితో నింపారు. ఇక్కడి నుంచి కుందూ నది ద్వారా రాజోలి ఆనకట్టకు నీరు తరలించి, అక్కడి నుంచి కడప జిల్లా కేసీ చివరి ఆయకట్టుకు నీరందిస్తారు. ఇదీ అలగనూరు రిజర్వాయర్‌ ప్రయోజనం. ఈ జలాశయాన్ని నింపడం మొదలలు పెట్టాక  కేసీ చివరి ఆయకట్టుతో పాటు తలముడిపి రైతులకు కూడా నీరు అందుతోంది.

రోడ్డును తొలగించకుండా మట్టి కట్టవేశారా..?

 2005లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి రిజర్వాయర్‌ను ప్రారంభించాక పట్టుమని పదిహేను సంవత్సరాలు కాకముందే ఒకచోట మట్టికట్ట కుంగిపోవడం రైతులను ఆశ్చర్యానికి లోను చేసింది. రిజర్వాయర్‌ను నిర్మించక ముందు గడివేముల నుంచి రోళ్లపాడు గ్రామానికి రోడ్డు ఉండేదని తలముడిపి గ్రామస్థులు చెబుతున్నారు. రిజర్వాయర్‌ వచ్చాక ఆ రోడ్డును రిజర్వాయర్‌ చుట్టూ తిప్పారు. అయితే రిజర్వాయర్‌ మట్టికట్ట నిర్మాణ సమయంలో ఆ రోడ్డును తొలగించలేదు. దీంతో రోడ్డు మీద మట్టి కట్ట నిర్మించిన చోటే కుంగుబాటు జరిగింది గ్రామస్థులు అంటున్నారు. అయితే ఇందులో వాస్తవం లేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బండ్‌ కుంగిపోయిన చోట గతంలో చెరువుకు నీరందించే వాగు ఉండేదని, వాగు ప్రవాహం వల్ల భూగర్భంలో మట్టి కోతకు గురై ఉండవచ్చని, దానివల్లే బండ్‌ కుంగిపోయి ఉండవచ్చని నిపుణులు అంటున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అక్కడ వాగు ఉండి ఉంటే, అక్కడి నేల స్వభావానికి తగినట్లు జాగ్రత్తలు తీసుకొని బండ్‌ నిర్మించాల్సి ఉండింది. నిర్మాణ సమయంలో ఈ కనీస అవగాహనను అధికారులు ప్రదర్శించలేదా? లేక నిర్లక్ష్యంగా వ్యవహరించారా? అవినీతి జరిగిందా? తేలవలసి ఉన్నదని ప్రజలు అంటున్నారు.
 
ఖాళీగా జలాశయం..

నిర్మాణ వైఫల్యం, పర్యవేక్షణ లోపం వల్ల రిజర్వాయర్‌ బండ్‌ అక్కడక్కడా కుంగడం ఆరంభించింది. అది  ఎక్కువై 2017లో 2.50 కి.మీ నుంచి 2.75 కి.మీ వరకు సుమారు 100 మీటర్ల మేర బాగా కుంగిపోయింది. అధికారులు తక్షణ మరమ్మతుల కోసం రూ.38 లక్షలతో ప్రతిపాదనలు పంపించారు. తాత్కాలిక పనులు చేసి రిజర్వాయర్‌ను అధికారులు నీటితో నింపారు. ఆ తర్వాత నీటి ఉధృతికి బండ్‌ 250 మీటర్ల పైన కుంగిపోయింది. దీని మరమ్మతు కోసం 2019లో దాదాపు రూ.20 లక్షలతో మళ్లీ తాత్కాలిక పనులు చేపట్టారు. కట్ట పటిష్టంగా లేదన్న ఉద్దేశంతో రిజర్వాయర్‌ సామర్థ్యం 2.965 టీఎంసీలు కాగా, 2.64 టీఎంసీల నీటితో నింపారు. ఆ తర్వాత నిపుణుల కమిటీ రిజర్వాయర్‌ను పరిశీలించి బండ్‌ను ఆధునికీకరించకపోతే రిజర్వాయర్‌ ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరించారు. దీంతో అధికారులు జలశయంలో నీటిని ఖాళీ చేశారు. అప్పటి నుంచి రిజర్వాయర్‌ పనులు ఇంకా పూర్తి చేయలేదు.

 బండ్‌ మొత్తాన్నీ అధునికీకరించాల్సిందే..


అలగనూరు జలాశయం నిర్మాణ సమయంలో ఏమాత్రం చిత్తశుద్ధి ప్రదర్శించాలేదని పనులు జరిగిన తీరును పరిశీలిస్తే తెలుస్తుంది. జలాశయం బండ్‌ కుంగిన ప్రతిసారి ఏదో నామమాత్రంగా పనులు చేయించారు. కాంట్రాక్టర్ల వ్యవహారం వల్ల  నీటి ఉధృతి పెరగగానే జలాశయం బండ్‌ మళ్లీ కుంగిపోతోంది. కాంట్రాక్టరు ఇసుక సంచులకు బదులుగా వాగులోని మట్టి, రాళ్లు కలిసిన ఇసుక సంచులతో బండ్‌ కుంగిన ప్రాంతాన్ని నింపాడన్న ఆరోపణలున్నాయి. నాసిరకం పనులు చేసి నీరు నింపితే ప్రమాదమని నిపుణులు సూచించడంతో బండ్‌ను పటిష్ట పరిచేందుకు 2021లో అధికారులు 3.07 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు.  బండ్‌ మొదట కుంగిన చోటే కాకుండా, మిగతా చోట్ల కూడా కుంగిందని, బండ్‌ మొత్తాన్ని ఆధునికీకరించాల్సిందేనని అధికారులు రూ.22 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. పెరిగిన అంచనా వ్యయాలకు అనుగుణంగా రూ.25.08 కోట్లతో అధికారులు మళ్లీ ప్రతిపాదనలు పంపించారు. దీంతో ఏటికేడు మరమ్మతుల అంచనా వ్యయం పెరిగిపోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన అసలు రిజర్వాయర్‌ కట్టేందుకు రూ.59 కోట్లు కాగా, ప్రస్తుతం బండ్‌ ఆధునికీకరణకు అందులో సగం ఖర్చు అయ్యేలా ఉంది. జలాశయాన్ని నిర్మించే సమయంలోనే నాణ్యత పాటించి ఉంటే ఈ దుస్థితి వచ్చేది కాదనే  అభిప్రాయం వినిపిస్తోంది.

 రోడ్డున పడ్డ మత్స్యకారులు..


రిజర్వాయర్‌ను నమ్ముకుని మత్యకారులు కూడా జీవిస్తున్నారు. మత్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు మత్యశాఖ రిజర్వాయర్‌లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించింది. కొర్రపోలూరు, తలముడిపి, రోళ్ళపాడు, అలగనూరు, ఆర్లగడ్డ, బిలకలగూడురు వంటి గ్రామాల్లో దాదాపు 500 కుటుంబాలు చేపల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్నాయి. దీని ద్వారా మత్స్య శాఖకు ఏటా రూ.6.5 లక్షల ఆధాయంతోపాటు రూ.4 కోట్లకు పైగా వ్యాపారం జరిగేది. అయితే రిజర్వాయర్‌ దాదాపు రెండేళ్ళ నుంచి ఖాళీగా ఉండటంతో చేపల పెంపకం సాధ్యపడటం లేదు. అలాగే మత్స్యకారులు రోడ్డున పడ్డారు. అధికారుల నిర్లక్ష్యంతోనే తమ జీవనోపాధికి గండిపడిందని మత్స్యకారులు ఆవేదన చెందుతున్నారు.
 
అందని సాగు నీరు..

ప్రస్తుతం రిజర్వాయర్‌ ఉన్న స్థానంలో గతంలో తలముడిపి చెరువు ఉండేది. రిజర్వాయర్‌ను నిర్మించే సమయంలో ఆ చెరువును ఇందులో కలిపేశారు. చెరువు కింది ఆయకట్టు రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా రిజర్వాయర్‌ ద్వారా నీరందించేలా చర్యలు తీసుకున్నారు. అయితే ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో తలముడిపి చెరువు కింది ఆయకట్టు రైతులు భూములు బీడుపడుతున్నాయి. తాము చెరువు కింద పంటలు పండించుకొనే వాళ్లమని, ఇప్పుడు వర్షాధారంగా సాగు చేయాల్సి వస్తోందని అంటున్నారు.  రిజర్వాయర్‌ పక్కన ఉన్న తమకు ఈ దుస్థితి ఏమిటని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఈ రిజర్వాయర్‌ ఉద్దేశించిన కేసీ చివరి ఆయకట్టు రైతుల గురించి పట్టించుకొనే వారే లేరు. ఈ రిజర్వాయర్‌తోపాటు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు, కుందూ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయన్న వాదన కూడా ఉంది.

రెండేళ్లుగా పని లేదు


రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో రెండేళ్లుగా ఇంటి వద్దే ఉన్నాం. కుటుంబ పోషణ భారమైంది. మత్య్సశాఖ అధికారులకు మత్స్యకారులు చేప పిల్లలను తెచ్చి చెరువులో పెంచేవారు. ఏజెన్సీలు వలలు, బుట్టలు ఇస్తే చేపలను పట్టి వారికి ఇస్తే మాకు డబ్బు చెల్లించేవారు. రిజర్వాయర్‌లో నీరు లేకపోవడంతో మాకు కుటుంబ పోషణ భారమైంది.

-మద్దిలేటి, మత్స్యశాఖ సంఘం ప్రెసిడెంట్‌, తలముడిపి

 రోడ్డును తొలగించకుండా మట్టికట్ట వేశారు


రిజర్వాయర్‌ నిర్మించే సమయంలో రోళ్లపాడు నుంచి గడివేములకు వెళ్లేందుకు ఉన్న రోడ్డు మార్గాన్ని తొలగించలేదు. దాని మీదే మట్టికట్టను నిర్మించారు. దీని వల్లనే మట్టికట్ట కుంగిపోయిందన్న అనుమానాలు ఉన్నాయి. రోడ్డు ఉన్న చోటే బండ్‌ కుంగిపోతోంది. 100 మీటర్లలో ఉన్న రోడ్డును తొలగించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు.
 
-మద్దిలేటి, సీపీఎం నాయకుడు, తలముడిపి


త్వరలోనే పనులు ప్రారంభిస్తాం

అలగనూరు రిజర్వాయర్‌ బండ్‌ ఆధునికీకరణకు పతిపాదనలు పంపించాం. వర్షాకాలం కావడంతో పనులు జరగలేదు. వాతావరణం అనుకూలించగానే పనులు మొదలు పెడతాం. గతంలో రోడ్డు ఉన్న ప్రాంతంలో పూర్తిగా తవ్వకుండానే బండ్‌ నిర్మించామన్నది అవాస్తవం. ఈసారి నాణ్యతను పాటిస్తూ బండ్‌ను ఆధునికీకరిస్తాం.

 - తిరుమలేశ్వరరెడ్డి, ఈఈ, కేసీ కెనాల్‌, నంద్యాల

Updated Date - 2022-10-08T05:15:06+05:30 IST