ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాల్సిందే

ABN , First Publish Date - 2022-01-29T04:38:50+05:30 IST

ఆదోని కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి కోరారు.

ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాల్సిందే
ఆదోని భీమాస్‌ కూడలిలో రోడ్డుపై బైఠాయించిన విద్యార్థులు

డివిజన్‌ వ్యాప్తంగా ఆందోళనలు

మంత్రాలయం, జనవరి 28:  ఆదోని కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి కోరారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో... ఎమ్మిగనూరు, మంత్రాల యం, ఆదోని, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాలను కలిపి ఆదోని కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు.  ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించకపోతే మంత్రాలయం నియోజకవర్గాన్ని కర్ణాటకలో గానీ, తెలంగాణ రాష్ట్రంలో గానీ కలపాలని డిమాండ్‌ చేశారు.

 రాష్ట్ర ప్రభుత్వం ఆదోని డివిజన్‌ను జిల్లాగా ప్రకటించి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని వైసీపీ నాయకుడు గురెడ్డి భీమిరెడ్డి, వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సీవీ విశ్వనాథరెడ్డి, అశోక్‌ రెడ్డి, సర్పంచ్‌ తెల్లబండ్ల భీమయ్య, వీరారెడ్డి కోరారు. శుక్రవారం 26 జిల్లాలు ఏర్పాటు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ర్యాలీగా నిర్వహించారు.  ఆదోని జిల్లాను ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అన్నారు.

ఆదోని టౌన్‌: రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో పశ్చిమ ప్రాంత నియోజకవర్గాలను కలిసి ఆదోని జిల్లాగా ఏర్పాటు చేయాలనే ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. శుక్రవారం  ఆదోని జిల్లాను ఏర్పాటు చేయాల్సిందే అని బీజేపీ రాష్ట్ర అన్యభాషా కన్వీనర్‌, మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌జైన్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ కర్నూలును జుడీషియరీ రాజధానిగా చేస్తామని గతంలో సీఎం జగన్‌ ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఆదోని జిల్లాను ఏర్పాటు చేస్తే ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ ప్రాంతాలలో వలసలు ఆగిపోతాయన్నారు.

ఆదోని(అగ్రికల్చర్‌): ఆదోని జిల్లా చేస్తే ఐదు నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయని పీడీఎస్‌యూ రాష్ట్ర నాయకుడు తిరుమలేష్‌, డీఎస్‌ఎఫ్‌ నాయకుడు రాజు అన్నారు. శుక్రవారం డీఎస్‌ఎఫ్‌, పీడీఎస్‌యూ నాయకులు విద్యార్థులతో కలిసి జిల్లాను ఏర్పాటు చేయాలని ర్యాలీ చేపట్టారు. భీమాస్‌ కూడలిలో బైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెవెన్యూ డివిజన్‌ ఆదోనిని పాలకులు అభివృద్ధి చేయడంలో విస్మరించారన్నారు. జిల్లాల పునర్విభజనలో మరోమారు ఆదోనిని జిల్లాను చేయకుండా మోసం చేస్తున్నారని ఆరోపించారు. కేవలం పార్లమెంట్‌ నియోజకవర్గాలు కాకుండా వెనుకబడిన ప్రాంతాలను కూడా గుర్తించి జిల్లాగా ప్రకటించాలని కోరారు. అక్షరాస్యతలో వెనుకబడి ఉన్నామని, పనులు లేక రైతులు మహానగరాలకు వలసలు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఏర్పాటు చేస్తే పరిశ్రమలు, విద్యా సంస్థలు, సాగు, తాగునీటి సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. త్వరలో ఐదు నియోజకవర్గాలు చెందిన ఎమ్మెల్యేల ఇంటి ముట్టడి చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు ఉదయ్‌, నవీన్‌, చిరు, చిన్నా, వంశీ, ప్రభాకర్‌, ప్రదీప్‌, మల్లి, పృథ్వీ, బాలకృష్ణరెడ్డి పాల్గొన్నారు.

ఆలూరు: అభివృద్ధిలో వెనుకబాటుకు గురవుతున్న ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని తెలుగు రైతు కమిటీ రాష్ట్ర కార్యదర్శి నారాయణరెడ్డి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆలూరులోని ఆయన స్వగృహంలో విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదోనిని జిల్లాగా ఏర్పాటు చేయడానికి మంత్రి, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.

ఎమ్మిగనూరు: డివిజన్‌ కేంద్రమైన ఆదోనిని జిల్లాగా ప్రకటించాలని పీడీఎస్‌యు నాయకులు మహేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం సంఘం ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణ నుంచి సోమప్ప సర్కిల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం సోమప్ప సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు.

Read more