‘కోడుమూరు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి’

ABN , First Publish Date - 2022-10-11T05:11:50+05:30 IST

కోడుమూరు విలేఖరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎస్‌ఐ విష్ణునారాయణపై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎస్పీకి విన్నవించారు.

‘కోడుమూరు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలి’

కర్నూలు, అక్టోబరు 10: కోడుమూరు విలేఖరి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎస్‌ఐ విష్ణునారాయణపై చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే నాయకులు ఎస్పీకి విన్నవించారు. ఐజేయూ జాతీయ సమితి సభ్యులు గోరంట్ల కొండప్ప, యూనియన్‌ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, శ్రీనివాసులు కలిసి సోమవారం స్థానిక జిల్లా పోలీస్‌ కార్యాలయంలో స్పందన కార్యక్రమంలో ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ను కలిసి వినతి పత్రం అందించారు. రూ.120 చలానా కోసం విలేకరిపై అనుచితంగా ప్రవర్తించడం సరైన చర్య కాదని, ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి సంఘటనలు జిల్లాలో పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు. వినతి పత్రం సమర్పించిన వారిలో ఏపీయూడబ్ల్యూజే ఉపాధ్యక్షులు దస్తగిరి, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, సీనియర్‌ జర్నలిస్టులు సుబ్బయ్య తదితరులు ఉన్నారు. అలాగే ఈ ఘటనపై జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు నిరసనలు చేపట్టారు. కోడుమూరు ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు.

Updated Date - 2022-10-11T05:11:50+05:30 IST