రాయల్టీ చెక్‌పోస్టును రద్దు చేయించండి
ABN , First Publish Date - 2022-12-15T23:40:24+05:30 IST
ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి రాయల్టీ చెక్‌పోస్టును రద్దు చేయించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి డిమాండ్
సమస్యలపై పాదయాత్ర...నిరశన దీక్ష
ఫరూక్, సుబ్బారెడ్డి మద్దతు
కొలిమిగుండ్ల, డిసెంబరు 15: ముఖ్యమంత్రి జగన్‌తో మాట్లాడి రాయల్టీ చెక్‌పోస్టును రద్దు చేయించాలని ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయల్టీ, నాపరాయి గనులు, ట్రాక్టర్ యజమా నులు, లోడింగ్, అన్లోడింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిం చాలని కోరుతూ బందార్లపల్లె రాయల్టీ చెక్‌పోస్టు ఎదురుగా గురువారం ఆయన నిరాహార దీక్ష చేపట్టారు. ముందుగా అంకిరెడ్డిపల్లె నుంచి రాయల్టీ చెక్‌పోస్టు వరకు పాదయాత్ర చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు మూలే రామేశ్వర రెడ్డి అధ్యక్షతన బీసీ నిరాహార దీక్షకు కూర్చున్నారు. నియోజకవర కో కన్వీనర్ వీఆర్ లక్ష్మీ రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామేశ్వరరెడ్డి, కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి, ఆలిండియా బంజార సంఘం నాయకులు నాయక్, రామచంద్రా రెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి, కళ్యాణ్ రెడ్డి దీక్షలో పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్, టీడీపీ డోన్ ఇన్చార్జి సుబ్బారెడ్డి దీక్ష శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ ఒక హెక్టారుకు రూ.40 వేలు ఉన్న డెడ్‌రెంట్‌ను రూ.52 వేలకు పెంచారని, నాలుగు భాగాలుగా చేసి మూడు నెలల్లో వాడుకోకపోతే ఆ మొత్తం ప్రభుత్వానికి వెళ్తుందని అన్నారు. రూ.52 వేల వంతున పది రెట్లు చేసి ప్రీమియం మొత్తం రూ.5.20 లక్షలు ఒకేసారి ప్రభుత్వానికి చెల్లించాలని, లేకపోతే లీజు రద్దు చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేయడం అన్యాయమని అన్నారు. కొత్తగా సెక్యూరిటీ డిపాజిట్ కింద ఒక హెక్టారుకు రూ.1.56 లక్షలు చెల్లించాల్సి వస్తోందన్నారు. మైనింగ్ ప్లాన్, ఎన్విరాన్ మెంట్ క్లియరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్లు తెచ్చుకోవాలనడం దారుణమ న్నారు. పదేళ్లు పూర్తయిన లీజులను రెన్యువల్ చేయకుండా రద్దు చేసి ఈ-వేలం వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. రాయల్టీ చెక్‌పోస్టును రద్దు చేయిస్తానని ప్రస్తుత ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి హామీ ఇచ్చి విస్మరించారన్నారు. నిరాహారదీక్ష కోసం పోలీసులు అనుమతి కోరామని...వారిపై ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చి..సకాలంలో అనుమతి ఇవ్వలేదని చెప్పారు. దీంతో 5 గంటలు దీక్ష చేయడానికి కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నామన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే నాపరాయి పరిశ్రమపై వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయిస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్సీ ఎన్ఎండీ ఫరూక్ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తేనే రాయల్టీ సమస్యలు, గనుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. డోన్ ఇన్చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు మాట తప్పారని ధ్వజమెత్తారు. కళ్యాణ్‌రెడ్డి, ఐవీ పక్కీరారెడ్డి, పీఆర్ లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.