జడ్పీ సీఈవో.. భర్తీ అయ్యేనా
ABN , First Publish Date - 2022-12-31T01:07:42+05:30 IST
జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) పోస్టు నియామకం రాజకీయ సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య పంతాల కారణంగా అసలు ఈ పోస్టు భర్తీ చేస్తారో లేదోనన్న సందేహం కలుగుతోంది.
సీఎం వద్దే పెండింగ్‌లో ఫైల్
వివాదాస్పదంగా జడ్పీ చైర్పర్సన్ సీసీ తీరు
అస్తవ్యస్తంగా పాలన
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాల విభజన జరిగినా ఉమ్మడి కృష్ణాజిల్లాలోనే జిల్లా పరిషత్ పరిపాలన సాగుతోంది. పరిపాలనాపరంగా కీలకమైన జడ్పీ సీఈవో పోస్టును భర్తీచేసే విషయంలో జడ్పీ చైర్‌పర్సన్‌కు, మంత్రి జోగి రమేశ్‌కు మధ్య నెలకొన్న విభేదాలు ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేవు. దీంతో జడ్పీ డెప్యూటీ సీఈవో జి.శ్రీనివాసరావే ఇన్చార్జి సీఈవోగా కొనసాగుతున్నారు. గతంలో జడ్పీ సీసీవోగా పనిచేసిన సూర్యప్రకాశరావు గవర్నర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. దీంతో నాలుగు నెలలుగా జడ్పీ సీఈవో పోస్టు ఖాళీగానే ఉంటోంది. ఎప్పటికి ఈ పోస్టు భర్తీ చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
మంత్రి, జడ్పీ చైర్పర్సన్ మధ్య విభేదాలు
జడ్పీ సీఈవోగా గతంలో జడ్పీ ఏవోగా పనిచేసిన జ్యోతిబసును తీసుకొచ్చేందుకు మంత్రి జోగి రమేశ్ ప్రయత్నించారు. సీఎంవోలో మాట్లాడి ఉత్తర్వులు కూడా తెచ్చారు. జ్యోతిబసు మంత్రి జోగి రమేశ్‌కు అనుకూలమైన వ్యక్తి అనే కారణంతో జడ్పీ చైర్పర్సన్ వర్గీయులు ఈ పోస్టులోకి ఆయన రాకుండా అడ్డుకట్ట వేశారు. సుశీల అనే అధికారిని జడ్పీ సీఈవోగా నియమించాలని సీఎంకు ఫైల్ పంపారు. మంత్రి జోగి, జడ్పీ చైర్పర్సన్.. ఇద్దరూ వేర్వేరు వ్యక్తులను సిఫార్సు చేయడంతో సీఎం ఈ ఫైలుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వీరిద్దరూ కాకుండా ఇటీవల కాలంలో జడ్పీ సీఈవో పోస్టు కోసం మరికొంతమంది అధికారులు ప్రయత్నాలు చేశారు.
సీసీ తీరుపై విమర్శలు
జడ్పీ చైర్పర్సన్ క్యాంప్ క్లర్క్ (సీసీ) తీరుపై విమర్శలు వస్తున్నాయి. ప్రతి పనికీ ఓ రేటు నిర్ణయించి వసూళ్లకు పాల్పడుతున్నాడనే అంశంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన మొవ్వ మండ లానికి గత జూలైలోనే బదిలీపై వెళ్లినా ఇంకా జడ్పీ చైర్‌పర్సన్‌కు సీసీగానే కొనసాగుతున్నారు. జిల్లా పరిషత్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు మంజూరు చేయించే విషయంలో కాంట్రాక్టర్ల నుంచి ఈ సీసీ ముక్కుపిండీ మరీ వసూళ్లకు పాల్పడటం గమనార్హం. కైకలూరుకు చెందిన ఓ మహిళా కాంట్రాక్టర్ తాను చేసిన పనులకు బిల్లులు మంజూరు చేయించాలని కోరితే , లంచం ఇస్తేనే బిల్లు మంజూరవుతుందని, లేకుంటే కాదని తేల్చి చెప్పేశాడు. దీంతో ఈ బిల్లు అంశంపై ఏకంగా సదరు కాంట్రాక్టర్ కోర్టును ఆశ్రయించడంతో ఈ అంశం జడ్పీ ఉద్యోగుల్లో చర్చకు దారి తీసింది.
జడ్పీ ఉద్యోగుల్లో అభద్రతాభావం
పాలనను విభజించు, పాలించు అనే పద్ధతిలో ప్రస్తుతం జడ్పీలో పరిస్థితి ఉంది. ఇక్కడ పాలన ఒకే సామాజికవర్గం వారి కనుసన్నల్లో నడుస్తోంది. దీంతో మిగిలిన సామాజిక వర్గాలకు చెందిన ఉద్యోగులు అభద్రతాభావంతో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో జడ్పీ పాలకవర్గాల పదవీకాలంలో కొంతమేర సామాజికవర్గాల ప్రభావం ఉన్నా ఇంతగా ఎన్నడూ లేదని సీనియర్ ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగులను చులకనభావంతో మాట్లాడటం, ఒక్కోసారి వారికి సంబంధంలేని విషయాల్లోనూ పిలిపించి బెదిరింపు ధోరణితో మాట్లాడటం, పరుష పదజాలం ఉపయోగించడంతో ఉద్యోగులు తాము ఇక్కడ పనిచేయలేమని, ఎక్కడికైనా బదిలీ చేయాలని మంత్రులు, శాసనసభ్యుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పాలకవర్గం ఏర్పడ్డాక ఏడెనిమిది మంది ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిపై నియమించుకున్నారు. వీరు అధికారులు, సిబ్బందిపై పెత్తనం చెలాయిస్తుండటంతో ఉద్యోగులు అల్లాడిపోతున్నారు. జడ్పీ ఉన్నతస్థాయి ఉద్యోగులపైనా కాంట్రాక్టు ఉద్యోగులు పెత్తనం చేస్తుండటంతో పాలన అస్తవ్యస్తంగా మారింది.