జలదిగ్బంధం
ABN , First Publish Date - 2022-10-17T06:49:10+05:30 IST
జలదిగ్బంధం
తోట్లవల్లూరు/చల్లపల్లి/నాగాయలంక, అక్టోబరు 16: తోట్లవల్లూరు మండలంలోని పాములలంక, తుమ్మలపచ్చికలంక, తోడేళ్లదిబ్బలంక, కాళింగదిబ్బలంక, పొట్టిదిబ్బలంక, కనిగిరిలంక, ములకలపల్లిలంక గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగాయి. కొద్దిమంది మాత్రమే పడవలపై నిత్యావసరాల సరుకుల కోసం ప్రమాదకరంగా రాకపోకలు సాగిస్తున్నారు.
నీట మునిగిన వేలాది ఎకరాలు.. బాహ్య ప్రపంచంతో లంక గ్రామాలకు తెగిన సంబంధాలు
కృష్ణానదిలో వరద ఆదివారం ఉగ్రరూపం దాల్చింది. ఐదు లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేయడంతో పాయల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద చుట్టుముట్టడంతో లంక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. వేలాది ఎకరాల వాణిజ్య పంటలు ముంపులో ఉన్నాయి.

పంటల రవాణాకు కష్టం
తోట్లవల్లూరు లంకల్లోని అరటి గెలలు, కూరగాయలను బయటకు చేర్చేందుకు రైతులు ఎన్నో వ్యయప్రయాసాలు పడుతున్నారు. అరటి గెలలను పడవలో కృష్ణానదిపాయ దాటించేందుకు రూ.1,000 కిరాయి అవుతోందని, మళ్లీ అక్కడి నుంచి వ్యానులో రూ.1,500 కిరాయి చెల్లించి మార్కెట్‌కు తరలిస్తుంటే గెలకు కేవలం రూ.50 చేతికి వస్తున్నాయని రైతులు చెబుతున్నారు. పసుపు, కంద, చెర కు, కూరగాయతోటలు, పూలతోటలు ముంపులో ఉన్నాయి.

నీటిముంపులో వాణిజ్య పంటలు
చల్లపల్లి మండలంలోని లంకల్లో వాణిజ్య పంటలు ముంపులో ఉన్నాయి. నిమ్మగడ్డ, వెలివోలు, నడకుదురు, రాముడుపాలెం, ఆముదార్లంక, లచ్చిగానిలంకల్లోని పల్లపు ప్రాంతాల్లో అరటి, పసుపు, కంద తోటల్లోకి వరదనీరు చొచ్చుకువచ్చింది. నదికి ఆనుకుని ఉన్న పంటచేలు పూర్తిగా నీటి ముంపునకు గురికాగా, మరికొన్ని చేలల్లోకి నీరు వచ్చింది. నదీగర్భంలోని లచ్చిగానిలంక పల్లపు ప్రాం తాల్లోకి వరదనీరు ఇప్పుడిప్పుడే చేరుతోందని, మరో రెండ డుగులు పెరిగితే లంకలోని పంటలు నీటిముంపునకు గురు వుతాయని రైతులు చెబుతున్నారు. రోజుల తరబడి వరద ఉంటే పంటలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాముడుపాలెం పుష్కరఘాట్ మెట్లన్నీ పూర్తిగా నీటమునిగాయి. వెలివోలు లంకలో పట్టుపురుగుల షెడ్లు నీటిముంపులో ఉన్నాయి. ఆముదార్లంకలో నదీతీరాన ఉన్న కాలనీల్లోకి వరదనీరు వచ్చింది. వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తహసీల్దార్ కె.గోపాలకృష్ణ తెలిపారు. వీఆర్వోలు విధుల్లో ఉన్నారని పేర్కొన్నారు.

శ్రీరామపాదక్షేత్రంలో పెరుగుతున్న వరద
నాగాయలంక శ్రీరామపాదక్షేత్రం పుష్కర ఘాట్‌కు వరద పెరిగింది. ఘాట్‌లో ఉన్న కృష్ణవేణి విగ్రహం, రామలింగేశ్వరస్వామి మండపాన్ని కృష్ణమ్మ అలలు తాకుతున్నాయి. వరద పరవళ్లను వీక్షించేందుకు ప్రజలు ఘాట్‌కు విరివిగా వస్తున్నారు. ఘాట్‌లో ప్రమాద సూచిక బోర్డులు గానీ, బారికేడ్లు గానీ అధికారులు ఏర్పాటు చేయలేదు. మత్య్యకారులు నావలను ఒడ్డుకు చేర్చి, లంగర్లు వేశారు.
దివిసీమను చుట్టుముట్టింది
అవనిగడ్డ రూరల్: పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద 17 అడుగుల ఎత్తున 5 లక్షల 5 వేల క్కూసె క్కుల వరద నీరు ప్రవహిస్తోంది. నదీ తీరం వెంబడి గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మత్స్యకారులు సముద్రపు వేటను నిలిపి వేయాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆక్విడెక్ట్ వద్ద వరద క్రమేపీ పెరుగుతోంది. మరో 15 వేల క్కూసెక్కుల వరద పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు.

పాత ఎడ్లంక ప్రజల అవస్థలు
వరద కారణంగా పాత ఎడ్లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఈనెల 20న సీఎం జగన్ పర్యటన ఉండడంతో అధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. కృష్ణానది ఒడ్డున వైద్యశిబిరం ఏర్పాటు చేసినట్టు అధికారులు ప్రక టించినా, అటువైపు వారు ఇటు వచ్చే అవకాశం లేకపోవటంతో శిబిరం వెలవెలబోయింది. పడవలకు ఏర్పాటుకు అధికారులు సన్నాహాలు చేయక పోవడంతో ఒక్క పడవలోనే గ్రామస్థులు రాకపోకలు సాగిస్తున్నారు.

కట్లేరులో ఉధృతంగా..
గంపలగూడెం: తోటమూల - వినగడప రహదారిలో కట్లేరులో వరద ఉధృతంగా ప్రవహిస్తోంది. ధ్వంసమైన కట్లే రు వంతెన, డైవర్షన్ రహ దారిపై వరద పొంగి పొర్లుతోంది.