ఆసాంతం.. వారి సొంతం
ABN , First Publish Date - 2022-08-18T06:26:55+05:30 IST
ఆసాంతం.. వారి సొంతం

ఏకపక్షంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం
విపక్షానికి మాట్లాడే అవకాశమే లేదు..
వీధికో పేరు.. జంక్షన్‌కో విగ్రహమట..!
135 ప్రతిపాదనల్లో సగానికి పైగా ఇవే..
ప్రజా సమస్యలపై కనీస స్పందన శూన్యం
దోమలు, కుక్కల కోసమా కౌన్సిలంటూ మేయర్ వ్యాఖ్య
‘దోమలు, కుక్కలు, పందులు గురించా.. కౌన్సిల్ సమావేశం..’ వర్షాకాలం నగరంలో దోమల వృద్ధి పెరిగిందని, వాటి నివారణ చర్యలు ఏమీ లేవని, ప్రజలు వ్యాధుల బారిన పడుతున్నారని పలువురు కార్పొరేటర్లు ప్రస్తావించిన అంశానికి మేయర్ రాయన భాగ్యలక్ష్మి సమాధానం ఇది. నగరంలోని దోమలు, కుక్కల సమస్యను తేలిగ్గా తీసిపడేసిన మన మేయర్ వీధులకు పేర్లు.. జంక్షన్లలో విగ్రహాలు పెట్టుకోవడానికి ప్రతిపాదనలకు మాత్రం యథేచ్ఛగా అనుమతించేశారు. ఈ ఒక్క అంశం చాలు.. బుధవారం కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఎంత బాగా జరిగిందో తెలుసుకోడానికి..
చిట్టినగర్, ఆగస్టు 17 : మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షతన వీఎంసీ కౌన్సిల్ సమావేశం బుధవారం మొక్కుబడిగా జరిగింది. మొత్తం 135 ప్రతిపాదనలు పెట్టగా, సుమారు సగానికి పైగా.. అంటే 70 ప్రతిపాదనలు వీధిపేర్లు, జంక్షన్లలో విగ్రహాల ఏర్పాటుకు సంబంధించినవే. ప్రజా సమస్యలను పక్కనపెట్టిన పాలకపక్ష కార్పొరేటర్లు వీధులకు తమవారి పేర్లు, జంక్షన్లలో తమవారి విగ్రహాల ఏర్పాటుకు ప్రతిపాదలను పెట్టారు. దీనిపై విపక్షాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. చెత్తపన్ను రద్దు చేయాలని టీడీపీ, సీపీఎం కార్పొరేటర్లు కౌన్సిల్లో పలుమార్లు ప్రస్తావించినా పాలకపక్షం పట్టించుకోలేదు. చెత్తపన్ను ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనపై చర్చ జరగాలని సీపీఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు పట్టుబట్టారు. ఆయన సూచననూ వైసీపీ కార్పొరేటర్లు బేఖాతరు చేశారు. దీనిపై ఆయన అభ్యంతరం వ్యక్తంచేసినా ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో ఆయన మేయర్ పోడియం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సమావేశం ప్రారంభానికి ముందే ప్రజాసమస్యలు పరిష్కరించాలని, కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించి నగరాభివృద్ధికి కృషి చేయాలని టీడీపీ కార్పొరేటర్లు కార్పొరేషన్ గేటు నుంచి కౌన్సిల్ వరకు ర్యాలీగా వచ్చి నిరసన తెలిపారు. అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ పాడై ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని పాలక, ప్రతిపక్ష కార్పొరేటర్లు మేయర్ ద్వారా కమిషనర్‌ను కోరారు.
మహిళల పింఛన్లు పెంచండి
ఒంటరి మహిళల పింఛన్లపై కౌన్సిల్లో దుమారం రేగింది. టీడీపీ ఫ్లోర్‌లీడర్ బాలస్వామి, సీపీఎం ఫ్లోర్‌లీడర్ సత్యబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో 35 ఏళ్ల ఒంటరి మహిళలకు పింఛన్లు ఇచ్చేవారని, ప్రస్తుతం వయోపరిమితి 50 ఏళ్లకు పెంచడంతో ఎంతోమంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని కౌన్సిల్ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వైసీపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ 45 ఏళ్లకు ఆసరా, తదితర పథకాలు అందిస్తున్నామని, అంతకంటే ఇంకేం కావాలని ప్రతిపక్ష కార్పొరేటర్లతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు సమావేశం హోరెత్తింది. టిడ్కో ఇళ్లు, పింఛన్లకు సంబంధించి, మేయర్ ఇచ్చిన సమాధానాలపై సీపీఎం ఫ్లోర్‌లీడర్ సత్యబాబు ‘మేయర్ చెప్పింది నిజమేనా..’ అని ప్రశ్నించడంపై వైసీపీ కార్పొరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. సత్యబాబు క్షమాపణ చెప్పాలని సభను కొద్దిసేపు స్తంభింపజేశారు.
వీధిపేర్లు, విగ్రహాల ఏర్పాటుపైనే శ్రద్ధ
వైసీపీ కార్పొరేటర్లకు వీధిపేర్లు, విగ్రహాల ఏర్పాటుపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యలపై లేదని టీడీపీ ఫ్లోర్‌లీడర్ ఎన్.బాలస్వామి అన్నారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని మండిపడ్డారు. చెత్తపన్ను రద్దు చేయాలని ఆందోళన చేస్తున్నా పాలకపక్షం గుడ్డిగా వ్యవహరిస్తోందన్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు అందకుండా కోతలు విధిస్తున్నా రన్నారు. ఒంటరి మహిళలకు పింఛన్లు అందకుండా వయోపరిమితిని 35 నుంచి 50 ఏళ్లకు పెంచారని విమర్శించారు. కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించకుండా నగరాభివృద్ధికి ఆటంకంగా మారుతున్నారన్నారు. బిల్లు చెల్లించ కుండా కాంట్రాక్టర్లు ఎలా పనులు చేస్తారని, బిల్లు సక్రమంగా చెల్లిస్తే అభివృద్ధి పనులు సక్రమంగా జరిగి నగరం అభివృద్ధి చెందుతుందన్నారు.

వైసీపీ చీకటి పాలన
వైసీపీ చీకటి పాలన చేస్తోందని, ప్రజల గొంతుతో పాటు మీడియా గొంతు కూడా నొక్కుతోందని సీపీఎం ఫ్లోర్‌లీడర్ బోయి సత్యబాబు విమర్శించారు. చెత్తపన్ను కట్టించకుంటే ఉద్యోగుల జీతాలుండవని బెదరించడంతో పాటు చెత్తపన్ను కట్టకుంటే సంక్షేమ పథకాలు ఆపేస్తామని ప్రజలనూ బెదిరిస్తున్నారన్నారు. నాలుగేళ్లు అయినా పేదలకు ఒక ఇల్లూ ఇవ్వలేదన్నారు. స్ర్టాం వాటర్ నిధులు రూ.289 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కైంకర్యం చేసిందన్నారు. చిన్నపాటి వర్షాలకే జలమయం అవుతున్న రోడ్లు, గోతులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా వైసీపీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలతో సరిపెడుతోందని మండిపడ్డారు.
