అక్రమ తవ్వకాలపై మళ్లీ విజిలెన్స్‌

ABN , First Publish Date - 2022-03-18T06:49:11+05:30 IST

విజిలెన్స్‌కే సవాల్‌ విసురుతున్న మైనింగ్‌ మాఫియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రీ షాక్‌ ఇచ్చారు.

అక్రమ తవ్వకాలపై మళ్లీ విజిలెన్స్‌
విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేసిన లారీలు

కొండపావులూరులో మాఫియాకు మరో షాక్‌

సర్వే నెంబర్‌ 33, 34ల్లో తవ్వకాల గుర్తింపు 

నాలుగు టిప్పర్లు, రెండు ఎక్స్‌కవేటర్లు సీజ్‌ 

రెవెన్యూ ఉద్యోగులపై అధికారపక్ష గ్యాంగ్‌ ఆగ్రహం 

ప్రైవేటుగా సమావేశమైన ఉద్యోగులు.. 

అవసరమైతే సెలవు పెట్టాలని నిర్ణయం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ / గన్నవరం) విజిలెన్స్‌కే సవాల్‌ విసురుతున్న మైనింగ్‌ మాఫియాకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు రీ షాక్‌ ఇచ్చారు. గురువారం గన్నవరం నియోజకవర్గంలోని కొండపావులూరు గ్రామంలో మైనింగ్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ప్రత్యేక బృందాలు మరోసారి మెరుపుదాడులు నిర్వహించాయి. మైనింగ్‌ శాఖ దాడులు నిర్వహించి వెళ్లిన కొద్ది గంటల్లోనే భారీ ఎక్స్‌కవేటర్లతో రాత్రికి రాత్రి ఎకరాలకొద్దీ భూమిని తవ్వేసిన ఉదంతంపై ‘మైనింగ్‌ విజిలెన్స్‌కు... మాఫియా సవాల్‌!’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనాన్ని సాక్ష్యాలతో సహా ప్రచురించింది. ఈ కథనంపై మైనింగ్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు దృష్టి సారించాయి. పొరుగు జిల్లాల మైనింగ్‌ అధికారులతో కూడిన బృందాలు.. కొండపావులూరు గ్రామంలోని సర్వే నెంబర్‌ 33, 34లను తనిఖీ చేశాయి. అక్కడ పెద్ద ఎత్తున జరుగుతున్న తవ్వకాలను చూసి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు నిర్ఘాంతపోయాయి. ఆ సమయంలో తవ్వకాలు జరుపుతున్న రెండు భారీ ఎక్స్‌కవేటర్లను, లోడింగ్‌ కోసం వచ్చిన నాలుగు భారీ టిప్పర్లను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సీజ్‌ చేశారు. టిప్పర్లను గన్నవరం పోలీసుస్టేషన్‌కు తరలించి, ఎక్స్‌కవేటర్లకు లాక్‌ చేసి, తాళాలను గన్నవరం పోలీసులకు అప్పగించారు. గొల్లనపల్లిలో మరో రెండు లారీలను సీజ్‌ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు జరుపుతుంటే ఏమి చేస్తున్నారని, అక్కడే ఉన్న వీఆర్వోను అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. మైనింగ్‌ శాఖకు తెలియకుండా రెవెన్యూ అధికారులు అడ్డగోలుగా ఎలా అనుమతులు ఇస్తారని ప్రశ్నించినట్టు తెలిసింది. రెవెన్యూశాఖ ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని వీఆర్వో సమాధానం చెప్పినా విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు వినలేదు. మూడు రోజులుగా నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నామని, రెవెన్యూ అధికారులే అనుమతులిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయన్నారు. వీఆర్వోతో పంచనామా చేయించి, పోలీసుస్టేషన్‌కు వివరాలను పంపించారు. 


అధికారపక్ష ‘గ్యాంగ్‌’ ఓవరాక్షన్‌  

కొండపావులూరు మైనింగ్‌కు సంబంధించి అధికారపక్ష ‘గ్యాంగ్‌’ నుంచి రెవెన్యూ అధికార యంత్రాంగంపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. అక్రమ తవ్వకాలను ‘ఆంధ్రజ్యోతి’ సాక్ష్యాలతో సహా బట్టబయలు చేయడంతో రెవెన్యూ అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి మరీ, అనుమతులిప్పించిన ‘గ్యాంగ్‌’కు ఎదురుదెబ్బ తగిలింది. దీంతో తమ కాకను రెవెన్యూ ఉద్యోగుల మీద చూపుతోంది. ‘అనుమతులు ఇచ్చినట్టే ఇచ్చి.. మీడియాకు వివరాలు చెబుతారా?’ అంటూ బుసలు కొడుతోంది. ‘ఎవరికి చెప్పారు? ఎవరు రాశారు? సర్వే నెంబర్లతో సహా ఎలా తెలిశాయి? మీరు చెబితేనే కదా లీక్‌ అయ్యేవి?’ అంటూ ఫోన్లు చేస్తుండడంతో రెవెన్యూ అధికారులు భయపడిపోతున్నారు. ‘తవ్వుకోమంటే ఒక పాపం, తవ్వుకోవద్దంటే మరో పాపం.. మీడియాలో రావడం ఇంకో పాపం.. గన్నవరంలో పనిచేయలేకపోతున్నాం..’ అంటూ లబోదిబోమంటున్నారు. 


మూకుమ్మడి సెలవులు పెట్టాలని ఉద్యోగుల నిర్ణయం

గన్నవరం నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ క్వారీయింగ్‌ వ్యవహారంలో తాము దోషులుగా మారాల్సి వస్తోందని రెవెన్యూ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఈ వ్యవహారంపై ఆయా ప్రాంతాలకు చెందిన రెవెన్యూ ఉద్యోగులంతా ప్రైవేటుగా సమావేశం కావటం కలకలం రేపుతోంది. అధికారపక్ష గ్యాంగ్‌ ఒత్తిళ్ల గురించి ఆ సమావేశంలో చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ఏది పడితే అది చేయమనడం.. లేకుంటే బదిలీలు చేయిస్తామని బెదిరించడాన్ని తట్టుకోలేక పోతున్నామన్నది అందరి మాటగా ఉంది. గ్యాంగ్‌ చెప్పినట్టు చేయటం వల్ల దోషులు అవుతున్నామని ఆందోళన చెందినట్టు తెలిసింది. గ్యాంగ్‌ నుంచి ఇలాంటి ఒత్తిళ్లు మళ్లీ వస్తే ఇక మీదట మూకుమ్మడి సెలవులు పెట్టేద్దామని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులంతా ఏకం కావటం ఏ రకమైన పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే. 

Read more