హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

ABN , First Publish Date - 2022-03-05T05:56:16+05:30 IST

పట్టణంలోని వీరభద్రపురానికి చెందిన విశ్వనాథం కోటేశ్వరరావు (55) మృతి కేసులో నిందితులు సిద్ధాని సాంబమూర్తి, వాసా శ్రీనివాసరావులను అరెస్టు చేసినట్టు సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్‌ తెలిపారు.

హత్య కేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

పెడన : పట్టణంలోని వీరభద్రపురానికి చెందిన విశ్వనాథం కోటేశ్వరరావు (55) మృతి కేసులో నిందితులు సిద్ధాని సాంబమూర్తి, వాసా శ్రీనివాసరావులను అరెస్టు చేసినట్టు సీఐ ప్రసన్న వీరయ్య గౌడ్‌ తెలిపారు. పోలీసు స్టేషన్‌లో శుక్రవారం విలేకర్లతో మాట్లాడుతూ  వీరభద్రపురంలో పక్కపక్కన ఇళ్ళల్లో నివాసం ఉంటున్న కోటేశ్వరరావు, సిద్ధాని సాంబమూర్తి మధ్య సరిహద్దు విషయమై గత నెల 20న వివాదం ఏర్పడిందన్నారు. సాంబమూర్తి, అతని బంధువు శ్రీనివాసరావు కోటేశ్వరరావుపై దాడి చేశారు. ఆ దాడిలో కోటేశ్వరరావు మృతి చెందాడు. కొందరు పెద్దలు జోక్యం చేసుకుని విషయం కేసు వరకు వెళ్లకుండా రాజీ చేశారు. గత నెల 21న కోటేశ్వరరావు మృతదేహాన్ని శ్మశానవాటికలో ఖననం చేశారన్నారు. అయితే ఈనెల ఒకటో తేదీన తన భర్తను కొట్టి చంపేశారని కోటేశ్వరరావు భార్య ఉమాగౌరి తమకు ఫిర్యాదు చేయగా, రెండో తేదీన కోటేశ్వరరావు మృతదేహాన్ని వెలికి తీసి తహసీల్దార్‌ సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించామని సీఐ తెలిపారు. తొలుత అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని, శవ పంచాయతీ రిపోర్టులోని అంశాల ఆధారంగా తర్వాత కేసును హత్య కేసుగా మార్పు చేశామన్నారు.  నిందితులు సాంబమూర్తి, శ్రీనివాసరావులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామని సీఐ తెలిపారు. ఎస్సై మదీనా బాషా పాల్గొన్నారు.

Read more