నేడు మళ్లీ నరకమే..

ABN , First Publish Date - 2022-12-07T00:06:03+05:30 IST

మూడు రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనతో విజయవాడ వాసులకు రహదారులపై చుక్కలు కనిపించాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మరోసారి రాబోతోంది. నగరం మొత్తం బుధవారం ట్రాఫిక్‌ చిక్కులు ఉండబోతున్నాయి.

నేడు మళ్లీ నరకమే..

ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీ మహాసభ

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు

ఎంజీ రోడ్డుపై రాకపోకలు పూర్తిగా బంద్‌

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : మూడు రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనతో విజయవాడ వాసులకు రహదారులపై చుక్కలు కనిపించాయి. ఇప్పుడు ఆ పరిస్థితి మరోసారి రాబోతోంది. నగరం మొత్తం బుధవారం ట్రాఫిక్‌ చిక్కులు ఉండబోతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో వైసీపీ బీసీ మహాసభను నిర్వహించడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ మహాసభకు రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని ఇక్కడికి తీసుకువస్తున్నారు. దీనివల్ల పోలీసులు విజయవాడలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. సెలవు రోజు అయిన ఆదివారమే రాష్ట్రపతి పర్యటన కారణంగా వాహనదారులకు ట్రాఫిక్‌ చిక్కులు ఎదురయ్యాయి. అటువంటిది పనిదినం అయిన బుధవారం నాటి పరిస్థితి ఎలా ఉంటుందో ఇట్టే అర్థమవుతోంది.

అత్యవసర వాహనాలకే అనుమతి

నగరానికి ప్రధాన రహదారులు ఎంజీ రోడ్డు, ఏలూరు రోడ్డు. ఈ రెండింటిపైనా నగరంలోని సగం ట్రాఫిక్‌ ఉంటుంది. ఈ రెండు కనెక్టివిటీ రహదారులు. విజయవాడలో విస్తారంగా రహదారులు ఇవే. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే బీసీ మహాసభ కారణంగా ఎంజీ రోడ్డులో పూర్తిస్థాయి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అంబులెన్స్‌లు, అత్యవసరాలకు సంబంధించిన వాహనాలను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ముందుగానే ప్రకటించారు.

జాతీయ రహదారులపై మళ్లింపు

జాతీయ రహదారులపైనా ట్రాఫిక్‌ మళ్లింపులు ఉంటాయి. హైదరాబాద్‌, చెన్నై, కోల్‌కతా వైపు రాకపోకాలు సాగించే భారీ, మధ్యతరహా వాహనాలను అటు హనుమాన్‌ జంక్షన్‌, ఇటు గుంటూరు జిల్లా అవతలి వైపున మళ్లిస్తారు. ఉదయం ఆరు గంటల నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తాయి. మధ్యాహ్నం మూడు గంటలకు అమలులో ఉంటాయి. జాతీయ రహదారులకు అనుబంధంగా ఉన్న నగర రహదారులపై ఆంక్షలు కొనసాగుతాయి. వివిధ రహదారులపై ఉండే ట్రాఫిక్‌ మొత్తం కేవలం కొన్ని రహదారులపైనే ఉంటుంది. దీనితో వాహనాలు ఎక్కడికక్కడ స్తంభించిపోయే అవకాశం ఉంది. సభ ముగిసిన తర్వాత అన్ని వాహనాలు ఒకేసారి రహదారులపైకి వస్తాయి. మరోపక్క సీఎం జగన్‌ ఈ సభకు ముఖ్యఅతిథిగా వస్తున్నారు. ఆయన తాడేపల్లి నుంచి మధ్యాహ్నం మున్సిపల్‌ స్టేడియంకు చేరుకుంటారు. సభ అయిన తర్వాత తిరిగి తాడేపల్లికి వెళ్తారు. మళ్లీ అక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు.

Updated Date - 2022-12-07T00:06:04+05:30 IST